మంటగలిసిన ‘మానవత్వం’.. తండ్రి ‘శవం’ ముందు అన్నదమ్ముల కొట్లాట

by  |
మంటగలిసిన ‘మానవత్వం’.. తండ్రి ‘శవం’ ముందు అన్నదమ్ముల కొట్లాట
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తండ్రి అంతిమయాత్రలో ఎవరైనా ఒక కుమారుడు ముందు నడిచి క్రియా కార్యక్రమాలను పూర్తి చేయడం ఆనవాయితీ. కానీ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలో తండ్రి శవానికి నిర్వహించే అంతిమ యాత్రలో ముందు నేను నడుస్తా అంటే కాదు.. నేను నడుస్తాను అని అన్నదమ్ములిద్దరూ పోటీపడి చివరకు పంచాయతీని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఎటూ తేలకపోవడంతో ఇద్దరు అన్నదమ్ములు అంతిమ యాత్ర ముందు ఎవరికి వారుగా నడిచి అంత్యక్రియల తతంగాన్ని ముగించారు.

వివరాల్లోకి వెళితే.. గన్ముక్ల గ్రామ మాజీ సర్పంచ్ సాలే కతాలప్పకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ప్రస్తుత గ్రామ సర్పంచ్ చంద్రయ్య, తిమ్మయ్య, మరో కూతురు ఉండగా రెండో భార్యకు కుమారుడు కృష్ణమోహన్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుధవారం మృతి చెందిన కతాలప్ప అంత్యక్రియలను నిర్వహించేందుకు బంధువులు, మిత్రులకు సమాచారం ఇచ్చారు. అంతిమ యాత్ర సందర్భంగా చంద్రయ్య, కృష్ణమోహన్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ విషయంపై కుల పెద్దలు చెప్పినా అన్నదమ్ములు అంగీకరించలేదు.

చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి చక్కపడకపోవడంతో అన్నదమ్ములు ఇరువురు తండ్రి అంతిమయాత్ర ముందు చేతిలో చెంబు పట్టుకొని బయలుదేరారు. అంత్యక్రియల కార్యక్రమాలను ఎవరికివారుగా నిర్వహించుకొని వెళ్లిపోయారు. అంతిమయాత్ర విషయంలో అన్నదమ్ములు పోటీపడడం చుట్టుపక్కల గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed