హైదరాబాద్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

by  |
హైదరాబాద్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
X

రాజధానిలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో మూడు తెలంగాణలోనే ఉన్నాయి. ఇప్పటికే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాజిటివ్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతనికి సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కూడా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఈ వ్యక్తి అతనికి చికిత్స చేస్తున్న నర్సుగా తేలింది. మరో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ మహిళను ఐటీ పార్కులోని మైండ్ స్పేస్ బిల్డింగ్‌లో ఉన్న డిఎస్ఎం సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా గుర్తించారు. కానీ ప్రభుత్వం మాత్రం పూణె నుంచి ల్యాబ్ రిపోర్టు వచ్చేంతవరకు వేచి చూసిన తర్వాతనే అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోంది.

ఇటీవల ఇటలీ వెళ్ళి వచ్చిన ఆ మహిళా ఇంజనీర్ రెండు వారాల క్రితం ఇక్కడకు వచ్చిన మరుసటి రోజే కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించి చికిత్స కోసం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇటీవల రక్త పరీక్ష అనంతరం ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని కంపెనీ యాజమాన్యానికి తెలియజేయడంతో మిగిలిన ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేసింది. మళ్ళీ సమాచారం ఇచ్చేంత వరకు ఆఫీసుకు రావద్దని మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. ఇంటి నుంచే (వర్క్ ఫ్రం హోం) పనిచేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆఫీసు మొత్తాన్ని శుభ్రం చేసే పని మొదలైంది. రహేజా మైండ్ స్పేస్ భవనంలో ఉన్న పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు సైతం ఉద్యోగులందరికీ మెయిల్ పెట్టి ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా సూచించాయి. ఒక్కసారిగా సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ మూసేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆదేశాలు ఇచ్చాయి.కరోనా కేసులు దేశంలో నమోదవుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల్లో తగిన చర్యలు చేపట్టినప్పటికీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ప్రతీ రోజూ ఈ అంశంపై అధికారికంగా బులెటిన్ విడుదల చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ సైతం ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రతీరోజూ మీడియా సమావేశం ద్వారా తాజా వివరాలను వెల్లడించాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. మెట్రో రైలు ప్రయాణీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అన్ని స్టేషన్లలో పాటించాల్సిన విధి విధానాలను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సమీక్షించారు. ఒకటి రెండు రోజుల్లో ప్రచార కార్యక్రమం రూపుదాల్చనుంది.

మహిళా ఇంజనీర్‌కు పాజిటివ్ రిపోర్టు రావడంతో ఇంతకాలం ఆమెతో పనిచేసిన ఉద్యోగుల్లో ఇంకెంతమందికి అంటుకుందో అనే ఆందోళన సహజంగానే సహోద్యోగుల్లో నెలకొంది. ప్రస్తుతానికి డిఎస్ఎం సంస్థ ఉద్యోగికి మాత్రమే పాజిటివ్ అని తేలినా అదే భవనంలో ఉన్న పదుల సంఖ్యలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నందున అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇటీవల విదేశాల్లోని సమావేశాలకు హాజరై వచ్చినవారి వివరాలను యాజమాన్యాలు సేకరించి వారిపై ఓ కన్నేసాయి. వారి శారీరక్ష లక్షణాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏయే దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయో ఆ దేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లను సైతం యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఈ వ్యాధి లక్షణాలు బైటపడడంతో ఒక్కసారిగా ఆ రంగంలోని ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నాలకన్నా ఆందోళన పడడమే ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే రహేజా మైండ్ స్పేస్ భవనం మొత్తం ఖాళీ అయిపోయిందంటే కరోనా భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాధి లక్షణాలు ఏ మాత్రం బైట పడినా వెంటనే సంబంధిత టీమ్/లైన్ మేనేజర్‌కు సమాచారం ఇవ్వాల్సిందిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఆయా కంపెనీల యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

మరోవైపు కరోనా వ్యాధి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఉంటున్న అపార్టుమెంటులోని మిగిలిన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆమె ఉంటున్న గది కిటికీ తలుపులు తెరిచే ఉండడంతో గాలి ద్వారా సోకుతుందేమోనని ఆ అపార్టుమెంటులోని మిగిలిన ఇళ్ళలోని వారు భయాందోళనలో ఉన్నారు. మెట్రో రైళ్ళలో తిరిగే ప్రయాణీకులు సైతం తోటి ప్రయాణీకుల్లో ఎవరికి తుమ్ము, దగ్గు వచ్చినా దూరంగా వెళ్ళిపోతున్నారు. క్యాబ్ సర్వీసుల్లో సైతం పూల్ కేటగిరీలో ప్రయాణించేవారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

tags : corona, covid-19, hyderabad, software, mind space employees, raheja, telangana, KCR, etela

Next Story