ఇలా తొలగిస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం.. ఉద్యోగం కోల్పోయిన మహిళకు జాక్‌పాట్!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-06 08:34:44  IST  )

సెలవు దినంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థపై కోర్టు సీరియస్‌గా స్పందించింది.

ఇలా తొలగిస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం.. ఉద్యోగం కోల్పోయిన మహిళకు జాక్‌పాట్!
X

దిశ, వెబ్ డెస్క్: సెలవు దినంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. బాధిత మహిళకు నష్ట పరిహారంగా భారీ మొత్తాన్ని ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటన లండన్‌లో (UK) చోటు చేసుకుంది. లండన్‌కు చెందిన జోయాన్ నీల్ అనే మహిళ డెర్మలాజికా యూకే (Dermalogica UK) అనే స్కిన్‌కేర్ కంపెనీలో ఉద్యోగం (Job) చేస్తున్నారు. అయితే, జోయాన్ సిక్ లీవ్‌లో ఉండగా సదరు సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తీవ్ర మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన సౌత్ లండన్‌లోని క్రాయిడన్ ట్రిబ్యునల్.. ఉద్యోగం కోల్పోయిన విషయం బాధితురాలి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రమైన స్థాయిలో దెబ్బతీసిందని న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆమెకు.. వీడియో కాల్‌లో హెచ్‌ఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఉద్యోగం కోల్పోయిన విషయం తెలియజేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత మహిళకు 25,000 పౌండ్లు (రూ.28 లక్షలు) నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, సదరు మహిళ 2022 జనవరి నుంచి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రం హోం (Work from home) ఇవ్వాలని కోరగా.. సంస్థ అందుకు అనుమతించలేదు. అలాగే, ఏడాదిలో రెండు మాత్రమే పెయిడ్ సిక్ లీవ్స్ (Paid sick leave) ఉండటంతో ఆమె మరింత మానసికంగా కుంగిపోయింది. ఇక సంస్థ నవంబరు 2022లో ఆమెను కంపెనీ 'రెడండెన్సీ (సంస్థ ఖర్చులు తగ్గించుకోవటంలో భాగంగా)' పేరుతో ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే, ఈ కారణంతో ఆమెను తొలగించటం పరోక్ష లింగ వివక్షగా కోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు, కంపెనీ నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని, ఉద్యోగుల హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని పేర్కొంది.

Next Story