సారూ నీ కాల్మొక్త.. పట్టా బుక్కు ఇయ్యుండ్రి..

by  |
సారూ నీ కాల్మొక్త.. పట్టా బుక్కు ఇయ్యుండ్రి..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘సారూ నీ కాల్మొక్త.. మీకు దండం పెడ్తా. మా భూమికి పట్టా బుక్కు ఇయ్యుండ్రి. మా అయ్య.. అవ్వ.. ఏండ్ల తరబడి ఈ భూమి కోసం రెక్కలు ముక్కలు చేసుకుండ్రు. రేయనక.. పగలనక.. కాయకష్టం జేసిండ్రు. రాళ్లురప్పలు ఉన్న భూమిని సదును జేసినం. అప్పో సప్పో జేసి బోరు వేసి పొలం అచ్చు కట్టినం. అందులో ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తూ పిల్లలను సాక్కుంటూ వచ్చినం. మా బతుకంతా ఈ భూమ్మిదనే. ఇన్నేండ్లు గడుస్తున్నా మా భూములకు పట్టాలియ్యలే.

పాలకులను అడిగితే.. ఇదిగో ఇస్తిమి.. అదిగో ఇస్తిమి.. అంటూ నమ్మబలుకుతూ వచ్చిర్రు. కానీ పట్టా బుక్కులు మాత్రం ఇయ్యలే. మా పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కాట్లే. పెద్దసార్లూ స్పందించి మా భూమికి పట్టాపుస్తకాలియ్యాలే. మా బాధను కలెక్టరమ్మకు చెప్పుకుంటం. మమ్మల్ని లోపలికి పోనీయండ్రి సారూ. ఆ అమ్మకు మా భాదలు చెప్పుకుంటం. మాకు అడ్డు పడకండి సారూ’ అంటూ తనను కలెక్టరేట్‌లోకి పోనీయకుండా అడ్డుకున్న పోలీసు అధికారితో యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ ప్రాంతం పరిధిలోని తుంబాయి తండాకు చెందిన గిరిజన మహిళా రైతు కట్రోతు కోమటి ఇలా తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలావుంటే.. రాచకొండ పరిధిలోని రాచకొండ తండా, తుంబాయితండా, కదిలాబాయి తండా, పల్లగట్టుతండాలకు చెందిన గిరిజన రైతులు.. తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలని కోరేందుకు పెద్దఎత్తున యాదాద్రి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అయితే పోలీసులు గిరిజన రైతులను అడుగడుగునా అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తనను అడ్డుకున్న పోలీసులతో గిరిజన రైతు కట్రోతు కోమటి ఇలా ఆవేదన వ్యక్తంచేయడం.. పలువురిని కదిలించింది.


Next Story

Most Viewed