ప్రధాని మోడీ నియోజకవర్గంలో టీకా కొరత.. కేంద్రాల మూసివేత

by  |
ప్రధాని మోడీ నియోజకవర్గంలో టీకా కొరత.. కేంద్రాల మూసివేత
X

లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో టీకా కొరత తీవ్రంగా ఉన్నది. వారణాసిలోని మొత్తం 66 టీకా కేంద్రాల్లో 41 కేంద్రాలు అంటే ప్రభుత్వ అనుమతి పొందిన 62శాతం టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ స్టాక్ లేకపోవడంతో మూతపడ్డాయి. మిగతా 25 టీకా కేంద్రాల్లోనే వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. వారణాసి చౌకాఘాట్‌లోని జిల్లా స్థాయి టీకా కేంద్రం కూడా టీకా కొరతతో మూసివేయాల్సి వచ్చింది. టీకాల కొరత, మళ్లీ ఎప్పుడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయన్న విషయంపై వైద్య అధికారులు స్పష్టతనివ్వలేకపోతున్నారు.

లక్నో నుంచే తమకు టీకాలు తగినస్థాయిలో రావడం లేదని, మండల స్థాయిల్లోనూ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల నిల్వలు లేవని చౌకాఘాట్ టీకా కేంద్రంలో పనిచేస్తున్న శ్యామ్‌జీ ప్రసాద్ తెలిపారు. టీకా కొరతపై నోడల్ అధికారి డాక్టర్ ఏకే పాండేకు తెలియజేశామని, అయినా సకాలంలో టీకాలు రాకపోవడంతో కేంద్రానికి వస్తున్న అర్హులను వెనక్కి పంపిస్తున్నామని మరో హెల్త్ వర్కర్ ఉర్మిలా సింగ్ చెప్పారు. బుధవారం చాలా మందిని టీకాలు లేక వెనక్కి పంపించామని చౌకాఘాట్ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలం గుప్తా వివరించారు. రిజనల్ వ్యాక్సిన్ స్టోర్‌లలో సరిపడా నిల్వలు ఉండటం లేదని, అందకే ఈ కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జిల్లాలో టీకా కేంద్రాల సంఖ్యను తగ్గించాలని సూచనలు వచ్చినట్టు వివరించడం గమనార్హం.

మహారాష్ట్రలోని సతారాలో పంపిణీ బంద్..

మహారాష్ట్రలో మరో మూడు రోజులకు సరిపడా టీకా నిల్వలు మాత్రమే ఉన్నాయని, వెంటనే టీకాలు పంపాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే బుధవారం కేంద్రానికి ఎస్‌వోఎస్ అలర్ట్ పంపిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని సతారా జిల్లాలో టీకా పంపిణీ నిలిచిపోయింది. టీకాల కొరతతో జిల్లాలో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని సతారా జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ గౌడ ధ్రువీకరించారు.


Next Story

Most Viewed