ఇలా ఎందుకు..?

by  |
ఇలా ఎందుకు..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కలెక్టరేట్ల నిర్మాణాలు నత్త నడకను తలపిస్తున్నాయి. పనులను మంత్రులు ఆర్భా టంగా శంకుస్థాపన చేశారు. తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిలోగా పూర్తి కావాల్సిన నిర్మాణ పనులు మూడేళ్లయినా కాలేదు. పనులను పరిశీలించే నాథుడే లేడు. ఇప్పటి వరకు ఫర్నిచర్ కు టెండర్లే పిలువలేదు. ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ భవనాలు మాత్రం ఏడాదిలో పూర్తయి ప్రారంభానికి ముస్తాబయ్యాయి. కలెక్టరేట్ల నిర్మాణంపై పాలకులకు చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతోంది.

ప్రజలకు పాలన చేరువ చేయాలనే లక్ష్యంతో జనాభా, విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మాణాలు ప్రారంభమై మూడేళ్లు అవుతున్నా పూర్తికాలేదు. ఇది మన పాలకుల చిత్త శుద్ధి. టీఆర్ఎస్ భవన నిర్మాణాలను ప్రారంభించి ఏడాది లోపలే పూర్తి చేశారు. అదే ప్రజలకు అవసరమైన భవనాల నిర్మాణాలను మాత్రం ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు పరిశీలించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు కంటికి కనిపించకుండా పోయారు. నిర్దేశించిన సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలేదని కాంట్రాక్టర్ ను అడిగే పరిస్థితి లేకుండా పోయింది.

పనుల ప్రారంభానికే పరిమితం..

2017 అక్టోబర్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు భవన నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయో పరిశీలించిన పాపాన పోలేదు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కలెక్టరేట్ పరిస్థితి అధ్వానంగా ఉంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరిశీలిస్తే… జిల్లా స్థాయి కార్యాలయాలు ఓకే చోట ఉండవు. ప్రజలు అవసరం నిమిత్తం కలెక్టరేట్ కు రావాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నగర శివారులో రంగారెడ్డి జిల్లా ప్రజలు అవసరం కోసం నగరంలోని లక్డికాపూల్లో ఉన్న కలెక్టరేట్ కు వచ్చేందుకు సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది. కలెక్టరేట్ ఒక దగ్గర, జిల్లా పరిషత్తు మరోవద్ద, ఇతరతర్ర విభాగాలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ కోసం 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో రెండెకరాల్లో నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ప్రతి భవనం అగ్రిమెంట్ చేసుకున్న నాటి నుంచి 11 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ఒప్పందం. కానీ ఇప్పటికీ మూడు సార్లు గడువు పొడిగించినప్పటికీ భవన నిర్మాణం ఇంకా పూర్తి చేయకపోవడం గమనార్హం.

పూర్తయిన వికారాబాద్ భవనం…

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం నిర్మా ణం పూర్తయింది. ప్రారంభించేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. పూర్తయిన భవనాల ప్రారంభంలో ఆలస్యం చేయడమేమిటని ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు అద్దెలు కట్టడం, ఇరుకైన గదులు, పార్కింగ్ స్థలాలు లేకపోవడం, భద్రత ప్రమాణాలు లేకుండా ఉండే భవనాల్లో కార్యాలయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని ప్రతిపక్ష నాయకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఓకే సారి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ భవనాలను ప్రారంభించాలని చూస్తుందన్నారు.

ఫర్నిచర్ కు టెండర్లు ఎప్పుడో..?

రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందగా పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ పనులు, ఫ్లంబింగ్ , ట్యాంకుల నిర్మాణం, శానిటేషన్ పనులు కొనసాగుతుండగా, భవన నిర్మాణానికి ముందు భాగంలో ప్లాస్టింగ్ పూర్తి కాలేదు. ఫర్నిచర్ టెండర్ ప్రక్రియకు నోటీపికేషన్ జారీ చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రక్రియ ప్రారంభమైతే ఎప్పటిలోగా కలెక్టరేట్ కార్యాలయంలో అందుబాటులోకి వస్తోందో చెప్పే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. దసరా నాటికీ నూతన కలెక్టరేట్లు అందుబాటులోకి వస్తాయని పలుమార్లు సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ మాటలకు విలువ లేకుండా పోయింది. ఇంకెప్పుడు కలెక్టరేట్ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయో స్పష్టత లేదు.

ప్రారంభానికి సిద్ధంగా టీఆర్ఎస్ కార్యాలయాలు..

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాది గడవకముందే పూర్తి చేశా రు. త్వరలోనే పార్టీ కార్యాలయాలు ప్రారంభం ఉంటుందని సమాచారం. అయితే జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు ముందుగానే పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తే ప్రతిపక్షలు విమర్శిస్తాయనే ఉద్దేశంతోనే ప్రారంభించడం లేదని తెలిసింది. జిల్లా పార్టీ కార్యాలయాలకు బోర్డులు తయారు చేసినప్పటికీ బిగించ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తోందా.. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ప్రారంభిస్తాయా వేచిచూడాలి.


Next Story

Most Viewed