కాంగ్రెస్‌కు బ్రహ్మస్త్రం అందించిన మోడీ.. ఎన్నికల వేళ ఊహించని రీతిలో ఇరుకునపడ్డ బీజేపీ..!

by Disha Web Desk 19 |
కాంగ్రెస్‌కు బ్రహ్మస్త్రం అందించిన మోడీ.. ఎన్నికల వేళ ఊహించని రీతిలో ఇరుకునపడ్డ బీజేపీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బంగారం, పుస్తెలతాడు లాక్కుని ముస్లింలకు పంచిపెడుతుందంటూ కాంగ్రెస్‌పై ఇటీవల బీజేపీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా రిజర్వేషన్ ఇష్యూను హస్తం నేతలు ప్రచారంలోకి తెచ్చారు. ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్లతో రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చింది. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ బీజేపీ నేతలు కామెంట్ చేయడంతో అలజడి నెలకొన్నది. దీనిని క్యాచ్ చేసిన కాంగ్రెస్.. దేశవ్యాప్తంగానే ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ లోక్‌సభ ఎన్నికలకు ట్రంప్ కార్డులాగా వాడుకోవాలని భావించింది. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మీడియా సమావేశంలో లోతైన వివరణ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే బీజేపీ రిజర్వేషన్ తుట్టెను కదిపిందని తెలిపారు. ఈ అంశం రెండు పార్టీల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

రంగంలోకి ఆర్ఎస్ఎస్ చీఫ్

ఎన్నికల సమయంలో రిజర్వేషన్ అంశం చేటు తెస్తుందని భావించిన బీజేపీ నేరుగా ఆర్ఎస్ఎస్‌నే రంగంలోకి దించిందని, ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్‌తోనే స్టేట్‌మెంట్ ఇప్పించక తప్పలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల విషయంలో తమకు భిన్నాభిప్రాయం లేదని, ఆ విధానానికి తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను తమ సంస్థ పూర్తిగా సమర్ధిస్తుందని మోహన్ భగవత్ హైదరాబాద్ వేదికగా స్పష్టత ఇచ్చారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో భారత రాజ్యాంగం రిజర్వేషన్లను కల్పించిందన్నారు. అభివృద్ధి జరిగేంత వరకూ అవి ఉండాల్సిందేనని నొక్కిచెప్పారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలనేది ఆర్ఎస్ఎస్ విధానంగా కొద్దిమంది (సీఎం రేవంత్‌రెడ్డి పేరును ప్రస్తావించకుండా) మాట్లాడుతున్నారని, కానీ అందులో వాస్తవం లేదన్నారు.

ప్లాన్‌లో భాగంగానే రేవంత్ కామెంట్

రిజర్వేషన్లపై రాజస్థాన్‌లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సెక్షన్ ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. కాంగ్రెస్ ఆ అంశాన్ని టేకప్ చేసి జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నది. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ దీనిపై లోక్‌సభ ఎన్నికల వరకూ చర్చ పెట్టాలని నేతలను ఆదేశించింది. అందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బీజేపీ కోరుకుంటున్న 400 సీట్ల లక్ష్యం వెనక ఉన్న ఎజెండాపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుని రాజ్యాంగ సవరణ చేసి మనుధర్మాన్ని అమలు చేయడం, దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించడం దాని వెనక ఉన్న లక్ష్యమని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో సుమారు 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలే కావడంతో రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటన ప్రభావం తీవ్రంగానే పడనున్నది.

మెజారిటీ సెక్షన్ ప్రజల్లోని ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒకవైపు రిజర్వేషన్ల అంశాన్ని, మరోవైపు పార్టీపరంగానే తీసుకున్న కులగణన అనే విధానపరమైన నిర్ణయాన్ని ప్రస్తావించారు. రిజర్వేషన్ అంశానికి జనంలో ఉన్న ఎమోషన్, సెంటిమెంట్‌ను వాడుకుని సామాజికంగా వెనకబడిన వర్గాలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నదనే మెసేజ్‌ను మీడియా కాన్ఫరెన్సు ద్వారా పాస్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఈ అంశంతో బీజేపీకి జరుగుతున్న డ్యామేజ్‌ను ఆ పార్టీ పెద్దలు అంచనా వేశారు. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్‌లో సీట్లను సాధించాలని పెట్టుకున్న లక్ష్యం రిజర్వేషన్ విషయంతో చేజారిపోయే ప్రమాదం ఉన్నదని భావించిన బీజేపీ.. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను రంగంలోకి దించి ఆయనతోనే స్పష్టమైన స్టేట్‌మెంట్ ఇప్పించిందనేది జనరల్ టాక్.

బీజేపీకి కొరకరాని కొయ్యగా రిజర్వేషన్ల అంశం

రిజర్వేషన్‌పై బీజేపీ చేస్తున్న కామెంట్లతో తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు కనిపించడంతో దీన్ని విస్తృతంగా ప్రస్తావించి జనంలో చర్చ జరిగేలా చూడాలని ఏఐసీసీ నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏఐసీసీ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్ సహా పలువురు రంగంలోకి దిగారు. ప్రధాని మోడీ రాజస్థాన్‌లో రిజర్వేషన్‌లపైనా, సంపన్నుల సంపదను ముస్లింలకు పంచుతుందంటూ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలపైనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసీసీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. మూడోసారి పవర్‌లోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీకి రిజర్వేషన్ల అంశం కొరకరాని కొయ్యగా తయారైంది.

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచుతామని బీజేపీ ప్రకటించగలదా..? అని సీఎం రేవంత్ లేవనెత్తిన ప్రశ్నకు ఇప్పుడు తెలంగాణ కమలనాధులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తెలెత్తింది. రానున్న రోజుల్లో ఇది ఏ షేప్ తీసుకుంటుందో.. బీజేపీకి ఏ మేరకు డ్యామేజ్ చేస్తుందో.. అన్న దానిపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం, మండల్ కమిషన్ సిఫారసులపై ఆర్ఎస్ఎస్ స్పందన, అప్పట్లో వ్యతిరేకించిన తీరు.. ఇవన్నీ ప్రస్తుతం తెరమీదకు వచ్చాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఓబీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది.

Next Story

Most Viewed