వారిని ప్రభుత్వం టార్గెట్ చేసిందా..?

200

దిశ, న్యూస్ బ్యూరో : ఉద్యోగ వర్గాలకు రోజుకో టెన్షన్ పట్టుకుంటోంది. మరోవైపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకూ పింఛన్ తిప్పలు తప్పడం లేదు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు తాత్కాలిక కోత పెట్టిన ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగులకు చెల్లించే పింఛన్‌లోనూ కోత పెట్టింది. మూడు నెలలుగా 25 శాతం తగ్గించింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా పింఛన్‌దారులకు మాత్రం 25% కోత కంటిన్యూ అయ్యేలా ఉందనే అనుమానాన్నిరిటైర్డ్ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసి పింఛన్లపై బతుకుతున్న తమకు పూర్తి స్థాయిలో చెల్లించాలని పింఛన్‌దారుల తరపున హైకోర్టులో పిటిషన్ వేయడం కొత్త చిక్కులు తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరిగ్గా ఈ సాకుతోనే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాన్ని చెల్లించి పింఛనుదారులకు మాత్రం 25 శాతం కోతను అలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం పలువురిని టార్గెట్ చేసి పింఛన్‌దారుల్లో యూనియన్లు లేకుండా, సంఘం నేతల పెత్తనం సాగకుండా చేసేందుకు సిద్ధమైందనే చర్చలూ ఉన్నాయి. పింఛన్‌దారుల తరపున పిటిషన్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వ పింఛన్‌దారుల జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య ఈసారి పూర్తిస్థాయిలో పెన్షన్ రాకుంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి కూడా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.

పాత తేదీల్లో ఆర్డినెన్స్ ఎలా చెల్లుబాటవుతుంది?

వేతనాల కోతపై ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును పింఛన్‌దారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరోనా కాలంలో కాకుండా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడుతున్న క్రమంలో ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రభుత్వ అంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. పాత తేదీల నుంచి అమలయ్యేలా ఆర్డినెన్స్ తీసుకురావడం చట్ట విరుద్ధమన్నారు. పింఛనులో కోతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశామని, ఇప్పుడు ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నట్లు జేఏసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇప్పుడిస్తారా..?

“ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ప్రభుత్వ కార్యకలాపాలు, ఆదాయం వచ్చే శాఖలన్నీ పని చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా కూడా విడుదలైంది. అయితే గత నెలలోనే పూర్తి వేతనాలు, పింఛన్లు ఇస్తారని అనుకున్నాం. కానీ నిరాశే మిగిల్చింది. ఆర్డినెన్స్ తీసుకువచ్చినా ఉద్యోగులకు మొత్తం వేతనాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ సూచనప్రాయంగా తెలిపింది. కోత పెట్టిన మూడు నెలల వేతనాలను కూడా దశలవారీగా విడుదల చేయనున్నట్లు చెప్తోంది. కానీ పింఛన్ల విషయంలో ప్రభుత్వ వైఖరి తెలియడం లేదు. మొత్తం ఇస్తుందో లేదో అనుమానమే” అని జేఏసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యోగ సంఘాల నేతలను నామరూపాల్లేకుండా అణచివేసింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంలో యూనియన్లు, యూనియన్ నేతలను లేకుండా చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా జేఏసీ పేరుతో పింఛన్‌దారుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడుతున్న జేఏసీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టుకెక్కినందున విచారణ జరుగుతున్నంత కాలం 25 శాతం కోత పెట్టాలనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

అసరమైతే సుప్రీంకోర్టుకు వెళతాం : లక్ష్మయ్య, పింఛన్‌దారుల జేఏసీ చైర్మన్

సర్కారు ఈసారి కూడా 25 శాతం కోత పెట్టి చెల్లిస్తే పోరాటం తీవ్రం చేస్తాం. ఇప్పటికే మూడు నెలలు కోత పెట్టింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే వేతనాలు, పెన్షన్లలో కోత పెడుతోంది. విచారణ సాగుతున్నా పూర్తిస్థాయి చెల్లింపులు చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. హైకోర్టులో తేలకుంటే అవసరమైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం.