అల్పపీడనం ఏర్పడే అవకాశం.. మరోసారి భారీ వర్షాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-25 02:41:19  IST  )

తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు భారీ వర్షాలు (Heavy rains) కురిసిన సంగతి తెలిసిందే.

అల్పపీడనం ఏర్పడే అవకాశం.. మరోసారి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు భారీ వర్షాలు (Heavy rains) కురిసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా వాతావరణం స్వల్పంగా మెరుగైంది. అయితే, మరోసారి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, మంగళవారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.

ఇక భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అలాగే, ప్రజలు అత్యవసరమైతేనే బయటకి రావాలని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద తలదాచుకోవడం గానీ, నిల్చోవడం చేయవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగిపొర్లే వాగులు, కాలువలు, నీటి ప్రవాహాలను, వరద నీటిని దాటే ప్రయత్నం చేయరాదని తెలిపారు.

Next Story