ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం సాకారం..

by Ravi |   (  Updated:2026-01-22 00:45:57  IST  )

ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్‌ అయింది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కల సాకారం అయింది.

ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం సాకారం..
X

ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక చారిత్రక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్‌ అయింది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కల సాకారం అయింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భోగాపురం ఒక కీలక మలుపుగా నిలవబో తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక, సామాజిక, పట్టణాభివృద్ధికి ఇది కొత్త దిశను నిర్దేశించే శక్తివంతమైన ఉత్ప్రేరకంగా మారనుంది.

ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుంది. విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ అసమానతలను తగ్గించే సాధనంగా నిలుస్తుంది. ఈ విమానాశ్రయం ఒక నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. అది ఉత్తర ఆంధ్ర ప్రజల ఆశలకు, అవకాశాలకు, భవిష్యత్తుకు ప్రతీక. ఇది పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే, ఉత్తరాంధ్ర ఆర్థిక పటంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడం ఖాయం.

గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు..

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న విమాన ప్రయాణ అవసరాలకు అనుగుణంగా, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. ఖాళీ భూముల్లో పూర్తిగా కొత్తగా నిర్మించే ఈ విమానాశ్రయాలు ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సామర్థ్యం, పర్యావరణ హితమైన రూపకల్పనతో రూపొందుతున్నాయి. ఈ విమానాశ్రయాలు రద్దీ తగ్గించడం, ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడం, పర్యాటకం, వ్యాపారాన్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, స్థిరమైన (సస్టెయినబుల్) అభివృద్ధికి మార్గం వేస్తున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తున్నాయి..

అంచనాలకన్నా ముందంజలో నిర్మాణం..

ఈ విమానాశ్రయ నిర్మాణాలు అంచనాలకు మించి వేగంగా సాగుతున్నాయి.. షెడ్యూల్‌కు ముందే పనులు సాగడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రైవేట్ పెట్టు బడుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విమానాశ్రయం నిజమైన ప్రభావం పర్యాటక రంగంలో స్పష్టంగా కనిపించనుంది. విశాఖపట్నం తీరప్రాంతాల సౌందర్యం, అరకు లోయల ప్రకృతి వైభవం, బౌద్ధ వారసత్వ క్షేత్రాలు, గిరిజన సంస్కృతి.. ఇవి అన్నీ ఇప్పటివరకు సరైన అంత‌ర్జా తీయ కనెక్టివిటీ లేకపోవడంతో పరిమితంగానే ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ప్రత్యక్ష అంతర్జా తీయ విమానాలు అందుబాటులోకి వస్తే, ఉత్తరాంధ్ర ప్రపంచ పర్యాటక పటంలో ఒక ప్రముఖ గమ్యస్థానంగా అవతరించనుంది. విజయనగరం–భీమునిపట్నం మార్గం ప్రీమియం హాస్పిటాలిటీ కారిడార్‌గా మారడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, చిన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.

సమగ్ర అభివృద్ధికి కేంద్రబిందువు..

ఈ విమానాశ్రయం ప్రభావం పర్యాటకానికే పరిమితం కాదు. విమానయానం, లాజిస్టిక్స్, ఎగుమతులు, పరి శ్రమలు, రియల్ ఎస్టేట్, పట్టణ విస్తరణ ఇలా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ఇది కేంద్రబిందువుగా మారనుంది. ఏటా ఆరు మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో ప్రారంభమయ్యే ఈ విమానాశ్రయం, భవిష్యత్తులో 18 మిలియన్ల సామర్థ్యానికి విస్తరించనుండటం ఉత్తర ఆంధ్రానికి దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టికోణాన్ని తెలియజేస్తోంది.

భవిష్యత్తుకు ప్రతీక..

మొత్తంగా చూస్తే, భోగాపురం అంతర్జాతీయ విమా నాశ్రయం ఒక నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. అది ఉత్తర ఆంధ్ర ప్రజల ఆశలకు, అవకాశాలకు, భవిష్యత్తుకు ప్రతీక. ఇది పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే, ఉత్తరాంధ్ర ఆర్థిక పటంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడం ఖాయం. తొలి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి దశలో రూ.4,725 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. జులై తొలి వారం నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు ఉంటాయి. రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యం ఉంది. ఏటా 20 వేల టన్నుల సరకు ఎగుమతులకు అవకాశం ఉంది. విమానాశ్రయం టెర్మినల్‌ లోపల విప్లవవీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహం, ఏటికొప్పాక బొమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలకు నిర్ణయించారు. ఒక్కసారి కనుక విమానం ఇక్కడ నుంచి ఎగిరితే అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో దశ తిరిగినట్లే అని అంటున్నారు. టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని అలాగే ఇతర కార్యకలాపాలు పారిశ్రామీకరణతో పాటు వివిధ రంగాలలో పెట్టుబడులు కూడా ఊపందుకుంటాయని భావిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరంధ్రాకే ఆయువుపట్టుగా నిలుస్తుంది.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story