‘ప్లాన్ ఛేంజ్’.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్ పార్టీ నయా స్ట్రాటజీ..!

by Disha Web Desk 19 |
‘ప్లాన్ ఛేంజ్’.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్ పార్టీ నయా స్ట్రాటజీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ మరో కొత్త స్ట్రాటజీని అమలు చేయనున్నది. కుల, మత సంఘాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళా సంఘాలతో వరుసగా వేర్వేరుగా మీటింగ్‌లు పెట్టనున్నది. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కోరనున్నారు. ఆయా సంఘాల డెవలప్‌మెంట్‌పై కాంగ్రెస్ హామీలు ఇవ్వనున్నది. సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామంటూ భరోసా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీలో తీర్మానం చేశారు.

ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఈఎంసీలోని ఒక్కో మెంబరు రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఈ మీటింగ్‌లను నిర్వహించనున్నారు. స్థానిక లీడర్ల సహకారంతో ఒక రోజులో రెండు, మూడు కుల సంఘాలతో మీటింగ్‌లను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తున్నది. ఈ మేరకు రెండు రోజుల క్రితం గాంధీభవన్‌లో స్టేట్ ఈఎంసీ మీటింగ్ జరిగింది. ఈ సమీక్షలో లోక్‌సభ సెగ్మెంట్ల రూట్‌మ్యాప్‌ను తయారు చేసినట్టు ఓ మెంబరు తెలిపారు. సోమవారం నుంచి ఈ టీమ్‌వర్క్ ప్రారంభం కానున్నది.

గ్యారెంటీలతో పాటు రిజర్వేషన్లు హైలైట్..?

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన ‘పాంచ్‌ న్యాయ్’లతో పాటు రిజర్వేషన్ల తొలగింపు అంశాన్ని కూడా హైలైట్ చేయనున్నారు. ప్రతి ఇంటికీ 5 గ్యారెంటీలపై ప్రచారం చేస్తూనే, బీజేపీ థర్డ్ టైమ్ పవర్‌లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం రాజ్యాంగ ప్రకారం ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తారని వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, అనుబంధ విభాగాలన్నీ ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కానున్నాయి. పాంప్లెంట్స్ రూపంలో ఇంటింటికీ రిజర్వేషన్ రద్దు అంశాలను వివరించేందుకు పార్టీ రెడీ అయింది.

దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కీలక నేతలతో వరుసగా మీటింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఆయా మీటింగ్‌లలో రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత దాన్ని పబ్లిక్‌లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనేది కాంగ్రెస్ లక్ష్యం. ఈ నినాదంతో ఆయా వర్గాల ఓట్లన్నీ కాంగ్రెస్‌కు లభిస్తాయనేది ఆ పార్టీ బలమైన విశ్వాసం. కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే కుల గణన చేసి, రిజర్వేషన్లు పెంచుతామనే అంశాన్ని కూడా జనాల్లోకి పబ్లిసిటీ చేయనున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ మైలేజ్‌కు కారణమవుతాయనేది ఆ పార్టీ అభిప్రాయం.

‘అసెంబ్లీ’ విధానం.. ‘లోక్‌సభ’లో వర్కవుట్..?

ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉద్యోగులపై కాంగ్రెస్ పార్టీ పుల్ ఫోకస్ పెట్టింది. ఫస్ట్‌కే జీతాలు ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగుల మద్ధతును పొందింది. దీని వల్ల రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆయా కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌కు అండగా నిలిచారనేది ఆ పార్టీ విశ్వాసం. అదే విధంగా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సమర్థవంతంగా నోటిఫికేషన్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేస్తామని భరోసా ఇచ్చింది.

దీంతో నిరుద్యోగులు, ఆయా కుటుంబ సభ్యులు కలిపి ఏకంగా 90 లక్షల మంది కాంగ్రెస్ వైపు నిలిచారనేది పార్టీ నమ్మకం. ఇప్పుడు కూడా రిజర్వేషన్లు తొలగింపు అంశాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో బలంగా తీసుకెళ్తే, ఆయా వర్గాల ఓట్లన్నీ కాంగ్రెస్‌కు వస్తాయని ఆ పార్టీ భావిస్తున్నది. రాష్ట్రంలో మెజార్టీ పాపులేషన్ కూడా ఆయా వర్గాలదే కావడం గమనార్హం. ఇది కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లను తెచ్చే చాన్స్ ఉంటుందని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు సహకరించినట్టే, లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు సంపూర్ణంగా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed