ఈటలకు బాసటేది..? అసంతృప్తి ఉన్నా.. అంతా గప్ చుప్

189
Etala Rajender

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. పేరుకే కీలక పదవి. తమ చేతిలో ఎలాంటి పవర్ ఉండదు. మీకు తెలియనిది ఏముంది. పార్టీలో, ప్రభుత్వంలో ఆ నలుగురిదే నడుస్తోంది. మా చేతిలో ఏం నిధులు, పవర్ లేకుండా ఈ పదవులు ఎందుకు. మేం ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నాం. ఇలాంటి పదవి ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే..
– తమ సన్నిహితుల వద్ద ఓ సీనియర్ ప్రజాప్రతినిధి ఆవేదన.

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు బాసటగా నిలిచేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు, కొందరు ఎమ్మెల్యేల్లో గులాబీ పార్టీపై, నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ప్రస్తుతం అంతా గప్ చుప్ గా ఉండిపోయారు. ఇప్పుడే బయట పడకూడదని.. మరికొంతకాలం పాటు వేచి చూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆత్మగౌరవమే నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమం.. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆత్మ గౌరవ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర సమితిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధుల్లోనూ అంతర్మథనం మొదలైంది. ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు తమకు పార్టీలో ఆత్మగౌరవం, గుర్తింపు లోలోన మదన పడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు తమకు ఎలాంటి పవర్ లేకపోవటంపై పలుమార్లు తమ సన్నిహితుల వద్ద ప్రస్తావించారు.

టీఆర్ఎస్ పార్టీలో, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం లేదని, మాట్లాడే స్వేచ్ఛ లేదని తాజాగా ఈటల వ్యాఖ్యానించటం కలకలం రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల్లో చర్చ మొదలైంది. ఆత్మగౌరవం, అధికారాల విషయంలో చాలాకాలంగా అసంతృప్తి ఉన్నా.. అంతా గప్ చుప్ గా ఉండిపోతున్నారు. రెండేళ్లకుపైగా ఎన్నికలుండగా.. ఇప్పుడే తొందరపడొద్దనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడే బయట పడటం ఎందుకని.. మరికొంత కాలం వేచి చూడాలని భావిస్తున్నారు. ఈటల పార్టీ వీడుతారా.. వేరే పార్టీలో చేరుతారా.. కొత్త పార్టీ పెడుతారా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. క్షుణ్ణంగా పరిశీలించాలనే యోచనతో ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో ఈటల రాజేందర్ కు పార్టీ ఆవిర్భావం నుంచి అనుబంధం ఉంది. సీఎం కేసీఆర్ కు కుడిభుజంగా, అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల రెండు పర్యాయాలు మంత్రి పదవిలో ఉన్నారు. అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులతో మంచి సంబంధాలున్నాయి. బలమైన బీసీ నాయకుడిగా ఉన్నారు. తాజాగా భూకబ్జాల ఆరోపణలపై ఆయనను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటలకు బాసటగా ఎవరూ ముందుకు రావటం లేదు.

పార్టీ అధిష్టానం, నాయకత్వం పట్ల ఉమ్మడి జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు, కొందరు మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉండగా.. ఇప్పటికిప్పుడు బయట పడితే ప్రయోజనం లేదనే భావనతో ఉన్నారు. ఈటలతో ఏయే ప్రజాప్రతినిధికి, నాయకులకు సన్నిహిత సంబంధాలున్నాయి.. ఈటలతో వారు టచ్లోకి వెళ్లారా.. ఎవరైనా వెళ్లి కలిశారా.. ఫోనులో టచ్లో ఉన్నారా.. అనే అంశాలపై ఇంటలీజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఈటల విషయంలో మౌనంగా ఉండగా.. అందరి కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

మరోవైపు ఈటలతో ఓ మంత్రి పోస్టు ఖాళీకాగా.. మంత్రివర్గ విస్తరణ చేస్తారనే చర్చ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే గులాబీ పెద్దలకు తమ పేర్లు పరిశీలించాలని విన్నవించుకున్నారు. గతంలో మంత్రిగా పని చేసిన వారు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతుండగా.. కేటీఆర్ కోటరీలో ఉండే మరొకరు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

2014-2018వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న ఇద్దరు మంత్రివర్గంలో ఉండగా.. విప్ పదవిని అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు ఇచ్చారు. 2018లో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఒక్క అల్లోలకే మంత్రివర్గంలో అవకాశం లభించింది. జోగు రామన్నకు అవకాశం లేకపోగా.. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు విప్ గా అవకాశం లభించింది.

ఉమ్మడి జిల్లా నుంచి అల్లోల ఒక్కరే మంత్రిగా ఉండటంతో.. తాజాగా మరొకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మరొకరికి అవకాశం లభించే అవకాశాలుండటంతో.. మళ్లీ ఆశలు చిగురించాయి. మంత్రి పదవి వస్తుందా.. ఊరించి పోతుందా.. వేచి చూడాలి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..