ఏ సమయానికి నిద్రలేస్తే మంచిది? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

by  |
Morning-Sun
X

దిశ, ఫీచర్స్: సూర్యోదయానికి ముందు నిద్రలేచే అలవాటు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ పట్టణాల్లో ఆరోగ్యంపై శ్రద్ధవహించేవారు లేదంటే ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారే ఉదయం నిద్రలేస్తారు. అయితే సూర్యోదయ సమయాన లేదా అంతకుముందే మేల్కొనేవారి జీవక్రియలన్నీ సజావుగా సాగి ఉత్తేజంగా ఉండగలుగుతారు. అంతేకాదు ఆ రోజులో తమ పనులు చక్కదిద్దుకునేందుకు కావాల్సినంత టైమ్ దొరకుతుంది. మరి నిజానికి ఆ టైమ్‌లో నిద్రలేవడం మంచిదేనా? దీనివల్ల ప్రయెజనాలున్నాయా? అనే విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ దీక్ష భవసార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం.. పురాతన కాలంలో బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసేవారని, ఆ పుణ్య కాలం సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు మొదలై, సన్‌రైజ్‌కు 48 నిమిషాలు ఉందనగా ముగుస్తుందని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ మేరకు పలు విషయాలను వెల్లడించారు.

బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు మేల్కొవాలి?

– జ్ఞాన సముపార్జనకు (ధ్యానం, ఆత్మపరిశీలన ద్వారా)
– జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుదలకు (విద్యార్థుల కోసం)
– మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు(ఆ టైమ్‌లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గనుక)
– పని సామర్థాన్ని పెంచుకునేందుకు(మెంటల్ ఫోకస్‌ను బలపరుచుకొని, ఏకాగ్రత నిలపడం ద్వారా)
అంతేకాదు మెడిటేషన్‌, ఆధ్యాత్మిక పుస్తక పఠనంతో పాటు వ్యాయామానికి కూడా ఇదే అనువైన సమయమని ఆమె తెలిపారు.

ఎప్పుడు నిద్ర లేవాలి?

బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయం వరకు ఏ టైమ్‌లోనైనా లేవొచ్చు. అయితే సూర్యుడు ఉదయించడానికి ముందే లేవడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతిలో ఉండే ప్రేమపూర్వక(సాత్విక) లక్షణాలు మనసుకు ప్రశాంతతను, అవయవాలకు ఫ్రెష్‌నెస్‌ను కలిగిస్తాయి. అయితే సీజన్లు, కాలాలను బట్టి సూర్యోదయంలోనూ మార్పులుంటాయని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో తమ శరీర ప్రాకృతిక ధర్మాన్ని అనుసరించి మేల్కొనాలి.

వాతా – సన్‌రైజ్‌కు 30 నిమిషాల ముందు
పిత్తా – సన్‌రైజ్‌కు 45 నిమిషాల ముందు
కఫాస్ – సన్‌రైజ్‌కు 30 నిమిషాల ముందు
ఒకవేళ రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడంతో పాటు ఒత్తిడి వంటి ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నట్టయితే ఈ టైమ్ ఫాలో కావచ్చు :
వాతా – ఉదయం 7 గంటల లోగా
పిత్తా – ఉ. 6.30 నిమిషాలకు ముందు
కఫాస్ ఉదయం 6 గంటలకు ముందు

మీ శరీర ప్రాకృతిక ధర్మం గురించి తెలియకుంటే ఎలా?

ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం 6.30 గంటల నుంచి ఉ. 7 గంటల మధ్య నిద్రలేస్తే మంచిదని చెప్పిన డాక్టర్.. సన్‌రైజ్‌కు ముందు/సరిగ్గా అదే సమయంలో మేల్కొంటే మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు అవయవాల పనితీరులో సమతుల్యతను తీసుకొస్తుందని, పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని వెల్లడించింది. ఇది వ్యక్తి జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించి జీర్ణక్రియ, శోషణతో పాటు సమీకరణకు సాయపడుతుందని తెలిపింది. తద్వారా జీవితంలో శాంతి, ఆనందం నెలకొని దీర్ఘాయువుకు దోహదపడుతుందని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed