Mothers Day: ఉద్యోగులకు రూ.10 వేలతో పాటు 3 రోజులు సెలవులు.. సీఈఓ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

by Naga Rani Yarlagadda |

మదర్స్ డే సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈఓ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mothers Day: ఉద్యోగులకు రూ.10 వేలతో పాటు 3 రోజులు సెలవులు.. సీఈఓ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: మదర్స్ డే సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈఓ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో విలువైన సమయం గడపాలని ప్రోత్సహిస్తూ ఆయన ప్రకటించిన వినూత్న కార్యక్రమానికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఉద్యోగుల భావోద్వేగాలు, కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది అభినందిస్తున్నారు.

ఢిల్లీలోని ప్రముఖ పీఆర్ సంస్థ ఎలైట్ మార్క్ (Elite Marque) వ్యవస్థాపకుడు, సీఈఓ రజత్ గ్రోవర్ తన సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో కలిసి మూడు రోజుల చిన్న ట్రిప్‌కు వెళ్లేందుకు రూ.10,000 గిఫ్ట్ తో పాటు అదనంగా మూడు రోజుల ప్రత్యేక వేతనంతో కూడిన సెలవు ఇస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఈ సెలవులు ఉద్యోగుల రెగ్యులర్ పెయిడ్ లీవ్‌లో నుంచి కట్ చేయబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించిన రజత్ గ్రోవర్.. “మన కోసం జీవితాంతం అన్నింటికీ ‘అవును’ అని చెప్పిన తల్లిదండ్రులకు మనం మాత్రం ఒక రోజు అంటూ సమయాన్ని వాయిదా వేస్తూనే ఉంటాం” అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ సమయం, కలలు, శక్తి, జీవితాన్ని పిల్లల కోసం అంకితం చేస్తారని.. ఇప్పుడు వారిని “మీరు ఎప్పటినుంచో చేయాలని అనుకున్న ఒక కోరిక ఏమిటి?” అని అడిగి, దాన్ని నెరవేర్చే సమయం వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో మంచి జ్ఞాపకాలు సృష్టించుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇది బోనస్ ఇవ్వడం కోసం కాదు.. ప్రచారం కోసం కాదు.. కుటుంబ బంధాల విలువను గుర్తు చేయడానికేనని స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై నెటిజన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు. “ఇలాంటి నిర్ణయం తీసుకున్న కంపెనీ గురించి తొలిసారి వింటున్నాం”, “ఇప్పటి కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి ఆలోచన చాలా అరుదు”, “ప్రపంచం మొత్తం ఇలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. వర్క్ ప్రెజర్, బిజీ షెడ్యూల్‌ల మధ్య చాలా మంది ఉద్యోగులు తల్లిదండ్రులతో సమయం గడపలేకపోతున్నారని.. ఇలాంటి కార్యక్రమాలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మదర్స్ డే వేళ ఈ వినూత్న నిర్ణయం ఉద్యోగులకు మాత్రమే కాదు.. సమాజానికే ఒక మంచి సందేశంగా మారిందని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Next Story