ఓటీటీకే ఓటు.. ‘నారప్ప’ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ!

by  |
Venkatesh-Daggubati
X

దిశ, సినిమా: వెంకటేష్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో తమిళ్ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్.. పాండమిక్ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్ల ఓపెనింగ్‌పై క్లారిటీ లేకపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. జూన్ 20న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. హీరో వెంకటేష్‌తో పాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబు థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకే ఇన్నాళ్లూ వెయిట్ చేసినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీకి మొగ్గుచూపక తప్పలేదు. ఈ మేరకు నారప్ప పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన వెంకటేష్.. నారప్ప రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, తమిళ్ వెర్షన్‌లో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించగా, ఆయన భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది. ఇక ప్రకాష్ రాజ్, కార్తిక్ రత్నం, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు నిర్మించారు.


Next Story