కేసీఆర్ మాటల్లో పంచ్‌లు తగ్గే.. పవర్ పాయే..!

by  |
TRS vijaya garjana sabha
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మాటల్లోని పదును అప్పటి సమైక్య వాదులకు బాణాల్లా కుచ్చుకుంటే.. తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ లేని ఉత్సాహాన్నిచ్చేవి. ఆయన ప్రసంగాన్ని విని తెలంగాణ ప్రజలు చాలా మంది మంత్రముగ్ధులైపోయేవారు. ఒక్క క్షణం రెప్ప వాల్చకుంటా టీవీలకు అతుక్కుపోయేవారు. ఆయన భాషలోని పౌరుష పదాలను కూడా ఎంజాయ్ చేసేవారు. ఒక దశలో బండి సంజయ్ లాంటివారు ఆయన భాష నుంచే పౌరుష పదాలను నేర్చుకున్నామంటూ వ్యంగ్యంగా చెప్పేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన మాటల్లో పంచ్‌లు లేవని, పదును తగ్గిపోయిందని, అందుకే ప్లీనరీలో ఉత్సాహం కనిపించలేదని ప్రతినిధులుగా హాజరైనవారు భోజన విరామ సమయంలో చర్చించుకున్నారు.

ఇక హుజూరాబాద్ ఓటర్లు చాలా మంది కేసీఆర్‌పైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హామీలు ఇవ్వడమే తప్ప వాటిని అమలుచేయలేదని బహిరంగంగానే విమర్శించారు. చదువుకుంటే కొలువులు వస్తాయని ఎదురుచూసినవారికి గొర్రెలు, బర్రెలు ఇచ్చారని, నిరుద్యోగ భృతి మాట ఇచ్చి గాలికొదిలేశారని చాలా గ్రామాల్లో యువకులు, వారి తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. దళితుడే సీఎం, మూడెకరాల భూమి లాంటి హామీల విషయంలో మాట తప్పడం, అబద్దాలు చెప్పడం ఆయన పట్ల అప్పటివరకు ఉన్న విశ్వసనీయత పోవడానికి కారణమైందని ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ ఆయన మాటపై గౌరవం ఉందిగానీ, ఇప్పుడు మాత్రం ఆయనవైపు ఉండబోమని ప్రచారం సందర్భంగా చాలా మంది వ్యాఖ్యానించారు. ఆ తర్వాతనే ఓటు వేయకుంటే పథకాలు కట్ అవుతాయనే బెదిరింపులు వచ్చాయని, మరో మార్గం లేక సైలెంట్‌గా ఉండిపోయామని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నందున బహిరంగంగా కామెంట్లు చేయడానికి భయపడిన జనం ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఓట్ల రూపంలో అసంతృప్తిని, వ్యతిరేకతను వ్యక్తం చేశారనే మాటలు వినిపిస్తోన్నాయి. హుజూరాబాద్‌కు మాత్రమే ఇది పరిమితం కాదని, ఇకపైన ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటు రూపంలోనే వ్యక్తీకరించే ట్రెండ్ మొదలవుతుందని ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు పట్టుకున్నది. ఒకప్పుడు కేసీఆర్ ప్రసంగంలోని పిట్ట కథలు, వ్యంగ్యం మాటలను బాగా ఎంజాయ్ చేసిన జనం ఇప్పుడు హామీలే తప్ప అమలు లేకపోవడంతో వినడానికి కూడా ఉత్సాహం చూపడంలేదని ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఒక్క హుజూరాబాద్ ఫలితం ఎన్నో సందేశాలను ఇచ్చినట్లయింది.

‘కారు’కు కలిసిరాని నవంబర్.. అదే సీన్ మళ్లీ రిపీట్

Next Story