లుంగీ కట్టి, కండువా కప్పుకున్న ప్రపంచ దిగ్గజ నేతలు.. కేరళ ఎన్నికల్లో ఏఐ ప్రచారం అదుర్స్!

by Ramesh Naini |

కేరళ ఎన్నికల ప్రచారంలో ఏకంగా ప్రపంచ దేశాల అధినేతలు రంగంలోకి దిగారు. రోడ్ల మీద, సెలూన్ షాపుల్లో, మార్కెట్లలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

లుంగీ కట్టి, కండువా కప్పుకున్న ప్రపంచ దిగ్గజ నేతలు.. కేరళ ఎన్నికల్లో ఏఐ ప్రచారం అదుర్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ ఎన్నికల ప్రచారంలో ఏకంగా ప్రపంచ దేశాల అధినేతలు రంగంలోకి దిగారు. రోడ్ల మీద, సెలూన్ షాపుల్లో, మార్కెట్లలో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ వీడియో షేక్ చేస్తోంది. అయితే, ఇది వాస్తవంగా జరిగింది కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన మాయాజాలం. అత్యంత సృజనాత్మకంగా, స్థానిక నాయకుల హావభావాలను అచ్చంగా దించుతూ రూపొందించిన ఈ ఏఐ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఎవరు ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారంటే..

ఈ వీడియోలో ప్రపంచ దిగ్గజ నేతలు వేర్వేరు పార్టీల తరపున ప్రచారం చేస్తూ కనిపించడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా మెడలో కమలం పార్టీ కండువా వేసుకుని ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కేరళ అధికార పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ తరపున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, నార్త్ కొరియా అధినేత కిమ్‌ జొంగ్‌ ఉన్‌లు ఎర్ర కండువాలతో రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలు ప్రచారం చేస్తున్నట్లుగా ఈ వీడియోను రూపొందించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

పక్కా లోకల్.. లుంగీ కట్టి, కండువా వేసి!

ఈ ఏఐ వీడియోలో అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్న అంశం.. ఆయా నాయకుల వేషధారణ, బాడీ లాంగ్వేజ్ అచ్చం మన స్థానిక నాయకుల తరహాలోనే వీరంతా కేరళ సంప్రదాయ ‘లుంగీ’ కట్టి, భుజాన ఆయా పార్టీల కండువాలు వేసుకున్నారు. మార్కెట్లు, రోడ్లు, కటింగ్ షాపులు, ఆఫీసుల వద్దకు వెళ్లి ఇండియన్ పొలిటికల్ స్టైల్‌లో ఓటర్లతో మమేకమవుతున్న దృశ్యాలను @artillense సృష్టికర్తలు అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచార వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

Next Story