CM రేవంత్ రెడ్డి vs హరీష్ రావు.. మిగిలిన ఏడు అంశాల సంగతేంటి?

by Disha Web Desk 2 |
CM రేవంత్ రెడ్డి vs హరీష్ రావు.. మిగిలిన ఏడు అంశాల సంగతేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లకు వేదికవుతున్నది. రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. నామినేషన్ల పర్వం ముగిసి ప్రచారం ఊపందుకున్న సమయంలో రెండు పార్టీల నేతల మధ్య ఛాలెంజ్‌లు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సీఎం రేవంత్ ఇచ్చిన కౌంటర్‌ రెండు రోజులుగా రాజకీయ వాతావణాన్ని వేడెక్కించింది.

హరీశ్‌రావు విసిరిన సవాలేంటి?

రైతు రుణమాఫీతో పాటు మొత్తం ఎనిమిది అంశాలను ప్రస్తావించిన హరీశ్‌రావు ఆగస్టు 15లోగా వీటిని అమలు చేస్తే వెంటనే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇకపైన ఎన్నికల్లో పోటీ చేయనని ఈ నెల 24న స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రూ.2 లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీల్లో ఉన్న మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి స్కీమ్‌లో రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం, రైతుభరోసా పథకం ద్వారా ఎకరానికి ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం, వరి కొనుగోలులో రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు, చేయూత స్కీమ్ కింద నెలకు రూ.4,000 పింఛన్, నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు నెలకు రూ.4,000 సాయం.. మొత్తం ఎనిమిది అంశాలను పేర్కొన్నారు.

ఆగస్టు 15లోగా నెరవేరిస్తే.. రాజీనామాకు సిద్ధం

ఎనిమిది హామీలను ఆగస్టు 15లోగా నెరవేరిస్తే రాజీనామాకు సిద్ధమని హరీశ్‌రావు సవాల్ విసిరారు. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించి ఏప్రిల్ 25 డెడ్‌లైన్ పెట్టారు. 8 అంశాల అమలు కోసం ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు గడువు ఉన్నదని, నెరవేరకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు ఏప్రిల్ 26న ఉదయం గన్ పార్కు దగ్గర అమరవీరుల స్తూపం వద్దకు రావాలని షరతు విధించారు. ఆ ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. కానీ సీఎం రేవంత్ మాత్రం హాజరు కాలేదు. దీనిపై హరీశ్‌ కాస్త ఘాటుగానే మాట్లాడారు. అమరవీరుల స్తూపాన్ని అవమానం చేశారంటూ రేవంత్ సైతం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణులు పసుపునీళ్లతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారు.

సవాల్‌ను స్వీకరించిన సీఎం రేవంత్

హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ బహిరంగ సభల ద్వారానే రిప్లై ఇచ్చారు. ఆరు నూరైనా... భూమి ఆకాశాలు తలకిందులైనా... తూర్పున పొడిచే సూర్యుడు పడమర ఉదయించినా పంద్రాగస్టుకల్లా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేసి తీరుతానంటూ స్పష్టంగా ప్రకటించారు. ఇక రాజీనామాకు సిద్ధం కావాల్సింది హరీశ్‌రావేనని, వెంటనే రిజిగ్నేషన్ లెటర్‌ జేబులో ఉంచుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టుకల్లా రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని, అదే రోజున హరీశ్‌రావుతో మాట్లాడతానని, రాజీనామా లేఖ గురించి తేలుస్తానని క్లారిటీ ఇచ్చారు.

మిగిలిన ఏడు అంశాల సంగతేంటనే చర్చ

హరీశ్‌రావు లేవనెత్తిన 8 అంశాల్లో సీఎం రేవంత్ రుణమాఫీని మాత్రమే ప్రస్తావించారని, మిగిలిన ఏడు అంశాల సంగతేంటనే చర్చ మొదలైంది. రుణమాఫీ విషయంలో డేట్‌తో సహా డెడ్‌లైన్ పెట్టిన సీఎం మిగిలిన ఏడు అంశాలపై ఎలాంటి వైఖరినీ వెల్లడించకపోవడానికి కారణమేంటనేది సమాధానం లేని ప్రశ్నగానే మారింది. హరీశ్‌రావు రాజీనామా సవాల్ వెనక మొత్తం ఎనిమిది అంశాలు ఉంటే కేవలం రుణమాఫీ విషయంలోనే సీఎం రేవంత్ రాజీనామాకు పట్టుబట్టడం ఆసక్తికరంగా మారింది. రుణమాఫీ మాత్రమే అమలు చేసి హరీశ్‌రావును రాజీనామా చట్రంలో పెట్టి పొలిటికల్‌గా కార్నర్ చేయాలన్నది సీఎం రేవంత్ వ్యూహంగా కనిపిస్తున్నదనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే మొత్తం ఎనిమిది హామీల అమలుపై సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వాలన్నది గులాబీ లీడర్ల వాదన.

అయితే రుణమాఫీ సహా మొత్తం ఎనిమిది అంశాలపై హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు సీఎం రేవంత్ గైర్హాజరుతో అది వన్‌ సైడ్ ఛాలెంజ్‌గానే మిగిలిపోయింది. హరీశ్‌రావు డిమాండ్లలో సీఎం రేవంత్.. కేవలం రుణమాఫీని మాత్రమే ప్రస్తావిస్తూ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలు అయిపోగానే ఈ సవాల్ అటకెక్కుతుందా?.. లేక సీఎం రేవంత్ ఆగస్టు 15న హరీశ్‌రావుతో మాట్లాడతానని, రాజీనామా లేఖను రెడీగా ఉంచుకోవాలని చెప్పినందున ఆ రిజిగ్నేషన్ కోసం పట్టుబడతారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.



Next Story