మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ.. సీల్డ్ కవర్‌లో ఉన్నదెవరు ?

by  |
మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ.. సీల్డ్ కవర్‌లో ఉన్నదెవరు ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిపై తుది కసరత్తు బుధవారం సాయంత్రానికి పూర్తి చేసింది. కేటీఆర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ మేయర్ పేరును ఖరారు చేసేందుకు సమావేశమయింది. ప్రమాణ స్వీకారం రోజే మేయర్ పేరును సీల్డ్ కవర్‌లో అందిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం వస్తే వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, ఖైరతాబాద్ డివిజన్‌ కార్పొరేటర్ విజయారెడ్డి, మోతే శ్రీలత పేర్లు ప్రచారం జరిగినప్పటికీ.. చివరికి గద్వాల విజయలక్ష్మి, బొంతు శ్రీదేవి మధ్యే ప్రధాన పోరు ఖరారయ్యింది.

వీరిద్దరిలో మేయర్‌ను నిర్ణయించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం రాత్రి కసరత్తు పూర్తి చేసింది. ఈ కమిటీలో కేటీఆర్, కే.కేశవరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. టీఆర్ఎస్ మేయర్ ఎన్నిక కోసం అన్ని అంశాలను కమిటీ పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. గద్వాల విజయలక్ష్మి కమిటీ సభ్యుల్లో ఒకరైన కేశవరావు కూతురే అయినప్పటికీ పార్టీ నుంచి ఆ కుటుంబం మూడు పదవులను కలిగి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెను మేయర్‌‌గా నిర్ణయించడంపై పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక బొంతు శ్రీదేవి భర్త మాజీ మేయర్‌గా పదవిలో ఉన్నారు. ఈసారి మేయర్ పదవి తనకు ఇవ్వాలంటూ ఇప్పటికే బొంతు శ్రీదేవి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆ మేరకు పార్టీ నుంచి హామీ కూడా అందినట్టు సమాచారం.

డిప్యూటీ మేయర్‌గా షేక్ హమీద్ !

మేయర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ మేయర్‌గా కొండాపూర్ కార్పొరేటర్ షేక్ హమీద్ తెరమీదకు వచ్చారు. జనరల్ కేటగిరీ స్థానంలో హమీద్ ఇక్కడ నుంచి గెలుపొందారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నిరక్షరాస్యుడిగా ఉన్న ఈయన డిప్యూటీ మేయర్‌గా ఏ మేరకు సమర్థవంతంగా పనిచేయగలరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా తననే కొనసాగించాలని కేటీఆర్‌ను కోరుతూ వస్తున్నారు. సిటీలో ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడం, సామాజిక సమీకరణాల్లో భాగంగా మేయర్ స్థానం బీసీలకు, డిప్యూటీ మేయర్‌గా ముస్లింలకు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. కొత్తగా వస్తున్న మహిళా మేయర్ అనుభవం లేని పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఫసీయుద్దీన్‌కే డిప్యూటీ మేయర్‌గా ఎక్కువ అవకాశమున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ నుంచి రాధ ధీరజ్ రెడ్డి ?

టీఆర్ఎస్‌కే బల్దియా మేయర్ పీఠం ఖాయమన్న వాతావరణంలో బీజేపీ కూడా తన పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధమవుతోంది. బుధవారం సాయంత్రం జరిగిన బీజేపీ కార్పొరేటర్ల సమావేశంలో మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీ చర్చించింది. సుమారు రెండు గంటల అనంతరం ఆర్‌కే పురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డిని నిలపాలని పార్టీ నిర్ణయించింది. గురువారం ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్ ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి బీజేపీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు సమావేశానికి రానున్నారు. షాన్‌భాగ్ హోటల్‌లో అల్పాహారం చేసిన అనంతరం నేరుగా బల్దియా కార్యాలయానికి రావాలని సమావేశంలో నిర్ణయించారు.

Next Story

Most Viewed