కారుతో మినీ ఎక్స్‌కావేటర్.. ఇస్రో సైంటిస్ట్ ఘనత

by  |
కారుతో మినీ ఎక్స్‌కావేటర్.. ఇస్రో సైంటిస్ట్ ఘనత
X

దిశ, వెబ్‌డెస్క్ : భూమిని తవ్వాలన్నా, పెద్ద పెద్ద భవంతులను నేలమట్టం చేయాలన్నా.. ‘ఎక్స్‌కావేటర్’ అవసరం. అయితే తమిళనాడులోని తిరువనంతపురానికి చెందిన ఇస్త్రో శాస్త్రవేత్త ఒకరు.. పాడైపోయిన కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చి రీయూజబిలిటీకి సరైన అర్థం చెబుతున్నాడు. 500 కిలోల బరువులెత్తే ఈ కార్ కమ్ ఎక్స్‌‌కావేటర్.. ఆరు టన్నుల సామర్థ్యంతో తవ్వకాలను చేపట్టగలదు. ఇక ఈ హోమ్ మేడ్ ఇన్నోవేషన్ కోసం ఆ శాస్త్రవేత్త ఖర్చు చేసింది కేవలం 70 వేల రూపాయలే కాగా, దాని విశేషాలేంటో తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది తమ కారు పాతదైపోగానే.. మార్కెట్లోకి వచ్చిన కొత్త కారు కొనుక్కుని, పాతదాన్ని ఎంతోకొంతకు అమ్మేస్తారు. అయితే ఇస్త్రో శాస్త్రవేత్త బెన్ జాన్సన్‌కు మాత్రం ఈ రూల్ వర్తించదు. ఎందుకంటే పాత వెహికల్స్‌ను ఏదోపనికి ఉపయోగపడేలా రీట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తూ పర్యావరణానికి సాయం చేయాలనేది తన ఉద్దేశం. ఈ క్రమంలోనే తన పాత కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చాడు. ఇందుకోసం అతడు మూడు నెలలకు పైగా కష్టపడ్డాడు.

‘ఇదో మినీ క్రేన్.. పాత కారును ఉపయోగించి కేవలం 70 వేల ఖర్చుతో దీన్ని తయారుచేసుకోవచ్చు. మార్కెట్లో కమర్షియల్ ఎక్స్‌కావేటర్ కొనాలంటే మినిమం రూ. 20 లక్షలు వెచ్చించాల్సిందే. నా కారు 20 సంవత్సరాల పాతదైనా, మంచి కండిషన్‌లోనే ఉండటంతో, దానితో సమాజానికి పనికొచ్చే పని ఏదైనా చేయాలనుకున్నాను. ఎన్నో ఆలోచనల తర్వాత మినీ క్రేన్‌కు ఫిక్స్ అయ్యాను. మే నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయగా, దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ను గుజరాత్ నుంచి తెప్పించాను. లాక్‌డౌన్ ఆంక్షల వల్ల ప్రాజెక్ట్‌కు అవసరమైన ప్రొడక్ట్స్ రావడం లేట్ కావడంతో ఆగస్టులో దీన్ని పూర్తి చేశాను. చెరువులు, రోడ్ల తవ్వకాలు, కుంటలు, కాలువల పూడికతీత పనులకు దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని జాన్సన్ తెలిపాడు.


Next Story

Most Viewed