- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదగిరిగుట్ట ఆలయంలో గోల్‌మాల్.. కాజుతో పకోడీలు చేసుకుని విందు
యాదగిరిగుట్ట దేవస్థానంలో మరో అవినీతి వెలుగుచూసింది. స్వామివారి ప్రసాదం సరుకులైన జీడిపప్పు, బాదం, నూనెతో కొందరు ఉద్యోగులు పిండి వంటలు చేసుకుని ఆగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వరసగా అక్రమాలు వెలుగుచూడటం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. స్వామివారి ప్రసాదాల తయారీ కోసం వినియోగించే విలువైన సరుకులు అడ్డదారిలో బయటకు తరలిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొంతమంది సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానానికి సంబంధించిన గోదాములే కేంద్రంగా ఈ భారీ స్కామ్ సాగుతోంది. గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం, వంట నూనె, కాజు, బాదం పప్పులు పెద్ద ఎత్తున మాయమవుతున్నాయి.
ప్రసాదాల తయారీ కోసం తెచ్చిన జీడిపప్పును దొడ్డిదారిలో తరలించి, కొందరు దానితో పకోడీలు వేసుకుని మరీ సిబ్బంది ఆరగిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన సరుకులను ప్రసాదం ప్యాకెట్లలో నింపి, ఎవరికీ అనుమానం రాకుండా తమ ఇళ్లకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే, దేవస్థానంలో పనిచేస్తున్న కొంతమంది అవుట్ సోర్సింగ్ (Out Sourcing) సిబ్బంది ఈ అక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల అండదండలతోనే వీరు బరితెగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గోదాముల్లో ఉండాల్సిన నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా పోయిందని, అడిగే వాడు లేకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రంలో, స్వామివారి సొమ్మును ఇలా అప్పనంగా తినేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా దేవస్థానం ఉన్నతాధికారులు స్పందించి, గోదాముల్లోని నిల్వలపై తనిఖీలు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.






