తెలంగాణ IAS​.. నో ప్రయారిటీ!

by  |
తెలంగాణ IAS​.. నో ప్రయారిటీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో : “ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకే వస్తాయి… మా బతుకులు బాగుపడుతాయి… అంటూ ఉద్యమంలో నిరుద్యోగ యువత ఎలా ముందుకురికిందో… స్వరాష్ట్రంలో మాకూ పెద్దపీట ఉంటుంది. స్థానిక సమస్యలన్నీ తెలిసిన వాళ్లం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటాం… ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఐఏఎస్​లు అంటేనే చిన్నచూపు చూసిన వారిని తలదన్నెలా సొంత రాష్ట్రంలో ఉంటే కీలక పదవుల్లో ఉంటాం..” అంటూ ఉన్నతాధికారుల బృందం కూడా ఆశ పడింది. తెలంగాణ కేడర్​కు చెందిన ఎంతో మంది ఐఏఎస్​లు ప్రత్యక్షంగానో… పరోక్షంగానో ఉద్యమానికి సహాకరించారు. కానీ వారు ఊహించిందంతా ఊహలకే పరిమితమైంది. ఇప్పటికీ పని లేని విభాగాలకే పరిమితమవుతున్నారు. కనీసం తమ ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో తెలంగాణ ఐఏఎస్​లు ఇప్పుడు ఇక్కడ ఉండకుండా వేరే రాష్ట్రానికి వెళ్లిపోతే బాగుండనే బాధలో ఉంటున్నారు. కేవలం ఒక బ్యాచ్​ గీతను దాటుకుని ప్రగతిభవన్​ దాకా తమ వేదన ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఇలా ప్రాధాన్యత లేని పోస్టులనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఆది నుంచీ అంతే..

తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రం నుంచి ఐఏఎస్​లు ఆశల్లోనే తేలియాడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గతంలో ఏకంగా సీఎస్​ను కలిసి విన్నవించుకున్నారు కూడా. కానీ మరోవైపు టీఆర్​ఎస్​ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్​గా ఉన్న రాజీవ్​శర్మ అనుసరించిన వ్యూహాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సీఎస్​ సోమేశ్ తనవర్గమైన ఐఏఎస్​లు, అధికారులనే కీలకమైన పోస్టుల్లో కూర్చుండబెడుతున్నారంటున్నారు. దీనిలో… ప్రధానంగా తెలంగాణ ప్రాంత ఐఏఎస్​లను ప్రాధాన్యత లేని పోస్టులకు పరిమితం చేయడంలో ఒకవర్గం సక్సెస్​ అవుతుందని తెలుస్తోంది. తెలంగాణ ఐఏఎస్​ల ప్రతిపాదనలు, వ్యూహాలు ప్రగతిభవన్​ గోడ దాటకుండా అడ్డు తగులుతున్నారని, అందుకే మన ఆఫీసర్ల బాధలు, ప్రయత్నాలు, కీలకమైన అంశాలు సీఎంకే చేరడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అంశాలైనా అనుభవం ఉన్న అధికారులతో పని చేయిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని, కానీ ఇప్పుడు కనీసం సెక్రటేరియట్​లో పనిచేసిన అనుభవంలేని అధికారులను కీలకమైన ఫైనాన్స్, రెవెన్యూ వంటి విభాగాల్లో నియమించుకోవడంతోనే పలు పథకాలు వైఫల్యాలను మూటగట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. తెలంగాణ ప్రాంత ఐఏఎస్​లను ఉద్దేశపూర్వకంగానే అప్రాధాన్య పోస్టులకు పంపించినట్లు విమర్శలున్నాయి.

గతంలోనూ తమకు ప్రాధాన్యత లేని పోస్టులే ఇస్తున్నారంటూ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన రాష్ట్రంలో జరిగింది. ఉద్దేశ పూర్వకంగానే తమకు ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తున్నారని, సీనియారిటీ ఎక్కువ ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ అధికారులకు కూడా కీలకమైన పోస్టింగులు ఇవ్వడం లేదంటూ గతంలో ఐఏఎస్​లు ఆకునూరి మురళి, శ్యాం నాయక్​, చంపాలాల్​, భారతి లక్​పతినాయక్​, ప్రీతిమీనా వంటి ఐఏఎస్​లు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే ఏడాదిన్నర కింద సీనియర్ ఆఫీసర్లకు సరైన పోస్టింగ్ ఇవ్వడం లేదనే కారణంతో ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వీఆర్ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మురళి కీలకమైన విభాగాలకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు.

అయితే లూఫ్​లైన్​… లేకుంటే పైన జూనియర్లు..

ఇక తెలంగాణ ప్రాంత ఐఏఎస్​లు సీనియర్లుగా ఉన్నా… వారిని లూఫ్​లైన్​కే పరిమితం చేస్తున్నారు. ఏండ్ల తరబడి అలాగే కొనసాగిస్తున్నారు. తెలంగాణ తొలి టర్మ్​లో ఇదే ఒత్తిడికి గురైనా… రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతైనా మారుతుందని ఆశపడ్డారు. కానీ కోటరీ ఐఏఎస్​లదే పైచేయిగా సాగుతూనే ఉంది. ఫలితంగా అప్రాధాన్య పోస్టులకే పంపుతున్నారు. ఇక కుదరని పక్షంలో వేటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఐఏఎస్​లు అదే విధంగా పోస్టింగ్​లకే దూరమయ్యారు. ఇప్పటికీ పోస్టింగ్​ లేక ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా ఒక పోస్టింగ్​ ఇస్తే… వారిపై పెత్తనాన్ని మాత్రం ఒక బ్యాచ్​కు చెందిన జూనియర్ల చేతుల్లో పెడుతున్నారు. దీంతో ఇలా వేధిస్తుండటంతో పోస్టింగ్​ వద్దనే స్థాయికి తెలంగాణ ఐఏఎస్​లు వెళ్లాల్సి వస్తోంది. సీనియర్లుగా ఉన్నా… తమ కళ్ల ముందే అనుభం లేని జూనియర్లకు పెద్ద కుర్చీలేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ఐఏఎస్​లు మనోవేధనకు గురవుతున్నారు. ఏడేండ్ల కాలంలో దాదాపు ఆరేండ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్​ ఐఏఎస్​ బుర్రా వెంకటేశంను లూఫ్​లైన్​ గీత దాటనీయడం లేదు. మరోవైపు కీలకంగా… జిల్లాల్లో కూడా పని చేయకుండా, స్థానిక భాషా పరిజ్ఞానం లేకున్నా జూనియర్​ అధికారులను సచివాలయంతో పాటు పలు కీలకమైన పోస్టుల్లో కూర్చుండబెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అసలు తెలంగాణకు చెందిన ఐఏఎస్ లు చాలా మంది ఉన్నా వారిని ఎందుకు ప్రాధాన్యత లేని కుర్చీలకే పరిమితం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా… ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించి… ఉద్యమానికి సహాకరించిన ఐఏఎస్​లను పట్టించుకోకుండా… నార్త్​ అధికారుల బృంద పెత్తనాన్ని ఎందుకు సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ సర్వీసు వద్దే వద్దు..

స్వంత రాష్ట్రంలో పని చేసేందుకు మన రాష్ట్ర ఐఏఎస్​లు కూడా ఆసక్తి చూపించడం లేదనేది స్పష్టమవుతోంది. ప్రస్తుతం కేటాయించడంతో తప్పలేక పని చేస్తున్నారు. కొంతమంది తెలంగాణలో పని చేసేందుకు ఇష్టంలేక ఇతర రాష్ట్రాల అధికారులను వివాహం చేసుకుని వెళ్లిపోతున్నారు. ఇక ఇక్కడకు వచ్చిన వారు మాత్రం చాలా రోజులు పోస్టింగ్​ల కోసం ఎదురుచూడాల్సే వస్తోంది. వాస్తవంగా ఐఏఎస్​ టాపర్లు గతంలో ఉమ్మడి ఏపీలో పని చేసేందుకే తొలి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి మారుతోంది. రాష్ట్రం నుంచి వెళ్లేందుకే ఇష్టం చూపిస్తున్నారు. చాలా మంది ఐఏఎస్​లను వెయింట్​లో పెట్టడం, పోస్ట్​ ఇచ్చినా ప్రాధాన్యత లేకపోవడంతో మన ఐఏఎస్​ల్లో అనాసక్తి ఏర్పడుతోంది.
అయితే తెలంగాణకు చెందిన ఐఏఎస్​లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంచి పోస్టింగ్​లో ఉంటున్నారని ఐఏఎస్​ అధికారుల్లో చర్చ జరుగుతోంది.

సొంత రాష్ట్రమని తెలంగాణను ఎంచుకుని వస్తే వారు అప్రాధాన్య పోస్టులకే పరిమితమవుతున్నారు. తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిన వారు కీలక బాధ్యతల్లో ఉండగా.. తెలంగాణకు వచ్చిన వారికి ఇబ్బందులు ఎదుర వుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడ స్వరాష్ట్రంలో గుర్తింపు లభిచండం లేదనే కారణంగా పలువురు ఐఏఎస్​లు రాష్ట్రాన్ని విడిచిపోతున్నారు. సొంత రాష్ట్రమైనా వెళ్లాల్సిన పరిస్థితి. 2018 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌కు చెందిన మసందా మాడ్గలిన్‌ పెర్టిన్‌ అసోంకు చెందిన ఐఏఎ్‌సను పెళ్లి చేసుకొని, తెలంగాణ కేడర్‌ను వదులుకొని, ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శ్వేతా తియోతియా (2011) కూడా గుజరాత్‌ అధికారిని వివాహం చేసుకొని ఆ రాష్ట్రానికి వెళ్లిపోయారు. 2014 బ్యాచ్‌కు చెందిన కృతికా జ్యోత్స్న యూపీకి చెందిన రాహుల్‌ పాండేను వివాహం చేసుకొని ఆ రాష్ట్రానికి బదిలీ మీద వెళ్లారు.

బాధ్యతల్లేవ్​… సలహాల్లేవ్​

ఇక తెలంగాణకు చెందిన ఐఏఎస్​లు స్వరాష్ట్రంలో కూడా పోస్టింగ్​ కోసం వెయింటింగ్​లో ఉండాల్సి వస్తోంది. అయితే సీఎం దగ్గరకు వెళ్తే కిందిస్థాయి అంశాలను వివరించే అవకాశం ఉంటుందని, కానీ ఒక కోటరీ సీఎం దాకా వెళ్లనీయకుండా అడ్డు తగులుతుందని, దీంతో సీఎంకే సంస్థాగత అంశాలు తెలువనీయడం లేదని ప్రచారం జరుగుతోంది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరిగే ఇబ్బందులను నివేదించినందుకు ఐఏఎస్​ చిరంజీవులపై ఉద్దేశపూర్వకంగా వేటేశారని, ఆయనకు ఇంకా పోస్టింగ్​ ఇవ్వడం లేదని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐఏఎస్​లు మహ్మద్​ అబ్దుల్​ అజీం, వాసం వెంకటేశ్వర్లు కూడా పోస్టింగ్​ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అదే విధంగా చాలా మంది సీనియర్లుగా ఉన్న మన రాష్ట్ర ఐఏఎస్​లు ప్రాధాన్యతమైన పోస్టుల్లో పని చేయక ఏండ్లు గడిచిపోతున్నాయి. 2015 నుంచి ఐఏఎస్​లు శశిధర్​ భూభారతి, ఎన్​ శ్రీధర్​ సింగరేణి నుంచి దాటి రావడం లేదు. ఎం వీరభద్రయ్య కార్పొరేషన్​, కో ఆపరేటివ్​ సొసైటీ 2015 నుంచి పరిమితమయ్యారు.

రాహుల్​బొజ్జా తొలినాళ్లలో వ్యవసాయ శాఖకు పని చేసినా ఇప్పుడు నిధుల్లోని ఎస్సీ కార్పొరేషన్​లో ఉండగా… మరో ఐఏఎస్​ అధికారి జి కిషన్​ కూడా స్టేట్​ గెజిటీర్స్​కే పరిమితమయ్యారు. విజయ్​ కుమార్ కూడా ఎస్సీ డెవలప్​మెంట్​లో ఉండగా, టీకే శ్రీదేవి ఆర్థిక శాఖలో, కె నిర్మల ఆయిల్​సీడ్​ దాటి రావడం లేదు. మొదట్లో తమకు పోస్టింగ్​లు కల్పించాలని అడిగినందుకు కొంతమందిపై కక్ష కొనసాగుతూనే ఉంది. ఐఏఎస్​ చంపాలలాల్​ సైనిక్ వెల్ఫేర్​కు, భారతి లక్​పతినాయక్​ పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​, కేవై నాయక్​ ఎంప్లాయిమెంట్​ ట్రైనింగ్​లో ఉండాల్సి వస్తోంది. సురేంద్రమోహన్​ రాజ్​భవన్​, వెంకటేశ్వరరావు జాయింట్​ సెక్రెటరీగా కొనసాగుతూనే ఉన్నారు. ఎన్​ సత్యనారాయణ పోస్టింగ్​ కోసం చూసి… ఇటీవలే మున్సిపల్​ అడ్మినిస్ట్రేటివ్​లో డైరెక్టర్​గా ఉన్నారు. కొర్ర లక్ష్మీ ఆర్ట్​ గ్యాలరీలో విధులు నిర్వర్తిస్తున్నారు. చిట్టెం లక్ష్మీ సెర్ప్​ డైరెక్టర్​గా, శివలింగయ్య కో ఆపరేషన్​ డిపార్ట్​మెంట్​లో డిప్యూటీ సెక్రెటరీగా, హైమావతి సీసీఎల్​లో, స్వర్ణలత అడిషనల్​ కలెక్టర్​గా ఉన్నారు. ఇక సర్వే సంగీతా సత్యనారాయణ సీఎంఆర్​ఓ పీడీగా వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది తెలంగాణ ఐఏఎస్​లు ఆయా జిల్లాల్లో ఇతర రాష్ట్ర ఐఏఎస్​ల పరిధిలో అడిషనల్​ కలెక్టర్లుగా ఉన్నారు.

కొందరికే పరిమితం..

ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో అనుభవం ఉన్న సీనియర్​ ఐఏఎస్​లను భాగస్వామ్యం చేయడం లేదని, దీంతో పలు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వస్తుందనే అపవాదు కూడా ఉంది. అందుకే ధరణి, ఎల్​ఆర్​ఎస్​ వంటి అంశాల్లో ఘోరంగా విఫలమయ్యారని, కేవలం ఒక కోటరీ ఐఏఎస్​లతోనే ఇవన్నీ ఫెయిల్​ అయ్యాయనే ప్రచారం ఐఏఎస్​ల్లో కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ల అంశంలో ముందుగానే చెప్పిన చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టగా… పంచాయతీ, మున్సిపల్​ విభాగాల్లో సుదీర్ఘ కాలం పని చేసి, భూ సంబంధిత అంశాల్లో అనుభవం ఉన్న చిత్ర రామచంద్రన్​ వంటి సీనియర్లను అసలు ధరణి, ఎల్​ఆర్​ఎస్​ వంటి కీలక అంశాల్లో భాగస్వామ్యం చేయకపోవడంతోనే సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయంటున్నారు.
ఇక చాలా మంది రాష్ట్రానికి చెందిన సీనియర్​ అధికారులు ఉన్నా… అందరినీ పక్కకుపెట్టి కొంతమంది చేతుల్లోనే కీలక శాఖలన్నీ అదనపు బాధ్యతలుగా పెడుతున్నారు. కొంతమంది అధికారులకు రెండు, మూడు శాఖల్లో కొనసాగుతున్నారు.

సీఎస్​గా కీలక హోదాలో ఉండి కూడా సీఎస్ సోమేశ్ కుమార్ రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, సీసీఎల్ఏ బాధ్యతలు చూస్తున్నారు. అరవింద్​ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐ అండ్ పీఆర్, హెచ్ఎండీఏ కమిషనర్, సునీల్​శర్మ ఆర్​అండ్​బీ, హౌసింగ్, ట్రాన్స్ పోర్ట్ శాఖలకు సెక్రటరీగా, జనార్థన్​రెడ్డి వ్యవసాయ శాఖ సెక్రెటరీ, కమిషనర్​గా, క్రిస్టినా చోంగ్త్​ గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్​తో పాటు పలు శాఖలను పలువురు ఐఏఎస్​లకు కేటాయించారు. దీంతో చాలా శాఖల్లో ఫైళ్లన్నీ పేరుకుపోతున్నాయని ఆరోపణలున్నాయి. తెలంగాణ ఐఏఎస్​లకు ఆయా స్థానాల్లోఅవకాశం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఐఏఎస్​ అధికారుల్లో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed