పనికో రేటు..లేకుంటే లేటు !

by  |
పనికో రేటు..లేకుంటే లేటు !
X

అవినీతికి కేరాఫ్ ఆర్టీఏ ఆఫీస్

దిశ, వరంగల్ :
ప్రమాదాల నివారణ పేరిట అనేకానేక నిబంధనలు, జరిమానాలతో వాహనదారులను బెంబేలెత్తించే ఆర్టీఏ అధికారులు..అక్రమార్జనలోనూ తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు. సాధారణంగా రూల్స్ పాటిస్తే ఏ పనైనా సులభంగా అయిపోతుంది. కానీ వరంగల్ రవాణా శాఖ కార్యాలయం మాత్రం అందుకు విరుద్ధం. ఇక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సిందే. లేకుంటే సగం పనే‌ అవుతుంది. అడిగినంత ఇస్తే చాలు ఎలాంటి పరీక్షలు లేకుండానే లైసెన్స్‌లు జారీ చేయడం ఇక్కడి ఆర్టీఏ అధికారులకు పరిపాటి. మళ్లీ ‌ఇక్కడో‌ తిరకాసుందండోయ్.. నేరుగా అధికారుల వద్దకు వెళ్తే మీ పని కానేకాదు.. ఏ పని కోసమైనా ముందుగా బ్రోకర్లను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారి ద్వారానే పని పూర్తవుతుంది. ఈ వ్యవహారాలన్నీ అక్కడ నిత్యకృత్యాలే..!
ఆన్‌లైన్‌లో లెర్నింగ్ లైసెన్స్ కోసం టూ వీలర్ అయితే రూ. 300, అదే టూ వీలర్‌తో కలిపి ఫోర్ వీలర్‌కు రూ. 450 ఆన్‌లైన్‌లో చెల్లించి, ఆర్టీఏ కార్యాలయానికి వెళితే అధికారులు చెక్ చేసి ఫోటో తీసి లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. నెల నుంచి ఆరు నెలల లోపు రూ. 1350 చెల్లిస్తే పర్మినెంట్ లైసెన్స్ తీసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసి ఆర్టీఏ అధికారుల వద్దకు వెళితే ఆధార్ కార్డులు, సర్టిఫికెట్లు లేవంటూ కొర్రీలు పెట్టి దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌కు రూ. 2 వేలు, పర్మినెంట్ లైసెన్స్‌కు రూ. 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఫిట్‌నెస్, పేరు మార్పు, ఇతర పనుల కోసం వేలాది రూపాయలను వాహనదారుల నుంచి ముక్కు పిండి వసూలు ‌చేస్తున్నారు.

ఏజెంట్లదే హవా..!

ఆర్టీఏ ఆఫీస్‌లో చక్రం తిప్పేది ఏజెంట్లే. కార్యాలయ పరిసరాల్లోనే దర్శనమిచ్చే వీరంతా ఎవరికీ అనుమానం రాకుండా జిరాక్స్ షాపులు, మొబైల్ దుకాణాలు, రీచార్జ్, టిఫిన్ సెంటర్స్, బుక్ సెంటర్స్, రేడియం, కలర్ జిరాక్స్ షాపుల పేరిట ఈ తరహా దందాలు కొనసాగిస్తున్నారు. వీరు చెప్పందే ఆఫీస్‌లో ఏ ఫైల్ కదలదు. పనికో రేట్ ఫిక్స్ చేసిన ఏజెంట్లు తాము తీసుకున్న డబ్బుల్లోంచి అధికారులకు కొంత ముట్ట జెప్పి వాహనదారులకు పనులు చేసిపెడుతున్నారు. అందుకే వాహనదారుడు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ కోసం రూల్స్ ప్రకారం అన్ని ప్రూఫ్స్‌తో వచ్చినా పనులు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రోజుకు లక్షల రూపాయలు దోపిడీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు రూ. 2500 – 3000 వరకు లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నా..ఇందులో నేరుగా పొందే వారు మాత్రం వందల సంఖ్యలోనే ఉంటారు. ఒక్కో బ్రోకర్ లేదా ఏజెంట్ తన తరఫున 20 నుంచి 30 వరకు లైసెన్స్ పత్రాలను ఆఫీస్‌లోకి తీసుకెళ్తారు. వారికి ప్రత్యేకంగా కోడ్ ఏర్పాటు చేసుకుని అధికారులతో పనులు చక్కబెట్టుకుంటారు. ఈ మాదిరిగా వాహనదారుల నుంచి రోజుకు లక్షలాది రూపాయలు దండుకుంటూ.. దళారులు, అధికారులు ‘తలా పాపం తిలా పిడికెడు’ అన్నట్టుగా గుట్టు చప్పుడు కాకుండా పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆర్టీఏ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి కార్యాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Tags: RTA Office Warangal, License, Brokers, Collect money

Next Story

Most Viewed