అభివృద్ధికి తిలోదకాలిచ్చి కాలయాపన చేస్తున్న బీజేపీ

by Disha Web Desk 15 |
అభివృద్ధికి తిలోదకాలిచ్చి కాలయాపన చేస్తున్న బీజేపీ
X

దిశ, జగదేవ్ పూర్ : అభివృద్ధికి తిలోదకాలిచ్చి దేవుడి పేరుతో కాలయాపన చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కేంద్రంలో పడుతుందని దేవాదాయ శాఖ, మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. శుక్రవారం జగదేవ్ పూర్ మండలంలోని దౌలాపూర్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో గ్రామాలలో అభివృద్ధి శూన్యం అని, అభివృద్ధి చేయని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు, ప్రజా సమస్యలు లేవనెత్తకుండా సమావేశాలు ముగిసే వరకు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ దొడ్డి దారిన వెళ్లి రైతులను కలిసి వారు ఇబ్బందులు పడుతున్నారని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో అత్యధిక మెజార్టీ వచ్చేది కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండే అని చెప్పారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయవద్దని సూచించారు. అభివృద్ధి, కంపెనీలు, సంక్షేమ పథకాలు అందించామని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి పోయి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే సంస్కృతి మొదలైందన్నారు. అసంపూర్తిగా ఉన్న గుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారని, దేశానికి అరిష్టమని పండితులు చెప్పినప్పటికీ మోడీ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వార్థం కోసం, ఎలక్షన్ల కోసం మోడీ నాటకం ఆడారని, మోడీ ఆడిన నాటకాన్ని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు గ్రహించారని, ఆ ప్రాంతంలో బీజేపీ కొట్టుకుపోతుందని గ్రహించి దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. 9 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, ఈ ప్రాంతానికి ఎన్ని కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించారో ఆ పార్టీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. యాక్సిడెంట్లు,

అనారోగ్యంతో మృతి చెందిన వారిని లెక్కగట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ అనడం హాస్యాస్పదం అన్నారు. ఆగస్టు 15లోగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఆరు గ్యారంటీలను నెరవేరుస్తారని, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. చాలెంజ్ లు చేయడం గొప్ప కాదని వాటిని నిలుపుకోవాలని సూచించారు. తెలంగాణలో వరదలు, కొండగట్టులో బస్సు ప్రమాదం, మహిళలపై వేధింపులు జరిగితే పరామర్శించి బాధితులకు పరిహారం ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు నాలుగు నెలల ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పీఏసీఏస్ మాజీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, హనుమంత, జనార్దన్ రెడ్డి, బంగారు రెడ్డి, రమేష్ గౌడ్, నాయిని యాదగిరి, ధర్మారం మల్లేశం, గాడిపల్లి భాస్కర్, నర్సింహారెడ్డి, తుడుం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story