జగన్ పాలనలో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లింది : చంద్రబాబు

by  |
Chandrababu
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ రెండున్నరేళ్ల పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కెళ్లిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు లేవని ట్విటర్ వేదికగా విమర్శించారు. వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం రైతాంగాన్ని సరిగ్గా ఆదుకోకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని అన్ని విధాల ప్రోత్సహించామని.. ఏ రైతు కంట కన్నీరు పెట్టలేదన్నారు.

తమ పాలనలో ఒక్క రైతుకూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి రాగానే అమరావతిని సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. అంతేకాదు తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సైతం నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం నేరాలకు అడ్డగా మారిపోయిందని విమర్శించారు.

అఫ్ఘానిస్తాన్ నుంచి ఏపీకి డ్రగ్స్‌ దిగుమతి జరుగుతోందని, సీఎం ఇంటి సమీపంలో ఓ కంపెనీ పేరుతో రూ.21 వేల కోట్ల ‍హెరాయిన్ పట్టుబడటం సంచలనంగా మారిందన్నారు. డ్రగ్స్ వ్యాపారంతో ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story