50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్

by  |
50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ర్టంలోని సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన అనుమతులకు స్వల్ప మార్పులు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సోషల్‌, అకడమిక్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, కల్చర్‌, రిలీజియస్‌, పొలిటికల్‌ ఫంక్షన్స్‌తో పాటు ఇతర సమావేశాలకు గాను కంటైన్మెంట్‌ ప్రాంతాలకు ఆవల 100 మంది వ్యక్తుల పరిమితితో ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య వందకు మించితే ఈ కింది జాగ్రత్తలు పాటిస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతులు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది.

మూసి ఉన్న ప్రదేశాల్లోనైతే హాల్‌ సామర్థ్యంలో 50 శాతం వరకు పరిమితి ఇచ్చింది. 200 మంది వరకు అనుమతి. ఫేస్‌ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్‌‌తో పాటు హ్యాండ్‌ శానిటైజర్‌ను ఉపయోగించాలని సూచించింది. అదే బహిరంగ ప్రదేశాల్లోనైతే గ్రౌండ్ సామర్థ్యాన్ని బట్టి సంబంధిత వ్యక్తుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ఎక్కువ సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలైతే సంబంధిత జిల్లా కలెక్టర్, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్, ఎస్పీ, స్థానిక సంస్థల అనుమతి తీసుకోవడంతో పాటు ఫేస్‌ మాస్కులు, థర్మల్‌ స్క్రీనింగ్‌, హ్యాండ్‌ వాష్‌ లేదా శానిటైజర్ తప్పనిసరి అని తెలిపింది.

థియేటర్స్ ఇప్పటికే చాలా చోట్ల తెరిచారు. నిజానికి అన్ లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచే థియేటర్స్, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చని కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. పలు చోట్ల థియేటర్స్‌ ఓపెన్ చేసినా తెలంగాణలో మాత్రం ఎగ్జిబిటర్లు ఒకే మాటపై ఉన్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో పరిస్థితులు మారనున్నాయి. ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే ఇక్కడ కూడా థియేటర్స్ ఓపెన్ చేసే విషయమై ఎగ్జిబిటర్లు ఆలోచన చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి రాష్ర్టంలో కూడా థియేటర్స్ ఓపెన్ అవ్వొచ్చని తెలుస్తుంది. దీనిపై అతి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



Next Story

Most Viewed