సీఎం బహిరంగ సభలో సాగర్ అభ్యర్థి ప్రకటన

by  |
సీఎం బహిరంగ సభలో సాగర్ అభ్యర్థి ప్రకటన
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించేందుకు ముహూర్తం ఖరారయ్యింది. అందుకు హాలియాలో నిర్వహించబోయే బహిరంగ సభ వేదిక కానుంది. హాలియాలో సీఎం బహిరంగ సభ ఉంటుందని, ఆ వేదిక నుంచే సాగర్ ఉప ఎన్నికలో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఆ దిశగా అడుగులు మాత్రం ముందుకు పడలేదు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రచారంలో దూసుకుపోతుండడం గులాబీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. సాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్‌లో రోజుకో పరిణామం చోటుచేసుకుంటున్న విషయాన్ని కొంతమంది నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో శుక్రవారం సమావేశమయ్యారు. హాలియాలో ఈ నెల పదిన పగలు రెండు గంటలకు పెద్దఎత్తున బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు.

నేతలతో సమాలోచనలు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సాగర్ ఉపఎన్నికతో పాటు నల్లగొండ జిల్లాలోని సాగునీటి రంగంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఉపఎన్నిక ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టికెట్ ఎవ్వరికీ కేటాయించాలనే విషయంలో సీఎం కేసీఆర్ నేతల అభిప్రాయం తీసుకున్నారు. మిగతా వారిని ఎలా బుజ్జగించాలి? పార్టీ నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా కేసీఆర్ సమాలోచనలు చేసినట్టు సమాచారం.

9 ఎత్తిపోతల పథకాల ప్రకటనకు అవకాశం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా మిగిలిన ఆయకట్టుకు సాగునీరు అందించడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు మరో తొమ్మిది ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. వీటన్నింటికీ ఈ నెల పదిన మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభతోనే సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి.



Next Story

Most Viewed