కొలిక్కి రాని ఈటల భూ వివాదం

by  |
కొలిక్కి రాని ఈటల భూ వివాదం
X

దిశ ప్రతినిధి, మెదక్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య పేరిట ఉన్న జమున హేచరీస్ భూ వివాదంపై కొనసాగుతున్న విచారణ మూడో రోజు కూడా కొలిక్కి రాలేదు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల బృందం మూడో రోజు విచారణ జరిపింది. సోమవారం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగించారు. జమున హేచరీస్ కు అసలు అనుమతులు ఉన్నాయా? అన్న కోణంలో విచారణ జరిపారు. పంచాయతీ రికార్డులను తెప్పించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ జరుగుతున్న చోటికి పంచాయతీ కార్యదర్శి, వెల్దుర్తి మండల పరిషత్ అధికారిని పిలిపించి వీరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. ఏ చిన్న లోపాన్ని కూడా వదలకుండా సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. సోమవారం సాయంత్రానికి పూర్తి విచారణ పూర్తవుతుందని భావించినా.. పలు అంశాల్లో విచారణ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

అటవీ అధికారుల రెండో రోజు సర్వే

జమున హేచరీస్ యాజమాన్యం నిర్మించిన రోడ్డును సోమవారం నాడు అటవీశాఖ అధికారులు పరిశీలించారు. రెండవ రోజు కూడా ఫారెస్ట్ సిబ్బందితో సర్వే చేయించారు. మూడున్నర ఎకరాలలో నూతనంగా నిర్మించిన రోడ్డుకు ఇరువైపులా అటవీశాఖకు సంబంధించిన భారీ వృక్షాలు లేవని తేల్చారు. రోడ్డును నిర్మిస్తున్న సమయంలో ముళ్ల పొదలు, కొన్ని చిన్న చెట్లు తొలగించినట్లు గుర్తించారు. వంట చెరుకు కోసం వాడే చిన్న చిన్న చెట్లను మాత్రం రోడ్డు నిర్మాణంలో తొలగించినట్లు గుర్తించారు. మంగళవారం నాడు మరో సారి సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో నివేదిక అందించే అవకాశం ఉంది.

నాలుగో రోజైనా కొలిక్కి వచ్చేనా?

ఈటెల రాజేందర్ పై రైతులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కోసం సీఎస్ ని, డీజిని గత నాలుగు రోజుల క్రితం ఆదేశించిన విషయం తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు శనివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ హరీతో పాటు పోలీసు, ఇంటలిజెన్స్, విజిలెన్స్, ఏసీబీ అధికారులు వేర్వేరుగా విడిపోయి సుమారు ఏడు గంటల పాటు విచారించారు. విచారణ పూర్తి కాకపోవడం సెలవు దినమైన ఆదివారం కూడా రెవెన్యూ ఫారెస్టు అధికారులు విచారించారు. కాగా సోమవారం రోజున కూడా ఫారెస్టు అధికారులు విచారణ కొనసాగించారు. అయినా విచారణ పూర్తికాకపోవడం సెలవు దినమైన ఆదివారం కూడా రెవెన్యూ, ఫారెస్టు అధికారులు విచారించారు. కాగా సోమవారం రోజున కూడా ఫారెస్టు అధికారులు విచారణ కొనసాగించారు. అయినా విచారణ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా విచారణ కొనసాగే అవకాశం కన్పిస్తుంది. జమున హాచరీలో ప్రస్తుతం రోడ్డు నిర్మాణం చేసింది ఎవరు .. ? నిర్మాణ సమయంలో చెట్లను తొలగించింది ఎవరో గుర్తించే పనిలో అటవీశాఖ అధికారులు ఉన్నారు. మంగళవారం మరో మారు సర్వే నిర్వహించి పూర్తి స్థాయిలో నివేదిక అందించే అవకాశం ఉంది.


Next Story

Most Viewed