- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! వెలుగులోకి వచ్చిన ఓ స్కామ్
ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త! మీరు ఆర్డర్ చేసిన ఐఫోన్ బదులు డమ్మీ ఫోన్ వచ్చే ప్రమాదం ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు ఆర్డర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త! మీరు ఆర్డర్ చేసిన ఐఫోన్ బదులు డమ్మీ ఫోన్ వచ్చే ప్రమాదం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలనే బురిడీ కొట్టిస్తూ, పార్శిళ్లలోని అసలు వస్తువులను మాయం చేస్తున్న ఒక ముఠాను అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ముఠా చాలా తెలివిగా ప్లాన్ చేసి.. ముందుగా తమ మనుషులను వివిధ కొరియర్ సర్వీసుల్లో డెలివరీ బాయ్స్‌గా చేర్చేవారు. ఆ తర్వాత నకిలీ ఐడీలతో ఖరీదైన గ్యాడ్జెట్లను ఆర్డర్ చేసేవారు. ఆ పార్శిళ్లు డెలివరీకి వచ్చే లోపే, లోపల ఉన్న డెలివరీ బాయ్ సాయంతో వాటిని దారి మళ్లించేవారు.
అసలు తీసేసి.. డమ్మీ పెట్టి!
ముఠా సభ్యులు ప్రత్యేక పరికరాలను (స్కామ్ కిట్) ఉపయోగించి పార్శిల్ సీల్‌ను చాకచక్యంగా తెరిచేవారు. అందులోని అసలు మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువును తీసేసి, దాని స్థానంలో సరిగ్గా అదే బరువు, ఆకారం ఉన్న డమ్మీ వస్తువును పెట్టేవారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఆ ఆర్డర్‌ను ‘క్యాన్సిల్’ లేదా ‘రిటర్న్’ చేసేవారు. ఇలా తస్కరించిన అసలు వస్తువులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు.. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి సుమారు రూ. 20.52 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 అసలు మొబైల్ ఫోన్లు, 25 డమ్మీ ఫోన్లు, డమ్మీ ఇయర్‌బడ్స్, గేమింగ్ ప్రాసెసర్లు, కెమెరా లెన్స్‌లు ఉన్నాయి. స్కామ్ కిట్‌లో గ్లూ రిమూవర్ బాటిళ్లు, సిరంజీలు, ప్యాకింగ్ మెటీరియల్ ఉన్నాయి.
పాత నేరాలు వెల్లడి..
విచారణలో నిందితులు గతంలో వడోదర, సూరత్, రాజస్థాన్‌లలో చేసిన పలు దొంగతనాల గురించి ఒప్పుకున్నారు. జనవరి 2026లో వడోదరలో iPhone 17 Pro Max, iPhone 16 Pro వంటి మోడళ్లను కూడా వీరు ఇదే తరహాలో మాయం చేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఆన్‌లైన్ పార్శిళ్లు అందుకునేటప్పుడు సీల్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని, వీలైతే డెలివరీ సమయంలోనే బాక్సును ఓపెన్ చేసే వీడియో (Open Box Delivery) తీసుకోవాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.






