వ్యూహం మార్చిన టీఆర్ఎస్.. మరోసారి రంగలోకి నిఘా వర్గాలు!

by  |
KCr
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో మరోసారి సర్వే ప్రక్రియ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఓటర్లలో వచ్చిన మార్పులపై సమగ్ర నివేదికలను టీఆర్ఎస్ అధినేతకు అందించనున్నారు. అలాగే సర్వే ఏజెన్సీలు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించబోతున్నాయి. ఇక్కడి ఓటర్లలో అంతర్గతంగా దాగి ఉన్న విషయాన్ని రాబట్టేందుకు ఈ బృందాలు ఆరా తీసేపనిలో నిమగ్నం కానున్నాయి. మరో 14 రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హుజురాబాద్ ప్రజల మనోగతం ఏంటీ అన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న నిఘా బృందాలను విడివిడిగా పంపించి వేర్వేరు నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దసరా తరువాత ఈ టీంలు హుజురాబాద్‌లోని దాదాపు అన్ని గ్రామాలు తిరిగి పూర్తి వివరాలు సేకరించనున్నట్టుగా తెలుస్తోంది. రోజురోజుకూ హుజురాబాద్ ఓటర్లలో మార్పు వస్తున్నందున ఎంతమేర పార్టీకి అనుకూలత ఉందన్న విషయంపై స్పష్టమైన నివేదికలు తయారు చేసి పంపించాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ప్రభావం చేసే వారెవరు..?

గ్రామ స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే వారి వివరాలను సేకరించే పనిలో కూడా టీఆర్ఎస్ పార్టీ నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. వ్యతిరేక ఓటుతో పాటు ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్న ప్రతీ అంశాన్ని అధిగమించాలన్న లక్ష్యంతో మరో సారి ఆరా తీయించాలని భావించినట్టు సమాచారం. ఈటలపై గెలుపు కోసం పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ఈ నివేదికలతో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతికూలత వ్యక్తపరిచే వారెంత మంది ఉన్నారు. ఇందుకు కారణాలు ఎంటన్న వివరాలను కూడా సమగ్రంగా తెలుసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. సమగ్రమైన నివేదికలు తెప్పించుకున్న తరువాత ప్రచారంలో మరింత మార్పులు చేర్పులు చేయనున్నట్టు సమాచారం.

ఏజెన్సీలూ..

సర్వేలో ఏజెన్సీలను మరోసారి భాగస్వామ్యం చేయనున్నట్టు తెలుస్తోంది. వ్యతిరేకత అంశాలను గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు ఈ ఏజెన్సీ బృందాలు రంగంలోకి దిగనున్నట్టుగా తెలుస్తోంది. వర్గాల వారిగా పిన్ పాయింట్ ఇన్ ఫర్మేషన్ సేకరించేందుకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఈ టీమ్స్ తిరగనున్నట్టుగా సమాచారం.

ఇన్‌పుట్స్ వచ్చిన తర్వాతే..

ఇంటెలీజెన్స్, సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన ఇన్‌పుట్స్‌ను బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉండనుందని సమాచారం. నియోజకవర్గంలో ప్రతికూలత ఉన్నట్టుగా ఇప్పటికే అందిన నివేదికలను ఆధారం చేసుకుని తాజాగా సేకరించనున్న వివరాలతో సీఎం కేసీఆర్ టూర్ ఎన్నిసార్లు పెడితే బాగుంటుందోనన్న విషయంపై నిర్ణయానికి రానున్నారని తెలుస్తోంది. ఇక్కడి ఓటర్లను అనుకూలంగా మల్చుకునేందుకు సమగ్రంగా రిపోర్టులు సేకరించిన తరువాత కార్యచరణ రూపొందించుకోనున్నారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదికలన్నింటినీ క్రోడీకరించి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed