వచ్చే ఐదేళ్లలో 90 శాతం పెరగనున్న మహిళా పారిశ్రామికవేత్తలు!

by  |
వచ్చే ఐదేళ్లలో 90 శాతం పెరగనున్న మహిళా పారిశ్రామికవేత్తలు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాపారాలు రాబోయే ఐదేళ్లలో 90 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం..మహిళల సారథ్యంలో నిర్వహించబడుతున్న వ్యాపారులు ప్రభుత్వ పథకాల మద్దతు చాలా తక్కువగానే తీసుకుంటున్నారని తేలింది. ప్రముఖ దాతృత్వ సంస్థ ఎడెల్‌గివ్ ఫుండేషన్ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. తయారీ, రిటైల్, సేవల రంగాల్లో కొనసాగుతున్న సుమారు 3,300 మంది మహిళా పారిశ్రామికవేత్తల నుంచి వివరాలను సేకరించారు. వీరిలో 1,235 మంది పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. అంతేకాకుండా వారితో పాటు వారి కుటుంబసభ్యులు, ఉద్యోగులు, క్లయింట్‌లను ఇంటర్వ్యూ చేసినట్టు, అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతిచ్చే 20 స్వచ్ఛంద సంస్థలతో లోతైన ఇంటర్వ్యూలను జరిపినట్టు ఈడెల్‌గివ్ సంస్థ తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం.. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 80 శాతం మంది మహిళలు ఓ సంస్థను ప్రారంభించిన తర్వాత వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదల కనబరిచారు.

మహిళా వ్యవస్థాపకుల కోసం అనేక ప్రభుత్వ పథకాలు, విధానాలు ఉన్నప్పటికీ, అవసరమైన స్థాయిలో వారికి చేరడంలేదని ఈ అధ్యయనంలో తేలింది. మహిళా పారిశ్రామికవేత్తలలో కేవలం 1 శాతం మంది మాత్రమే ఏదైన ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకున్నారు. దీనికి కారణం, కేవలం 11 శాతం మందికి మాత్రమే ఇలాంటి పథకాలు, విధానాల గురించి తెలియడమని స్పష్టమైంది. ఈ అధ్యయనం మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదల మొత్తం ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి వారి సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత అంశాల నుంచి ప్రభుత్వం, ఎన్‌జీఓలు, కార్పొరేట్ల పాత్రల గురించి దృష్టి సారించింది.

గతం కంటే ఇటీవల మహిళా పారిశ్రామికవేత్తల సామాజిక జీవితం మెరుగుపడింది. అయితే, మహిళా పారిశ్రామికవేత్తలు మార్కెటింగ్, ఉత్పత్తి, సాంకేతిక(టెక్నాలజీ), సోషియో-కల్చరల్ సవాళ్లతో పాటు వారికి అందుబాటులో ఉన్న ఆర్థిక పరిజ్ఞానం, వనరుల వంటి గణనీయమైన అంతరాలు ఎదుర్కొంటున్నారని ఈడెల్‌గివ్ తెలిపింది. వీటిలో ఆర్థిక సాయం, పథకాల గురించి అవగాహన లేకపోవడం, అవసరమైన డాక్యుమెంట్‌లు వారికి అందుబాటులో లేకపోవడం, తనఖా పెట్టేందుకు అవసరమైన ఆస్తులు లేకపోవడం వంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి. భారత్‌లో మహిళా పారిశ్రామికవేత్తల యాజమాన్యంలోని వ్యాపారాలు ఐదేళ్లలో 90 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదే కాలంలో అమెరికాలో 50 శాతం, యూకేలో 24 శాతం వృద్ధి నమోదవచ్చని అధ్యయనం వివరించింది.


Next Story

Most Viewed