సైబర్ అటాక్స్.. ఇంపార్టెన్స్ ఆఫ్ ‘సైబర్ ఇన్సూరెన్స్’

by  |
సైబర్ అటాక్స్.. ఇంపార్టెన్స్ ఆఫ్ ‘సైబర్ ఇన్సూరెన్స్’
X

దిశ, ఫీచర్స్ : ‘ఆన్‌లైన్’ అంగడిలో డేటా భద్రమేనా అంటే ప్రశ్నార్థకమే! ఎంత సేఫ్‌గా దాచుకున్న హ్యాకర్ల చేతికి చిక్కడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రజెంట్ టెక్ ఎరాలో.. వెజిటెబుల్స్ నుంచి వెంటిలేటర్ల వరకు అంతా నెట్టింట్లోనే కొంటున్నాం. ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తున్నాం. అలానే చోటామోటా సంస్థల నుంచి బడా బడా కార్పొరేట్ కంపెనీల వరకు తమ డేటాను ఇంటర్నెట్‌లో భద్రంగా దాచుకోవడం పరిపాటే. అదే విధంగా కామన్ మ్యాన్‌తో సహా, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా తమ పాస్‌వర్డ్‌తో పాటు ఇతర ముఖ్యమైన బిజినెస్ టూల్స్, వ్యాపార సంబంధ సమాచారాన్ని స్టోర్ చేసేందుకు క్లౌడ్ లేదా ఇతర ఐటి సేవలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అంటే మన గుట్టంతా ఆన్‌లైన్‌లో ఉన్నట్లే. ఈ సమాచారమే ‘ఐటెండిటి థెఫ్ట్’‌కు కారణమవుతుంది. ఈ క్రమంలోనే డేటా ఉల్లంఘనలు, ఇతర సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీమా సంస్థలు సైబర్ క్రైమ్ నష్టాల నుంచి ఆర్థికంగా కవర్ చేసేందుకు ‘కమర్షియల్ సైబర్ లయబిలిటి ఇన్సూరెన్స్’ తీసుకొచ్చాయి.

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన జీవితాలు నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి మారిపోతున్నాయి. టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించుకున్నట్లే బ్యాడ్ ఇంటెన్షన్ కలిగిన వ్యక్తులు లేదా క్రిమినల్స్ దాన్ని చెడు కోసం వినియోగించుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి సైబర్ నేరాల నుంచి ఆర్థికంగా ఆదుకునేదే ‘సైబర్ లయబిలిటి ఇన్సూరెన్స్’. ఈ రకమైన వ్యాపార బీమా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌, సంస్థలకు చాలా ముఖ్యమైనది. వాణిజ్య కార్యకలాపాల వల్ల కలిగే బాడీ ఇంజ్యూరీస్, ఆస్తి నష్టంతో సహా వ్యాపార నష్టానికి మొత్తంగా వర్తించేది ‘బిజినెస్ ఇన్సూరెన్స్’. ఇందులో సైబర్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి కాగా, ఇది వ్యాపారాలను రక్షించడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేక బీమా ప్రొడక్ట్. కస్టమర్ అకౌంట్ నెంబర్, క్రెడిట్ కార్డ్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, హెల్త్ రికార్డ్స్, డ్రైవర్ లైసెన్స్ నెంబర్ వంటి వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారంతో కూడిన డేటా ఉల్లంఘన కవర్ చేసేదే ‘సైబర్ ఇన్సూరెన్స్’. అయితే వ్యాపార బీమా పాలసీ మీ సైబర్ బాధ్యత బీమాను కూడా కవర్ చేస్తుందా లేదా అని ముందుగా నిర్ధారించుకోవాలి.

ఉపయోగం..?

క్లౌడ్‌లో లేదా ఎలక్ట్రానిక్ పరికరంలో సెన్సిటివ్ డేటాను నిల్వ చేసే ఏదైనా వ్యాపారానికి సైబర్ బాధ్యత బీమా ఉండాలి. ఐడెంటిటీ థెఫ్ట్ రిసోర్స్ సెంటర్ ప్రకారం, 2018లో 571 వ్యాపారాలు డేటా ఉల్లంఘనలను ఎదుర్కొన్నాయి. దాంతో 415 మిలియన్ల కస్టమర్ రికార్డులు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో కస్టమర్ డేటా బ్రీచ్ జరిగితే, దాన్ని సరిదిద్దడానికి సైబర్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది. సంస్థ కోల్పోయిన డేటాను తిరిగి పొందడానికి బీమా తన వంతు కృషి చేస్తుంది. వ్యక్తిగత సమాచారాన్ని రీస్టోరేషన్ (పునరుద్ధరణ) చేస్తుంది. ఒకవేళ కంప్యూటర్లకు నష్టం జరిగితే వాటిని కూడా రిపేర్ చేయిస్తుంది. ప్రధానంగా ఐడెంటిటి థెఫ్ట్, సోషల్ మీడియా లయబిలిటీ, సైబర్ స్టాకింగ్, మాల్వేర్ అటాక్, ఐటీ థెఫ్ట్ లాస్, ఫిషింగ్, ఈమెయిల్ స్పూఫింగ్, మీడియా లయబిలిటీ, సైబర్ ఎక్స్‌టార్షన్, ప్రైవసీ డేటా బ్రీచ్ బై థర్డ్ పార్టీ వంటి పది రకాల పొటెన్షియల్ థ్రెట్స్ నుంచి కూడా యూజర్లను ఇది రక్షిస్తుంది.

ఇండివిడ్యువల్ పాలసీ :

వ్యక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సైబర్ బీమా పాలసీ కూడా అందుబాటులో ఉంది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న ఎవరైనా సైబర్ బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ పేమెంట్స్ చెల్లింపులు, మనీ ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ షాపింగ్ బిల్లింగ్స్ అంతా అన్‌లైన్‌లోనే చేస్తున్నారు. అంతేకాదు బ్లాగ్స్ నిర్వహించడం, కథనాలను చదవడం, సోషల్ మీడియా బ్రౌజింగ్‌కు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో చాలా డేటా అందుబాటులో ఉన్నందున సైబర్ నేరస్థులు దీన్ని నేరాలకు, మోసాలకు పాల్పడటానికి దుర్వినియోగం చేయవచ్చు. తద్వారా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. వ్యక్తిగత సైబర్ బీమా కలిగి ఉండటం వల్ల సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఐడెంటిటీ థెఫ్ట్ :

‘ఐడెంటిటీ థెఫ్ట్’ గురించి చాలామందికి అవగాహన లేదు. తమ వ్యక్తిగత సమాచారాన్ని(డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ నెంబర్స్, పాస్‌వర్డ్స్) భద్రంగా దాచుకోలేకపోవడంతో ఆ ఇన్‌ఫర్మేషన్ హ్యాకర్స్ చేతులకు చిక్కుతుంది. సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసినప్పుడు, ఎవరైనా దాన్ని దొంగిలించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చిన్న వ్యాపారాలు కూడా సైబర్‌ అటాక్‌ల ద్వారా ప్రభావితమవుతాయి. దాంతో కంపెనీ ప్రతిష్ట ఇబ్బందుల్లో పడవచ్చు. ఇప్పటివరకు ఐదు రకాల(క్రెడిట్ కార్ట్ ఫ్రాడ్, మిస్లేనియస్ ఐడెంటిటీ థెఫ్ట్, మొబైల్ టెలిఫోన్, పర్సనల్/బిజినెస్ లోన్, లీజ్/ఆటో లోన్) ఐడెంటిటీ థెఫ్ట్స్ ఎక్కువగా, తరుచుగా జరిగాయి.

సైబర్ థ్రెట్స్ శాంపిల్స్ :

డ్రిడెక్స్ మాల్వేర్ అటాక్ : ఇది మీ పాస్‌వర్డ్, బ్యాంకింగ్ సమాచారం మొదలైనవాటిని దొంగిలించగల కంప్యూటర్ వైరస్. అనుమానాస్పద లేదా మోసపూరిత చర్యలకు ఉపయోగపడుతుంది. ఈ రకమైన సైబర్ ముప్పు 2014 నుంచి ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది మీ సిస్టమ్‌లను ఫిషింగ్ ఈమెయిల్, ఇతర మాల్వేర్ ద్వారా కూడా అటాక్ చేస్తుంది.

రొమాన్స్ సైబర్ థ్రెట్స్ : పార్ట్‌నర్ కోసం సెర్చ్ చేస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ డేటింగ్ సైట్‌లను ఉపయోగించి చేసే మోసపూరిత చర్య. ఇందులో నేరస్థులు ఇతర వ్యక్తుల ఫొటోలను ఉపయోగించి సదరు వ్యక్తులను అట్రాక్ట్ చేస్తారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకుని నగలు, డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదరింపులకు పాల్పడుతుంటారు.

ఎమోటెట్ మాల్వేర్ దాడి: ఇది సాధారణ పాస్‌వర్డ్‌లను టార్గెట్ చేసే ట్రోజన్ వైరస్. పాస్‌వర్డ్ ‘స్ట్రాంగ్’ లేకపోతే ఈ సైబర్ దాడికి గురవుతాం. డేటాను దొంగిలించి సిస్టమ్‌లో ఇతర మాల్వేర్లను లోడ్ చేస్తుంది వైరస్.

కౌన్సెలింగ్ సర్వీసెస్ :

సైబర్ దాడులు జరిగినప్పుడు వ్యక్తిగతంగా ఒత్తిడికి లోనవుతాం. అంతేకాదు టెన్షన్ వల్ల రక్తపోటు లేదా ఇతర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. ఏదైనా సైబర్ దాడి కారణంగా ఒత్తిడికి గురైతే సైకియాట్రిస్ట్, సైకాలాజిస్ట్ లేదా కౌన్సెలర్ నుంచి చికిత్స తీసుకోవడం ఉత్తమం. సైబర్ బీమా అటువంటి పరిస్థితులలో చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరిస్తుంది.

ప్రతీ ఏటా సైబర్ ముప్పు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు చాలా వ్యాపార వ్యవస్థలు ఆన్‌లైన్‌లో ఉన్నందున, డేటా ఉల్లంఘనలకు అవకాశం మరింత ఎక్కువవుతుంది. సైబర్ ముప్పు కంపెనీ ప్రతిష్టను నాశనం చేస్తుంది. అటువంటి తరుణంలో కంపెనీ భద్రతను పెంచడంలో సైబర్ బీమా ఖచ్చితంగా సహాయపడుతుంది. ప్రభుత్వం, చిన్న వ్యాపారాలు, కార్పొరేషన్లు ఈ సైబర్ బెదిరింపులకు ఎక్కువగా గురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత పటిష్టమైన సైబర్ సెక్యూరిటీని కలిగి ఉన్న యు.ఎస్. ప్రభుత్వంపై డ్రిడెక్స్ మాల్వేర్ దాడి జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సైబర్ అటాక్స్ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సంస్థకైనా, వ్యక్తికైనా జరుగుతాయి.

ప్రస్తుతం ఆధునిక యుగం వైపు ప్రయాణిస్తున్నాం. ఆన్‌లైన్‌లోనే బిజినెస్ అండ్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ చేసుకునే నేటికాలంలో ఈ సేవల్లో సైబర్ నేరాలు జరిగితే వాటి నుంచి ఆర్థికంగా మనల్ని మనం కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Next Story