తొమ్మిది నెలల గరిష్టానికి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం!

by  |
తొమ్మిది నెలల గరిష్టానికి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో హోల్‌ సేల్ ద్రవ్యోల్బణం సూచీ(డబ్ల్యూపీఐ) నవంబర్‌లో 1.55 శాతానికి పెరిగింది. ఇది గత తొమ్మిది నెలల గరిష్టమని సోమవారం ప్రభుత్వం గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో ఆహార పదార్థాల ధరలు తగ్గినప్పటికీ తయారీ రంగ ఉత్పత్తుల ధరలు పెరగడమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 1.48 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఏడాదిలో ఫిబ్రవరి నెల తర్వాత అధిక ద్రవ్యోల్బణం నమోదైంది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ సూచీ 2.26 శాతంగా నమోదైంది.

ఈ పరిణామాలు కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ నుంచి ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలను చూపిస్తున్నది. అదేవిధంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ 3.94 శాతానికి తగ్గిపోయింది. ఇది అక్టోబర్ నెలలో 6.37 శాతంగా ఉంది. ఆహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం 8.34 శాతంగా నమోదవగా, కూరగాయల ధరలు 12.24 శాతం, బంగాళదుంప ధరలు 115.12 శాతంగా పుంజుకున్నాయి. అయితే, నవంబర్ నెలకు సంబంధించి ఇంధన, విద్యుత్ ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి.

ఇటీవల దేశ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణ మరింత కాలం గరిష్ఠస్థాయిలోనే ఉండొచ్చని ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా, డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. ‘రానున్న నెలల్లో హోల్‌సేల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఉత్పాదక రంగంలో మెటల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ముడి చమురు ధరలు ఇటీవల పెరుగుతున్నాయని’ ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వెల్లడించింది.


Next Story

Most Viewed