వరదలకు వంద మంది బలి.. నిరాశ్రయులైన 1.60 లక్షల మంది

by Dishanational6 |
వరదలకు వంద మంది బలి.. నిరాశ్రయులైన 1.60 లక్షల మంది
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్ ను వరదలు ముంచెత్తున్నాయి. దక్షిణ బ్రెజిల్ లో వరదల వల్ల కనీసం వంద మంది చనిపోయారని అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో ప్రజలు తప్పిపోయారని.. వారి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోరమైన ప్రకృతి వైపరీత్యానికి జనం బలయ్యారు. దాదాపు 400 మున్సిపాలిటీలు వరదల వల్ల ప్రభావితం అయ్యాయి. 1.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తాగునీరు, విద్యుత్ లేక చాలామంది అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది.

పోర్టో అలెగ్రే సిటీలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు గవర్నర్ ఎడ్వర్డో లైట్. అక్కడ అత్యవసర చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు 15 వేల మంది సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలకు రావద్దని ప్రజలను కోరారు. సుమారు 900 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పోర్టో అలెగ్రే గుండా ప్రవహించే గైబా నది గరిష్ఠస్థాయికి చేరుకుంది. మరో 5 ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. ప్రజలందరూ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు కోరారు.

Next Story