మేం ఉపాధ్యాయులం.. పథకాలు అమలు చేసే అధికారులం కాదు

by  |
teachers 0
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజరాబాద్‌లో నిర్వహించిన సీఎం కేసిఆర్ సభకు జనసమీకరణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆదేశించింది. ఈ సర్కూలర్ పై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తాము ఉపాధ్యాయులమని పథకాలను అమలు చేసే అధికారులం కాదని చెబుతున్నారు. బోధనేతర కార్యక్రమాలకు తమను ఏ విధంగా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల విధులకు, జనాభా లెక్కలకు మాత్రమే తమ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఉపాధ్యాయులకు అప్పగించిన బాధ్యతలను సర్కారు వెనక్కి తీసుకుంది.

దళితబంధు పథకం కోసం హుజారాద్‌లో నిర్వహించే సీఎం కేసిఆర్ సభకు టీచర్లకు డ్యూటీలు పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్ట్ 16న నిర్వహించే ఈ సభకు జన సమీకరణ చేపట్టాల్సిందిగా శనివారం కరీంనగర్ డీఈఓ జనార్థన్ రావు ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన హుజూరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులు చేపట్టాల్సిన కార్యక్రమాలను సూచించారు. మొత్తం 150 మంది ఉపాధ్యాయులు గ్రామాల వారిగా జనసమీకరణ చేపట్టి బస్సుల్లో సీఎం కేసిఆర్ సభకు తరలించాల్సిందిగా తెలిపారు. వీరిని మానిటరింగ్ చేస్తూ కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని 10 మంది ఎంఈఓలకు, హెడ్‌మాస్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జనం తిరిగి గ్రామలకు చేరుకునే వరకు ఉపాధ్యాయులదే బాధ్యతని చెప్పారు.

సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు

ఉపాధ్యాయులను పొలిటికల్ పార్టీ కార్యర్తల్లా వినిగించుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించరాదని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి. కేవలం ఎన్నికల సమయంలో, జనాబా లెక్కల సమయంలోనే ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవాలని నిబంధనలు సూచిస్తున్నాయి. వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులకు సభాకార్యక్రమాల బాధ్యతలు అప్పగించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది.


మేము పాఠాలు బోధించే ఉపాధ్యాయులం

-జంగయ్య, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
మేము పాఠాలు బోధించే ఉపాద్యాయులం మాత్రమే. మా సేవలను విద్యార్థులను వినియోగిస్తాం. బావి భారత పౌరులను తయారు చేస్తాం. ప్రభుత్వ అమలు పరిచే పథకాలతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. సీఎం సభ కోసం ఉపాధ్యాయులు డ్యూటీలు వేయడం సరైన పద్దతి కాదు. నిబంధనల ప్రకారం బోధనేతర కార్యక్రమాల్లో మేము ఎక్కడా పాల్గొలని లేదు.


సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది

-కె.రమణ టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు వినియోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యాహక్కు చట్టాలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులను దిగజార్చే విధంగా ప్రభుత్వ ఆదేశాలివ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులలో ఇలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలుపుతున్నాం.


ఉపాధ్యాయులను అవమాన పరచకండి

-కట్కం రమేష్, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
బహిరంగ సభలాంటి కార్యక్రమాలకు ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసి అవమానించకండి. విద్యాబుద్దులు నేర్పే ఉపాధ్యాయులు జనసమీకరణ చేపట్టడం తగదు. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను వినియోగించరాదు.

Next Story