మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురు ఖైదీలు మృతి

by  |
మహారాష్ట్రలో కరోనాతో ముగ్గురు ఖైదీలు మృతి
X

ముంబయి: దేశంలో కరోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రను మరో విషయం కలవర పెడుతోంది. తలోజా, ఎరవాడ, ధూలే జిల్లా జైళ్లల్లో ముగ్గురు ఖైదీలు వైరస్ సోకి మృతిచెందినట్లు బయట పడింది. జైళ్లలో కరోనా మరణాలు నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. సామర్థ్యానికి మించి ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లు మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. అక్కడే కరోనాతో ఖైదీల మరణాలు నమోదు కావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాంబే హైకోర్టులో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సమాధానంగా మహారాష్ట్ర సర్కారు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది. జైళ్లలో రద్దీని తగ్గించి సామాజిక దూరం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆ నిర్ణయం అమలులో జాప్యం నెలకొంది.

మే 9న ఎరవాడ, తలోజాలో, మే 15న ధూలే జైళ్లో కరోనాతో ఖైదీలు మరణించారు. ధూలే జైలులో మరో ముగ్గురు ఖైదీలకు కరోనా సోకిందని సర్కారు పేర్కొంది. అయితే, ఈ మూడు మరణాలు నమోదు కాకముందే రాష్ట్రంలోని పలు జైళ్లల్లో కరోనా వేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో 158 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. బైకుల్లా మహిళా జైలులో ఒకరికి, సతారాలో మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, ఆర్థర్ జైలులో 26 మంది జైలు సిబ్బందికీ వైరస్ సోకడం గమనార్హం. ఇందులో మే 7 నుంచి 12వ తేదీ మధ్యలో కరోనా పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలు కేవలం వైరస్ లక్షణాలు కనిపించిన వారికే చేసినట్టు అధికారులు తెలిపారు. లక్షణాలు బయట పడని ఖైదీలు ఉంటే, వారి ద్వారా ఇంకా ఎంతో మందికి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

జైళ్లలో సామర్థ్యానికి మించి కాదు కదా, అనుమతి మేరకు ఖైదీలు ఉన్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కష్ట సాధ్యమే. ఎందుకంటే జైళ్లలో ఖైదీలకు కామన్ బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు ఉంటాయి. భోజనశాలల్లోనూ గుమిగూడే ఆహారాన్ని తీసుకుంటారు. నీటి కుళాయిలు, బట్టలు ఉతుక్కోవడం, ఇతర పనులకు చాలా వరకు ఖైదీలకు ఉమ్మడిగానే సదుపాయాలు ఉంటాయి. దీంతో వారి మధ్య కరోనా వ్యాప్తికి ఆస్కారం ఎక్కువ. ఈ ఆందోళనల నేపథ్యంలోనే జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గించే నిర్ణయాన్ని తీసుకున్నా అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహించింది. 11 వేల ఖైదీలను విడుదల చేయాలని మొదటిసారి నిర్ణయాన్ని తీసుకుంది. కానీ, దాని అమలు అంతంతగానే సాగింది. ఖైదీల్లో కరోనా కేసులు వెలుగు చూసిన తర్వాత గాని ఖైదీల విడుదలను వేగవంతం చేయలేదు. మే 12న 17,000 మంది ఖైదీలను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ స్థాయిలో ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


Next Story