ఘోర విషాదం.. ఆ ఆస్పత్రిలో మరో 49 డెడ్‌బాడీస్

by Dishanational6 |
ఘోర విషాదం.. ఆ ఆస్పత్రిలో మరో 49 డెడ్‌బాడీస్
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి దగ్గర మరో 49 డెడ్ బాడీలను వెలికితీశారు. గతంలో గాజాలోని అల్- షిఫా హాస్పిటల్ దగ్గర ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఆ హాస్పిటల్ కేంద్రంగా ఇజ్రాయెల్ దళాలు- హమాస్ మిలిటెంట్లకు మధ్య భీకర పోరు జరిగిందన్న సంగతి తెల్సిందే. ఈ విషయాన్ని గాజా వైద్యాధికారులు తెలిపారు. పాలస్తీనా మిలటరీ సిబ్బంది ఆసుపత్రులను కమాండ్ సెంటర్‌లుగా ఉపయోగిస్తున్నారని.. అక్టోబర్ 7న అపహరించిన వారిని బందీలుగా ఉంచారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మరోవైపు, హమాస్ ఆరోపణను ఖండించింది.

అల్-షిఫాలోని అత్యవసర విభాగం అధిపతి మోటాస్సెమ్ సలా మీడియాతో మాట్లాడుతూ.. మూడో సామూహిక సమాధి కనుగొన్నామన్నారు. ఆస్పత్రి శిథిలాల కింద అనేక డెడ్ బాడీలు కుళ్లిపోయాయని తెలిపారు. గత నెలలో ఆసుపత్రి ప్రాంగణంలో మరో రెండు సమాధుల్లో సుమారు 30 మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు వివరించారు. రోగులు అక్కడ చిక్కుకుపోయినప్పటికీ, ఇజ్రాయెల్ దళాలు ఆసుపత్రిలోని పాలస్తీనీయున్లతో పోరాడుతున్నాయని తెలిపారు. మార్చిలో ఇజ్రాయెల్ దాడి చేసిన తరువాత.. అల్- షిఫా బూడిదగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఈ పోరాటంలో 200 మంది కార్యకర్తలు మరణించారని.. వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారని మిలిటరీ తెలిపింది. ఈ యుద్ధంలో కనీసం 300 మంది చనిపోయినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. అల్-షిఫా ప్రాంగణంలో డెడ్ బాడీలు కనుగొన్నట్లు హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఇటీవలే గాజా అంతటా మూడు వేర్వేరు ఆస్పత్రుల్లో 7 చోట్ల మృతదేహాల గుట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. మొత్తం 520 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

అక్టోబరు 7న జరిగిన దాడిలో 1,170 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో దాదాపు 250 మందిని కిడ్నాప్ చేశారు. వీరిలో 128 మంది గాజాలో ఉన్నారని ఇజ్రాయెల్ అంచనా వేసింది. కిడ్నాప్ చేసిన వారిలో 36 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు.ఇకపోతే, ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో గాజాలో 34,844 మంది మరణించారు. అందులో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నట్లు తెలిపారు అక్కడి అధికారులు.

Next Story