జీ హుజూర్ అంటేనే ఉద్యోగం.. ఎమ్మార్వో బదిలీపై దుమారం

by  |
Sheikhpet Tehsildar Srinivas Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి బదిలీ దుమారం రేపుతోంది. గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నిక కాగానే తొలి వికెట్ పడిందన్న విమర్శలొస్తున్నాయి. జీహెచ్ఎంసీలోనూ అధికారులకు, ఉద్యోగులకు కలవరం స్టార్టయ్యింది. రానున్న ఐదేండ్ల కాలంలో ఆమె పనితీరు ఏ విధంగా ఉండనుందోనని భయం పట్టుకుంది. మేయర్ పదవిలోకి వచ్చిన మరుసటి రోజే, అంతకు ముందు ఆమెతో గొడవ పడిన తహసీల్దార్ బదిలీ కావడం ఈ అనుమానాలకు దారి తీసింది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బదిలీ చేయించగలిగారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులంతా బదిలీని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీఆర్వోలు మాత్రం తమ గొంతు కోస్తుంటే వీరంతా చూస్తూ కూర్చున్నారని, ఇప్పుడేమో ఒక్కరిపై బదిలీ వేటు వేయగానే సీఎం కేసీఆర్ ను సైతం కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. జీ హుజూర్ అంటూ ప్రజాప్రతినిధుల దగ్గర ఉండే అధికారులకే పోస్టింగులు ఉంటాయని, లేదంటే బదిలీ వేటు తప్పదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఐక్యత ఉన్నా చేసేదేం లేదు?

ఎంత ఐక్యతను ప్రకటించినా, చేసేదేం లేదని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఏం చేయగలిగారని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ గురించి గట్టిగా అడిగితే వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా స్థానిక సంస్థలకు పంపించేందుకు యోచించారు. వారికి ప్రత్యేక పీఆర్సీ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకే ఖర్చు అవుతుందని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఉద్యోగులను ఏం చేసినా ఏం కాదన్న భావనతో ప్రభుత్వం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బదిలీని ప్రశ్నించి సాధించేది కూడా ఏం లేదన్న చర్చ నడుస్తోంది. సోమవారం వరకు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసే ధోరణిలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. ఆ తరువాత అందరితో చర్చించి ఏం చేయాలన్నది నిర్ణయిస్తామంటున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుకు సిఫారసు చేసినప్పుడు 5,485 మంది వీఆర్వోల ఆత్మ ఘోషిస్తదనే కనీస ఆలోచన చేయలేదని వీఆర్వోల సంఘం నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కనీసం తమ పట్ల సానుభూతిని చూపిచలేదంటున్నారు.

గులాంగిరి చేయాల్సిందేనా? : దాసోజు శ్రవణ్ కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి
పదవులలో ఉన్న వారికి జీహుజూర్ అనాలి. గులాంగిరి చేయాలి. మాట వినని ఏ అధికారినైనా బదిలీ చేయిస్తారు. రాష్ట్రంలో ఎవరికి పోస్టింగ్ రావాలన్నా స్థానిక నాయకుల అనుమతి ఉండాల్సిందే. వారు ఎవరికి అనుమతి ఇస్తే వారికే పోస్టింగ్ దక్కుతుంది. లేదంటే లూప్ లైన్ లో ఉండాల్సిందే. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు బదిలీలు, పోస్టింగుల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదంగా సాగుతోంది. టీఆర్ఎస్ నాయకుల దయాదాక్ష్యిణ్యాలు లేకపోతే పోస్టింగ్ సంపాదించుకోలేరు. ప్రతిపక్షాలు ఉండొద్దని కోరుకుంటున్నారు. వారు చెప్పినట్లుగా నడుచుకునే అధికారులే ఉండాలనుకుంటున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు.

రాజకీయ ఒత్తిడితోనే బదిలీ : ఎం.శ్రీనివాస్, సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి
షేక్ పేట తహసీల్దార్ ను ఆకస్మికంగా బదిలీ రాజకీయ ఒత్తిడితోనే చోటు చేసుకుంది. ఆకస్మికంగా బదిలీ చేయడం, ఎలాంటి పోస్టింగు ఇవ్వకపోవడం, అత్యంత అభ్యంతరకరమైన అంశంగా భావిస్తున్నాం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అధికారిపై బదిలీ వేటు వేశారు. ప్రభుత్వ అక్రమ చర్యలను ఖండిస్తున్నాం. జీహెచ్ఎంసీకి కొత్తగా ఎన్నికైన మేయర్ తో తహసీల్దార్ కు ఇటీవల జరిగిన ఘర్షణ కారణంగానే ఈ అక్రమ బదిలీ జరిగిందని ప్రజలంతా భావిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సేవ కోసం, మంచి పాలన కోసమే. అధికార దర్పంతో కక్ష సాధింపుల కోసం కాదు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. తహశీల్దార్ అక్రమ బదిలీపై ప్రభుత్వం పునరాలోచించాలని సీపీఎం తరపున డిమాండ్ చేస్తున్నాం.

Next Story