రూ.50 వేలకు మించితే ఆధారాలు ఉండాలి : సీపీ

by  |
రూ.50 వేలకు మించితే ఆధారాలు ఉండాలి : సీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలకు మించి తీసుకెళ్లే వారు పోలీసులు తనిఖీల్లో సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఎన్నికలను పురస్కరించుకుని 2698 మంది తమ ఆయుధాలను పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశారని చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించకుండా ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ అధికారులతో పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తోందని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్దంగా జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్, డీఆర్‌సీ కేంద్రం వద్ద కౌంటింగ్ రూమ్, సెంటర్లలో సీసీటీవీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇప్పటి వరకూ 1.35 కోట్ల నగదును పట్టుకున్నట్టు తెలిపారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలతో ఆ నగదును ఐటీ శాఖకు అప్పగించి, 9 కేసులు నమోదు చేశామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాచకొండలో
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 13 పోలీస్ స్టేషన్ల వ్యాప్తంగా 30 జీహెచ్ఎంసీ వార్డులు ఉన్నట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నేరేడ్ మెట్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ… మొత్తం 1637 పోలింగ్ కేంద్రాల్లో 1071 సాధారణ పోలింగ్ కేంద్రాలు, 512 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 53 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.

రాచకొండ కమిషనరేట్‌లో 6 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 6 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా 29 ప్రాంతాల్లో చెక్ పోస్టులు, తనిఖీలు చేసేందుకు 90 పికెట్ పాయింట్లను ఏర్పాటు చేశారని వెల్లడించారు. 1637 కేంద్రాలలో 10 వేల పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీరిలో 8 వేల మంది సివిల్, మరో 2 వేల మంది ఆర్డ్మ్ సిబ్బంది ఉన్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed