చూశారు.. వెళ్లారు.. ‘స్లీపర్ ఫ్యాక్టరీ’కి 30 ఏండ్లైంది!

by  |
sleeper factory
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ఓ ఫ్యాక్టరీకి మూడు దశాబ్దాలుగా మోక్షం లేకుండా పోయింది. పరిశ్రమ వస్తే యువతకు వేలల్లో ఉద్యోగావకాశాలు దొరికి ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందేది. కానీ తెలంగాణకు న్యాయం చేసేందుకు అప్పటి అంధ్రా పాలకులు అడ్డుపడడం, ఇక్కడ ప్రజాప్రతినిధుల బలం సరిపోకపోవడంతో అప్పుడెవరూ పట్టించుకోలేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఫ్యాక్టరీ ఆంధ్రాకు తరలిపోయింది. ఏండ్ల కిందట పెద్దలు ఇచ్చిన మాట మిగిలే ఉంది.

చింతకాని స్లీపర్ ఫ్యాక్టరీ ఏళ్లుగా ఖమ్మం జిల్లావాసుల కల. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్న ఈ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నా అడుగు ముందుకుపడడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన అప్పటి ఆంధ్రా ఎంపీల వివక్షతో ఇప్పుడా ఫ్యాక్టరీ ఆంధ్రా ప్రాంతానికి తరలిపోయింది. కానీ రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేండ్లయింది. మన ఎంపీల గళం పార్లమెంట్లో మెండుగా వినిపిస్తున్నా చింతకాని స్లీపర్ ఫ్యాక్టరీని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పోరాడి తెలంగాణకు స్లీపర్ ఫ్యాక్టరీ సాధించాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

శంకుస్థాపన చేసిన మాధవరావు సింధియా..

గతంలో రైల్వే మంత్రిగా ఉన్న మాధవరావు సింధియా తెలంగాణ ప్రాంత ఎంపీల విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లాలోని చింతకాని మండల కేంద్రంలో స్లీపర్ (స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీ కాదు) ఫ్యాక్టరీ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. 1990 ఆయనే స్వయంగా వచ్చి చింతకాని మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ కు సమీపంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో అంతా తెలంగాణ ప్రాంత అభివృద్ధికి బాటలు పడ్డాయనుకున్నారు. కానీ ఆంధ్రాపాలకులు కుట్రలకు కొందరు తెలంగాణ ప్రజాప్రతినిధులు లోపాయికారీగా సహకరించడంతో ఫ్యాక్టరీ నిర్మాణానికి అడ్డుకట్ట పడింది.

చూశారు.. వెళ్లారు..

అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం ఆంధ్రా ఎంపీలు అడ్డుకోవడంతో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఫ్యాక్టరీ ఊసే మరిచారు. కొంతకాలం తర్వాత తెలంగాణ ఎంపీలు మళ్లీ చింతకాని స్లీపర్ ఫ్యాక్టరీ గురించి పార్లమెంట్ లో ఆందోళనలు చేశారు. 2004 యూపీఏ1 ప్రభుత్వంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఓ ఆంధ్రా ప్రజాప్రతినిధి కూడా ఫ్యాక్టరీకి సంబంధించి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో చింతకాని వచ్చి మరీ పరిస్థితులను చూశారు. అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫ్యాక్టరీ నిర్మాణం తప్పక జరుగుతుందని హామీ ఇచ్చారు. మళ్లీ ఆ దిశగా పట్టించుకున్న వారే లేరు.

నక్సల్స్ బూచీ చూపి..

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉందని అనుమతివ్వొద్దని స్వయంగా అడ్వయిజరీ కమిటీయే సిఫారుసు చేయడంతో ఫ్యాక్టరీని వదిలేస్తున్నట్టు పరోక్షంగా కేంద్రం ప్రకటించింది. అనంతరం ఆంధ్రా ఎంపీలతో కలిసి చింతకాని ఫ్యాక్టరీని ఆంధ్రాలోని కొండపల్లికి తరలించారు. అప్పుడున్న తెలంగాణ ఎంపీలు కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు.

ఎంతో మందికి ఉపాధి దొరికేది..

చింతకానిలో స్లీపర్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉంటే దాదాపు 10 వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉండేవి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందేది. రోడ్లు, రవాణా మార్గాలు సైతం మెరుగు పడేవి. అనుబంధ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పలు సంస్థలు తెలంగాణ ప్రాంతానికి తరలివచ్చేవి. దీంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేవి. కానీ ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.

స్వరాష్ట్రంలో పట్టింపేది..?

చింతకాని స్లీపర్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు శిథిలావస్థలో ఉన్నాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు కేంద్రంతో చర్చించి సాధించవచ్చని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. అప్పడు ఆంధ్రాసర్కార్, పాలకులు కూడా వారే ఉండడంతో తెలంగాణకు శాపంగా మారింది. నేడు స్వరాష్ట్రంలో ఉన్న కేసీఆర్ సర్కార్ తెలంగాణ ఎంపీలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేవిధంగా చేయాలని మరేదైనా ఫ్యాక్టరీనైనా సాధిస్తే ఇప్పటికైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువత కోరుకుంటోంది.

స్లీపర్ ఫ్యాక్టరీ అంటే..

కేంద్ర ప్రభుత్వం అప్పుడు శంకుస్థాపన చేసింది స్లీపర్ ఫ్యాక్టరీ నిర్మాణానికే అంతేకాని స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీకి కాదు. స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏసీ బోగీలను తయారు చేసే కర్మాగారం. కానీ చింతకానిలో ఏర్పాటు చేస్తానన్నది స్లీపర్ ఫ్యాక్టరీ. అంటే రైల్వే ట్రాక్ పై పట్టాలకు మధ్యలో ఉండే సిమెంట్ దిమ్మెలు, వాటిని జాయింట్ చేసే ఇనుప కడ్డీల కింద ఉండేటువంటి ప్లేట్లు తయారు చేసే ఫ్యాక్టరీ.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి..

మా ప్రాంతానికి స్లీపర్ కర్మాగారం వస్తుందంటే ఎంతో సంతోషపడ్డాం. ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనుకున్నాం. అభివృద్ధి జరుగుతుందని ఆనంద పడ్డాం. కానీ అప్పటి ఆంధ్ర పాలకుల వల్ల అది నెరవేరలేదు. ఎన్నో సార్లు స్లీపర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రాలు కూడా ఇచ్చాం. ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడున్న కేసీఆర్ సర్కార్ కూడా ఖమ్మం ప్రాంత అభివృద్ధి పట్టించుకోకపోవడం బాధాకరం. ఇప్పటికీ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతిపాదిత స్థలం అలాగే ఉంది. మన ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషిచేయాలని కోరుతున్నాం. -కన్నెబోయిన గోపి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మధిర

ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి..

కేసీఆర్ సర్కార్ కు నిజంగా తెలంగాణపై, ఖమ్మం జిల్లాపై చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చింతకానిలో స్లీపర్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. గతంలో ఆంధ్రా పాలకుల ఒత్తిడి వల్ల ఫ్యాక్టరీ సాధించలేకపోయాం. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం కేంద్రంతో చర్చించే దిశగా కృషి చేయాలి. ఒకవేళ ఇక్కడ స్లీపర్ కర్మాగారం ఏర్పాటైతే దానికి అనుబంధ కర్మాగారాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. – బందెల నాగార్జున, జగన్నాథపురం, చింతకాని


Next Story

Most Viewed