కేజ్రీవాల్‌‌కు బెయిలా ? జైలా ? తేలేది ఆ తేదీనే !

by Hajipasha |
కేజ్రీవాల్‌‌కు బెయిలా ? జైలా ? తేలేది ఆ తేదీనే !
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు మధ్యంతర బెయిల్‌ వస్తుందా ? రాదా ? అనేది మే 10న తేలిపోనుంది. తనకు బెయిల్ కావాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే దీనిపై శుక్రవారం రోజు మధ్యంతర ఆదేశాలను ఇస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బుధవారం వెల్లడించారు. ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజున వాదనలు వింటామని తెలిపారు.అరెస్టు పిటిషన్‌పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశాన్ని పరిగణిస్తామని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తూ సీఎంగా అధికారిక విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. అందుకు పూర్తిగా సహకరిస్తానని కోర్టుకు కేజ్రీవాల్ హామీ కూడా ఇచ్చారు. ఈనేపథ్యంలో మే 10న సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం కేజ్రీవాల్‌కు అనుకూలంగా వస్తాయా ? రావా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జైలు నుంచే పాలన సాగించేలా..

ఇక జైలు నుంచే పరిపాలన సాగించేలా తిహార్‌ జైలులో కేజ్రీవాల్‌కు సౌకర్యాలు కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సీఎం కేజ్రీవాల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులను నిలువరించడంతో పాటు వాటిని ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని పిటిషనర్‌ కోరాడు. ఈ పిటిషన్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘కేజ్రీవాల్ కోసం మేం ఎమర్జెన్సీ విధించాలా? మార్షల్‌ లా‌ను అమలుచేయాలా? రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మీడియాపై మేం సెన్సార్‌షిప్‌ ఎలా విధించగలం?’’ అని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ.. దాన్ని దాఖలు చేసిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా విధించింది.

Next Story