జల వివాదాలపై కేంద్రం మౌనం అందుకేనా..?

by  |
AP-TS Water Disputes
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలు హీటెక్కుతున్నాయి. నీళ్ల లొల్లి రాజకీయ విమర్శలకు వేదికగా మారుతున్నాయి. ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుందంటూ తెలంగాణ… తెలంగాణే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ ఏపీ మంత్రులు ఘాటుగా విమర్శించుకుంటున్నారు. అయితే నీళ్ల వివాదాలను మేం చూసుకుంటామని చెప్పుతూ వస్తున్న కేంద్రం ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను ఓ వేడుకలా చూస్తోంది. గత ఏడాది నిర్వహించిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశంలో కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను ఉపసంహరించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో కేసును ఉపసంహరించుకుని కేంద్రానికి సమాచారమిచ్చింది. ఇదే సమయంలో జల వివాదాలు ఎక్కువయ్యాయి.

కృష్ణా నీళ్ల దొంగలు మీరంటే మీరే అంటూ రెండు రాష్ట్రాలు ఒక్కసారిగా విమర్శలు పెంచాయి. రెండు రాష్ట్రాల మంత్రులూ రోజూ ఆరోపణలు సంధించుకుంటున్నారు. కానీ మొన్నటి వరకు కేంద్రం చేతికి పగ్గాలిచ్చిన రెండు రాష్ట్రాలు ఇప్పుడు మాత్రం పరస్పరంగా విమర్శలకు దిగుతున్నాయి. ఇప్పటి నుంచి నీళ్ల సెంటిమెంట్​ను రగిలిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

కేంద్రం మౌనమెందుకు..?

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంపుతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పనులను మొదలుపెట్టడంతో తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం మొదలైంది. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పడుతుందని, నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతుండగా… ఏపీ ప్రభుత్వం మాత్రం శ్రీశైలంలో వరదనీరు మాత్రమే తరలిస్తున్నామని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. ఈ జల జగడంతో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సత్సంబంధాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది.

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల జల జగడం రగులుతుండడంతో కేంద్రం రంగంలోకి వచ్చినట్లు చేసింది. గతేడాది అక్టోబర్​6న అపెక్స్​ కౌన్సిల్​ భేటీ నిర్వహించింది. ఇరు రాష్ట్రాలూ నీళ్ల వివాదాలను కేంద్రం ముందుంచాయి. కృష్ణా వాటా అంశంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్​ను ఉపసంహరించుకుంటే కేంద్రం పరిష్కరిస్తుందని చెప్పాయి. ప్రధానంగా అదే సమస్య కావడంతో.. తెలంగాణ కూడా పిటిషన్​ను ఉపసంహరించుకుంది. గత నెల 9న పిటిషన్​ను ఉపసంహరించుకుని కేంద్రానికి సమాచారమిచ్చారు. అయితే అప్పటి నుంచి ఈ వివాదాలు మరింత పెరిగాయి. కానీ కేంద్రం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కనీసం రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు కూడా చేయడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ఇంకా పెరగాలనే ఉద్దేశంతో చూస్తున్నట్లుగా కేంద్ర వ్యవహారం ఉంటోంది. ఇటీవల కేంద్రమంత్రికి ఈ వివాదాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్​మరోసారి వివరించారు. దీంతో రాయలసీమ పనులను పరిశీలించాలని నిపుణుల కమిటీకి సూచించారు.

మళ్లీ అదే కథ

రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలపై కృష్ణాబోర్డు పరిధిలోని నిపుణుల కమిటీ కేంద్రానికి లేఖ పంపింది. కేంద్ర బలగాలు ఇవ్వాలని, ఏపీ పోలీసులను నమ్మలేమని, గతంలో సాగర్​, ఆర్డీఎస్​ దగ్గర నీళ్ల లొల్లి ఉదంతాలను చెప్పుతూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టలేమంటూ లేఖలో పేర్కొంది. అయితే ఈ నెల 3 లేదా 4 తేదీల్లో పర్యటన ఉంటుందని అంచనా వేశారు. కానీ కేంద్రం నుంచి గురువారం రాత్రి వరకు కూడా ఎలాంటి రిప్లై రాలేదు. పర్యటన ఉంటుందా… లేదా అనేదానిపై కూడా క్లారిటీ రావడం లేదు. నిపుణుల కమిటీ మాత్రం కేంద్రం ఆదేశాల కోసం ఎదురుచూస్తూనే ఉంది.

మమ్మల్నేం చేయమంటారంటూ బోర్డు లేఖ

మరోవైపు కృష్ణా బోర్డు కూడా కేంద్రాన్ని వివరణ కోరింది. జల వివాదాలు పెరుగుతుండటం, ఏపీ, తెలంగాణ లేఖలు రాయడం, విద్యుత్​ జల ఉత్పత్తి చేస్తుండటం వంటి అంశాలన్ని సూచిస్తూ లేఖ పంపింది. ఇప్పుడు కృష్ణా బోర్డు చేయాల్సిందేమిటో చెప్పాలంటూ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. కానీ దీనికి కూడా కేంద్రం నుంచి సమాధానం రాలేదు.

నీళ్ల రాజకీయాలేనా..?

ప్రస్తుతం ఈ వ్యవహారమంతా నీళ్ల రాజకీయమే అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఒక వ్యూహం ప్రకారం వివాదాలకు దిగుతున్నాయని, దీన్ని కేంద్రం కూడా నిర్లక్ష్యం చేస్తుండటం వ్యూహంలో భాగమేననే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కృష్ణా జలాల అంశంపై ముందుగా బీజేపీ నేతలు కూడా ఏపీ వైఖరిని ఖండించారు. కానీ ఈ వారం రోజుల నుంచి కొంత సైలెంట్​అయ్యారు. అంటే కేంద్రం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ జల వివాదాలను తమకు రాజకీయంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. నీళ్ల అంశాలతో రెండు రాష్ట్రాల జుట్టు తమ చేతిలో పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

అదునుగా తీసుకుంటారా..!

మరోవైపు పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మరింతగా జోక్యం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న దాదాపు పదిహేను ప్రాజెక్టుల వివరాలను నదీ బోర్డుల యాజమాన్యాలు కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ప్రారంభించారు అనే దాని దగ్గర నుంచి ఎంత ఖర్చు చేశారు.. వాటి వల్ల సాగులోకి వచ్చిన భూమి ఎంత అనే వివరాలన్నీ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. వాటికి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఉన్నాయా లేవా అని కూడా కేంద్రం ఆరా తీస్తోంది.

వారం కిందట వరకు పెద్దగా జల వివాదాలు లేని తెలుగు రాష్ట్రాలు హఠాత్తుగా లేఖలు.,. ఆరోపణలు.. ఫిర్యాదులు చేసుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో తమ మధ్య సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, కేంద్రం జోక్యం అవసరం లేదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొప్పగా చెప్పారు. కానీ వారే స్వయంగా నదీ యాజమాన్య బోర్డులకు, జలశక్తి మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల వివరాలన్నింటినీ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ముందుకెళ్లకుండా చేసే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతుందంటున్నారు.

వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుంటే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు రిస్క్‌లో పడతాయి. కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌లో అనుమతి తీసుకుని మాత్రమే ప్రారంభించాలనే నిబంధనలున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత ఆరేళ్లలో కట్టిన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదు. అవన్నీ పాత ప్రాజెక్టులని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. కానీ తమవే పాతవి అని పొరుగు రాష్ట్రానివి కొత్తవని పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతలపైనే ప్రధాన దృష్టి పెట్టారు. కానీ దీని వివరాలను చెప్పేందుకు ఏపీ వెనకాడుతూనే ఉంది. కానీ కేంద్రం మాత్రం ముందుగా అన్ని ప్రాజెక్టుల డీపీఆర్​లను ఇవ్వాలంటూ మెలిక పెడుతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed