రోజర్ ఫెదరర్ శకం ముగిసినట్లే..!!

by  |
రోజర్ ఫెదరర్ శకం ముగిసినట్లే..!!
X

దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ ప్రపంచాన్ని గత కొన్నేళ్లుగా బిగ్ త్రీగా పిలువబడే రఫెల్ నదాల్, నోవాక్ జకోవిచ్, రోజర్ ఫెదరర్‌లు ఏలుతున్నారు. గ్రాండ్ స్లామ్ దగ్గర నుంచి ఏటీపీ టూర్ వరకు ఏ టోర్నీలో అయినా వీరిదే హవా. యువకులు, కొత్త వాళ్లు వీరిపై పోటీ పడినా చివరకు ఏ క్వార్టర్ ఫైనల్‌లోనో.. సెమీఫైనల్‌లోనే వెనక్కు వెళ్లాల్సిందే. 2005 నుంచి ఇప్పటి వరకు 64 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు జరగ్గా.. 54 టైటిల్స్ వీరి ముగ్గురి ఖాతాలోనే పడ్డాయంటే వీరి ఆధిపత్యం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. వీరి ముగ్గురిలో రోజర్ ఫెదరర్ హవా ఎక్కువ. ఎలాంటి కోర్టులో అయినా ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడం ఫెదరర్‌కు అలవాటు. ఫెదదర్ కోర్టులో అడుగుపెడితే వార్ వన్ సైడ్ అనేలా మ్యాచ్‌లు జరిగేవి. ఎన్నోసార్లు ప్రత్యర్థి మ్యాచ్ పాయింట్ల వద్దకు వచ్చినా.. పట్టుదలతో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఫెదరర్ పవర్ గేమ్ ముందు ప్రత్యర్థులు తలవంచాల్సిందే. అలా రికార్డు స్థాయిలో 20 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచిన ఫెదరర్.. ఈ మధ్య వెనకబడ్డాడు. మోకాలి శస్త్ర చికిత్స చేసుకొని పునరాగమనం చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏడాది పైగా టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉన్న ఫెదరర్.. గతంలో మాదిరిగా ఆడగలడా అనేది సందేహమే. బాధపెడుతున్న గాయాలు, దూసుకొస్తున్న యువక్రీడాకారుల నడుమ ఫెదదర్ శకం ముగిసిపోయిందని టెన్నిస్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

అప్పటి నుంచే…

2003లో తొలి సారిగా వింబుల్డన్ గెలిచిన రోజర్ ఫెదరర్.. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్‌లో ఆధిపత్యం చెలాయించాడు. గ్రాస్ కోర్టు, హార్డ్ కోర్టులో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన రోజర్ ఫెదరర్‌కు క్లే కోర్టులో మాత్రం రఫెల్ నదాల్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. 20 గ్రాండ్‌స్లామ్స్ గెలిచినా దానిలో క్లే కోర్టుపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్ (2009) కేవలం ఒక్క సారి మాత్రమే గెలిచాడు. అంతకు ముందు ఏడాదే ఫెదరర్ వెన్ను నొప్పితో బాధపడి చికిత్స తీసుకున్న ఫెదరర్ తిరిగి వచ్చిన తర్వాత తన ఫామ్‌ను కొనసాగించాడు. అయితే 2013లో మరోసారి వెన్నునొప్పి తీవ్రంగా మారింది. దీంతో ఆ ఏడాది దాదాపు పరాజయాలే వెంటాడాయి. 2013లో ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేదు. ఆ ఏడాది కేవలం గారీ వెబర్ ఓపెన్ టైటిల్ మాత్రమే గెలిచాడు. అదే ఏడాది తన కోచ్ పాల్ అన్నాకోన్‌ను తప్పించాడు. గాయాలు, కోచ్‌లు మారడంతో ఫెదరర్ విజయాల శాతం పడిపోయింది. అదే ఏడాది స్టెఫాన్ ఎడ్‌బర్గ్‌ను సహాయక కోచ్‌గా నియమించుకున్నాడు. ఆ ఏడాది వెన్నునొప్పికి చికిత్స తీసుకున్న అనంతరం కొత్త కోచ్‌తో తిరిగి ఫామ్‌ను దక్కించుకున్నాడు. 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలుచుకోవడమే కాకుండా ఓపెన్ ఎరాలో 1000 మ్యాచ్‌లో గెలిచి జిమ్మీ కానర్స్, ఇవాన్ లెండి వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వరుసగా 15 ఏళ్ల పాటు ఏదో ఒక టైటిల్ గెలిచిన ఏకైక టెన్నిస్ ప్లేయర్‌గా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు. అయితే 2018లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన తర్వాత ఫెదరర్ మరో గ్రాండ్‌స్లామ్ గెలవలేదు. ఆ తర్వాత అతడు మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

గాయం నుంచి కోలుకున్నా..

2020 ఆస్ట్రేలియా ఓపెన్‌లో గాయంతోనే మ్యాచ్‌లు ఆడాడు. ఆ టోర్నీలో మధ్యలోనే నిష్క్రమించిన ఫెదరర్ వెంటనే రెండు మోకాలి సర్జరీలు చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యాడు. గత ఏడాది జరిగిన యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలను మిస్ అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఏ టోర్నమెంట్ కూడా ఆడలేదు. అదే సమయంలో యువ క్రీడాకారులు అలెగ్జాండర్ జ్వెరెవ్, డోమినిక్ థీమ్, రూబ్లేవ్, సిట్సిపాస్ వంటి యువకులు దూసుకొని వచ్చారు. నదాల్, జకోవిచ్ వంటి ఆటగాళ్లకు కూడా షాక్ ఇస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఏడాదిన్నరగా కోర్టుకు దూరంగా ఉన్న ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అంతకు ముందు వార్మప్‌గా జెనీవా ఓపెన్‌లో తలపడనున్నాడు. ఫెదరర్ చివరి సారిగా 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు. అతడి ఖాతాలో అప్పటి నుంచి మేజర్ టైటిల్స్ ఏమీ లేవు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్ రికార్డును రఫెల్ నదాల్ సమం చేశాడు. మరోవైపు నోవాక్ జకోవిచ్ కూడా అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డుపై కన్నేశాడు. ఒకవైపు దిగ్గర ప్లేయర్లు, మరోవైపు యువ టెన్నిస్ ప్లేయర్ల నడుమ ఫెదరర్ తన పాత ఫామ్ కొనసాగించడం కష్టమేనని అంటున్నారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ తర్వాత ఫెదరర్ తన కెరీర్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story