గ్రామానికో వైన్స్.. సేల్స్ పెంచేందుకు ‘ఎక్సైజ్’ సహకారం..?

by  |

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామాల్లో బెల్ట్​షాపులకు అ(న)ధికారిక పర్మిషన్లు మొదలయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్యం దుకాణాలకు టెండర్లు పూర్తి అయిన విషయం తెలిసిందే. లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న వారు అమ్మకాల మార్గాల అన్వేషణలో పడ్డారు. కొంతమంది పాత వ్యాపారులకే దుకాణాలు రావడంతో గ్రామాల్లో బెల్ట్​దుకాణాలకు అమ్మేందుకు కొత్త ప్రక్రియను చేపట్టుతున్నారు. మండలాల వారీగా గ్రామాలను పంచుకుంటున్నారు. ఒక మండలంలో అధికారిక మద్యం దుకాణాలు మూడు ఉంటే.. ఆ మండలంలోని గ్రామాలను మూడు దుకాణాలకు పంచుతున్నారు. ఒక గ్రామం తమకు కేటాయించిన చోట కాకుంటే వేరే దుకాణంలో మద్యం కొంటే.. అక్కడ వెంటనే ఎక్సైజ్​అధికారులు తనిఖీలకు వాలిపోతారు. ఇలా అటు అధికారులు, ఇటు మద్యం వ్యాపారుల సమన్వయంతో బెల్ట్ దుకాణాలు కొనసాగుతున్నాయి.

డిపాజిట్​ పెట్టాల్సిందే..

లక్షలకు లక్షలు పెట్టి షాపులను దక్కించుకున్నామని, గ్రామాల్లో మద్యం అమ్ముకోవాలంటూ తమకు ఎంతో కొంత డిపాజిట్​చేయాలంటూ అధికారిక మద్యం దుకాణాల వ్యాపారులు గ్రామాల్లో బెదిరింపులకు దిగుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బెల్ట్​దుకాణాలు లేవని, ఒక్కచోట కూడా అనుమతి లేకుండా విక్రయాలు చేయడం లేదంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ మారుమూల గ్రామాల్లో కూడా మద్యం ఏరులై పారుతోంది. చిన్న కిరాణా దుకాణాలు, డబ్బాల్లో కూడా విక్రయాలు చేస్తున్నారు. కాగా ఇటీవల మద్యం దుకాణాల టెండర్లు పూర్తి అయి, కొత్త వ్యాపారులకు షాపులను అప్పగించారు. వచ్చేనెల 1 నుంచి నూతన మద్యం పాలసీ ప్రకారం విక్రయాలు జరుగనున్నాయి.

ఊరూరా పంపకాలు

గ్రామాల్లో బెల్ట్​షాపులు ఉండరాదంటూ ప్రభుత్వం చెప్పుతుంటే.. వ్యాపారులు, కొన్నిచోట్ల అధికారులు కలిసి వారి మధ్య సమన్వయం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో నాలుగైదు బెల్ట్​ దుకాణాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం మండలాల వారీగా దుకాణాలను పంపిణీ చేసుకుంటున్నారు. ఒక్కో దుకాణానికి నాలుగైదు గ్రామాల చొప్పున కేటాయించుకుంటున్నారు. ఒక దుకాణానికి కేటాయించిన గ్రామం మరో దుకాణంలో మద్యం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ కొనుగోలు చేసినా సదరు వ్యాపారులే బెల్ట్ దుకాణాలపై రైడింగ్​చేపించనున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు నెలకొన్నాయి. ఈసారి మాత్రం ఒప్పందాలు చేసుకుంటూ కాగితాలు రాసుకుంటున్నారు. దీనికి పలుచోట్ల అధికారులే మద్యవర్తిత్వం వహిస్తున్నారు.

గ్రామాల్లోనూ వేలం

మరోవైపు గ్రామాల్లోనూ బెల్ట్​షాపుల నిర్వాహణకు వేలం వేస్తున్నారు. గ్రామ పంచాయతీలు, వీడీసీలు కలిసి బెల్ట్​దుకాణాన్ని నడుపుకునేందుకు గ్రామ పెద్దలంతా కలిసి పంచాయతీకి కొంత సొమ్ము ఇవ్వాలని తీర్మానాలు చేస్తున్నారు. ఈ సొమ్మును గ్రామంలో పలు అభివృద్ధి పనులకు వాడుతున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారి గ్రామంలో బెల్టు షాపుకు వేలం పాట పెడితే ఏటా రూ.2 లక్షలు వస్తున్నాయని, వీటితో బడిలో ఇద్దరు విద్యావలంటీర్లను పెట్టుకుని, ప్రతి నెల జీతాలు ఇస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. అలాగే ప్రైమరీ స్కూల్లో కింద కూర్చుని ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కోసం గతంలోనే బెంచీలు తయారు చేయించుకున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో మూడు బెల్టుషాపులకు వేలం నిర్వహించారు. అలా వచ్చిన రూ.6 లక్షలను ‘విలేజ్ డెవలప్​మెంట్ ఫండ్’కు జమ చేశారు. గ్రామంలోని పలు వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇలా బెల్టుషాపులకు ఓపెన్​గానే వేలంపాటలు పెడుతున్నారు.

అమ్మకాలు పెంచుకునేందుకు అన్​అఫీషియల్​ షాప్స్

నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉన్న వైన్ షాపుల్లో తప్ప ఎక్కడా లిక్కర్ అమ్మకూడదు. చాలా కాలంగా వేలాది గ్రామాల్లో అన్​అఫీషియల్‌గా బెల్ట్​షాపులు నడుస్తున్నాయి. కిరాణా షాపులు, టీస్టాళ్లలో పెట్టి మద్యాన్ని గ్రామాల్లోనే స్థానికంగా ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఈ షాపుల జోలికి రాకుండా పలుచోట్ల ఎక్సైజ్ ఆఫీసర్లకు, పోలీసులకు మామూళ్లు ముట్టజెపుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని గ్రామాల్లో కొనసాగుతున్న బెల్టుషాపుల యజమానుల దగ్గర నుంచి ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు డబ్బుల వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఏ గ్రామంలో కూడా బెల్టుషాపును నిర్వహించకూడదు. అయితే మద్యం అమ్మకాలను పెంచేందుకు అధికారులు ఈ బెల్ట్​షాపుల నిర్వహణపై సైలెంట్​గా ఉంటున్నారు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా, కిందిస్థాయి సిబ్బంది మాత్రం నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతుతున్నాయి.

ఊరూరా ఆటోల ద్వారా సరఫరా

కిరాణా షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం బెల్టుషాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్కో గ్రామంలో రెండు నుంచి ఐదు వరకు మద్యం బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ఈ విషయం ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు ఉంటున్నారు. నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ రేటుకు మద్యం అమ్ముతున్నప్పటికీ బెల్టు షాపుల్లో మాత్రం రేట్లను 10 నుంచి 20 శాతం పెంచి విక్రయాలు జరుపుతున్నారు.

వైన్‌ షాపుల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. టెండర్‌లో ఎక్కువ ధరకు షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పంపించి అమ్ముతున్నారు. ఈ ఆటోలను పోలీసులు పట్టుకోరు. నిరంతరం తిరుగుతున్నా.. వాటిని చెక్​ కూడా చేయరు. బెల్టు షాపుల యజమానులు ఒక్కో బీరు, విస్కీ క్వార్టర్‌ సీసా మీద రూ.10 నుంచి రూ.20ల వరకు అధికంగా విక్రయిస్తున్నారు. వ్యాపారులు కిరాణా షాపుల్లో చిల్లర వస్తువుల్లా అమ్మకాలు జరుతున్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed