బండి పర్యటనలో రెండోరోజూ రణరంగం.. ఆర్ఐకి గుండెపోటు

by  |
Bandi Sanjay, Suryapet tour
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర రెండోరోజూ రణరంగంగా మారింది. యాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడంతో ఇరు పార్టీల నేతలు రాళ్లు, గుడ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అదుపుచేయలేని స్థితిలో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాళ్ల దాడిలో ఇరు పార్టీ నాయకుల కార్లు ధ్వంసం అయ్యాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర రెండోరోజు సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో సాగింది. చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్‌లో టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వట్టి ఖమ్మం పహాడ్‌కు బండి సంజయ్ వస్తున్నాడన్న ముందస్తు సమాచారంతో కొనుగోలు కేంద్రాల వద్ద చివ్వెంల టీఆర్ఎస్ జడ్పీటీసీ సంజీవ నాయక్, ఎంపీపీ కుమారి బాబునాయిక్, టీ‌ఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఆత్మకూర్(ఎస్) మండల జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, కొణతం సత్యనారాయణ రెడ్డి పార్టీ కార్యకర్తలతో భారీగా అక్కడకు చేరుకొని బీజేపీ నేతలను అడ్డుకున్నారు. అనంతరం బండి సంజయ్ కాన్వాయ్ వట్టి ఖమ్మం పహాడ్ చేరుకోగానే ‘సంజయ్ గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొంతమంది టీఆర్ఎస్ శ్రేణులు గుడ్లతో దాడులు చేయడంతో బీజేపీ నేతలు రాళ్ల దాడి చేశారు. అనంతరం ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు.

పోలీసుల సాయంతో కొనుగోలు కేంద్రానికి చేరుకున్న బండి సంజయ్‌కి రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్, లక్ష్మీనాయక్ త౦డా ఐకేపీ సెంటర్‌లో పదిరోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే వడ్లను కాపాడేందుకు కొనుగోలు కేంద్రంలో టార్ఫాలిన్‌లు లేక కొనుక్కొని కాపాడుకుంటున్నామని వివరించారు. గత సీజన్‌లో ట్రాక్ షీట్ ఇవ్వక ఒక్కో రైతు రూ.10 వేలకు పైగా నష్టపోయామని తమ బాధను చెప్పుకున్నారు. చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) మండలాల్లో బండి సంజయ్ యాత్ర అడ్డుకునేందుకు రోడ్లపై ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి, బీజేపీ నేతల వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. గాంధీనగర్, కుడకుడలో బీజేపీ నేతల కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో మొత్తం ఎనిమిది కార్లు ధ్వంసం అయ్యాయి. 460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఎక్కడా కూడా టీ‌ఆర్‌ఎస్ నాయకులను నిలువరించలేకపోయారు. టీఆర్ఎస్ నాయకులను అదుపు చేసే క్రమంలో ఆర్ఐకి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రాష్ట్రం ఏజెంట్‌గా ఉంటుందని తెలిపారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటన చేస్తున్న తమను అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని అన్నారు. రైతుల ముసుగులో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. టీఆర్ఎస్ నేతల ఉడుత ఊపులకు బీజేపీ భయపడే పార్టీ కాదని, రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆత్మకూర్(ఎస్) మండలంలో జరిగిన దాడిలో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఏఎస్ఐ రామ్ కోటి, కానిస్టేబుల్ జంపాల శ్రీనివాస్, బీజేపీ కార్యకర్తలు రవీందర్, రాము, భరత్, హాబీద్, టీఆర్ఎస్‌కు చెందిన దొంతరబోయిన సైదులుకు గాయాలయ్యాయి. కాగా, బండి సంజయ్ వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరావు, పందిరి రామ్ రెడ్డి, మన్మథరెడ్డి, అస్లాం నరేంద్ర, హాబీద్, మాధవరెడ్డి, సంద్యాల సైదులు, శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు.


Next Story