ఓరుగల్లు గులాబీలు కమలం వైపు

by  |
ఓరుగల్లు గులాబీలు కమలం వైపు
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: అధికారం లేకున్నా.. రాకున్నా ఫ‌ర్వాలేదు.. క‌నీసం ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌క‌వ‌చ్చు.. అణిగిమ‌ణిగి ఉండాల్సిన అవ‌స‌రం లేదు. అనవ‌‌స‌ర‌పు పెత్త‌నాల‌ను భ‌రించాల్సిన ప‌రిస్థితి అంత‌క‌న్నా ఉండ‌దు.. కాలం క‌లిసి వ‌స్తే.. క‌మ‌లం విక‌సిస్తే మ‌న‌మే క‌థానాయ‌కులం.. మ‌న‌కే అగ్ర‌తాంబూలం.. ఇది ఇప్పుడు వ‌రంగ‌ల్ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లోని కొంత‌మంది కార్పొరేట‌ర్లు, ముఖ్య నేత‌ల ఆలోచ‌న..

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్‌లోని అసంతృప్తులు బీజేపీ వైపు చూస్తున్నారు. స‌మ‌యం, సంద‌ర్భం చూసుకుని త‌గిన హామీతో పార్టీ మారేందుకు సిద్ధ‌ప‌డుతున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే 10మందికి పైగా కార్పొరేట‌ర్లు బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్య నేతలు కూడా..

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత‌లుగా ఉన్న ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావు, శాప్ మాజీ డైరెక్ట‌ర్ రాజ‌నాల శ్రీహ‌రి బీజేపీలోకి వెళ్తున్న‌ట్లు కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై వారిద్దరూ స్పందించకపోవడంతో నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్ర‌దీప్‌రావు త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న ఏడుగురు కార్పొరేట‌ర్ల‌ను కూడా బీజేపీలోకి తీసుకెళ్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ప్ర‌దీప్ వెంట వ‌చ్చేందుకు ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు సిద్ధంగా ఉండ‌గా, మ‌రో ఐదుగురు మాత్రం ఆచీతూచీ వ్య‌వ‌హ‌రించాల‌నే భావ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్ర‌దీప్‌రావు పార్టీ మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మంత్రి ఎర్ర‌బెల్లి, ఎమ్మెల్యేలు విన‌య్‌భాస్క‌ర్‌, న‌న్న‌పునేని బుజ్జ‌గింపులు కూడా ప‌నిచేయ‌లేద‌ని సమాచారం.

బండి సంజయ్ సమక్షంలో..

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌రి కొద్దిరోజుల్లో వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. దాదాపు ఆయ‌న మూడు రోజుల పాటు వ‌రంగ‌ల్‌లోనే బ‌స చేస్తారని తెలుస్తోంది. వ‌రంగ‌ల్‌ పార్టీ నేత‌ల్లో ఉత్సాహం కల్పించేందుకు కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని సమాచారం. బండి సంజ‌య్ స‌మ‌క్షంలో పార్టీలో చేరేందుకు ప్ర‌దీప్‌రావు, రాజ‌నాల శ్రీహ‌రి రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిత్వానికి పోటీప‌డే ఉద్దేశంతోనే పార్టీ మారుతున్న నేప‌థ్యంలో త‌న బ‌లాన్ని సాధ్య‌మైనంత ఎక్కువ‌గా చూపించుకోవాల‌ని ఆయ‌న భావిస్తుండ‌ట‌ం ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి. రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చేలోగా బ‌లం, బ‌ల‌గాన్ని కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌దీప్‌రావు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

అసంతృప్తుల‌తో చ‌ర్చ‌లు..

బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్తున్న నేత‌ల‌ను గుర్తించి వారిని బుజ్జ‌గించే ప‌నిలో తూర్పు, ప‌శ్చిమ ఎమ్మెల్యేలు బిజీబిజీగా ఉన్నారు. ఈ విష‌యంలో తూర్పు ఎమ్మెల్యే న‌రేంద‌ర్ కాస్త ఆందోళ‌న‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎర్రెబెల్లి ప్ర‌దీప్‌రావుతో ట‌చ్‌లో ఉన్న నేత‌ల‌ను పిలిపించుకుని బుజ్జ‌గిస్తున్నార‌ని తెలుస్తోంది. పార్టీలో ఉంటే అన్ని విధాలుగా న్యాయం చేస్తాన‌ని పార్టీలోనే కొన‌సాగేలా స‌ద‌రు నేత‌ల‌కు హామీలిస్తున్న‌ట్లు స‌మాచారం. పార్టీలో ఉంటే స‌హ‌క‌రిస్తాన‌ని, ఇంకా మూడేళ్లు ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని కూడా స‌ద‌రు నేత‌ల‌కు న‌న్న‌పునేని వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కొంత‌మంది నాయ‌కులు మెత్త‌బ‌డ‌గా.. ఇంకొంత మంది ఆచీతూచీ స్పందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పశ్చిమంలో కమలం గాలి..

వాస్త‌వానికి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా బీజేపీ గాలి ఉన్నా.. ఇంకా బ‌య‌ట ప‌డ‌డం లేద‌ని ఆ పార్టీ నేత‌లే చెప్తుండడం గ‌మ‌నార్హం. అయితే వ‌రంగ‌ల్‌లోనూ బీజేపీ గాలి వీస్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న ఆయా డివిజ‌న్ల‌లోని కొంతమంది టీఆర్‌ఎస్ ముఖ్య నేత‌లు కమ‌లం కండువా క‌ప్పేసుకుంటున్నారు. ఇప్ప‌టికే కారు నుంచి కొంత‌మంది కమలంలో చేరగా ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైతే ఇంకొంతమంది కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బండి సంజ‌య్ చేతుల మీదుగా కండువా క‌ప్పుకుని స్వ‌యంగా త‌మ డివిజ‌న్ల‌లో తిరిగితే ఇక ఎన్నిక‌ల‌కు ఘ‌నంగా వెళ్ల‌వ‌చ్చ‌ని కొందరు నేతలు భావిస్తున్నారు.

Next Story