సర్పంచ్‌ల మెడకు ‘ఈఎంఐ’ ఉచ్చు.. ఏప్రిల్ నెల గండమే!

by  |
Tractor EMI
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటున్నాయి. వీటికి తోడుగా సర్కార్‌‌‌‌ ఇచ్చిన ట్రాక్టర్లు చిన్న గ్రామ పంచాయతీలకు భారమవుతున్నాయి. నెలవారీ వాయిదాలు, మెయింటెనెన్స్‌‌ ఖర్చులు చెల్లించలేక సర్పంచులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్‌‌ సిబ్బంది జీతాలు, కరెంట్‌‌ బిల్లులకు కూడా సరిపోకపోవడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. వీటికి తోడుగా రోడ్‌‌ ట్యాక్స్‌ మరింత భారమవుతోంది. అంతేకాకుండా పంచాయతీలకు నిధులు ఇస్తున్నట్టే ఇస్తూ ఫ్రీజింగ్​ విధిస్తున్నారు. ఫలితంగా బిల్లులు ఆగిపోతున్నాయి. మరోవైపు పంచాయతీల ట్రాక్టర్లను విధిలేని పరిస్థితుల్లో అద్దెకు తిప్పుతున్నారు. ఇది సర్పంచ్​ల పదవులకు ఎసరు పెడుతోంది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో 18 మంది సర్పంచ్​లకు షోకాజ్​ నోటీసులు కూడా జారీ అయ్యాయి. చాలా గ్రామాల్లో విచారణ జరుగుతోంది.

అన్ని పంచాయతీలకు ఆర్థిక భారమే

రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలుండగా… 7100 మైనర్​ పంచాయతీలున్నాయి. వీటితో కొత్తగా ఏర్పాటైన గ్రామాలు 4383 ఉన్నాయి. ఇవన్నీ మరింత చిన్న జీపీలు. 500 నుంచి 600 వరకు జనాభా ఉన్న పంచాయతీలే. వీటికి స్వీయ ఆదాయం చాలా తక్కువ. అటు ప్రభుత్వం నుంచి వచ్చే పల్లె ప్రగతి నిధులు కూడా తక్కువే. అయితే ప్రతి పంచాయతీకి ట్రాక్టర్​, ట్రాలీ ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీటిపై భారాన్ని మోపింది. ట్రాక్టర్ల నెలవారీ ఇన్‌‌స్టాల్‌‌ మెంట్‌‌ మినిమమ్‌‌ రూ.11 వేలు ఉండగా… డ్రైవర్‌‌‌‌ జీతం రూ. 8,500 ఉంది. గ్రామ పంచాయతీ ఏదైనా కార్మికుల వేతనం రూ. 8,500గా నిర్ణయించారు. ఇక ట్రాక్టర్​కు రోడ్‌‌ ట్యాక్సులు నెలకు రూ. 1000 నుంచి రూ. 1400 వరకు చెల్లించాల్సి వస్తోంది. వీటికి తోడు డీజిల్‌‌ ఖర్చులు, మైనర్‌‌‌‌ రిపేర్లకు ఖర్చులు అదనం. కొన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ట్రాలీకి, ట్యాంకర్‌‌‌‌కు కూడా లోన్‌‌ తీసుకున్నారు. ఇలాంటి వారు నెలకు రూ.17 వేల వరకు ఇన్‌‌స్టాల్‌‌మెంట్లు చెల్లించాల్సి వస్తోంది.

జీపీలకు ఆర్థిక సంఘం ఇచ్చే నిధులే ఆధారం. పన్నులు ఎక్కువగా వసూలు కావు. వీటితోనే సిబ్బంది వేతనాలు, జీపీ మెయింటెనెన్స్‌‌ ఖర్చులు భరించాల్సి వస్తోంది. మేజర్​ పంచాయతీలకు ఒకింత ఇబ్బందులు లేకున్నా చిన్న పంచాయతీలకు ఆర్థికంగా తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. ఏటా రూ. 3 నుంచి 4 లక్షలు కూడా రావడం లేదు. కానీ ట్రాక్టర్‌‌‌‌ ఈఎమ్‌‌ఐ, డీజిల్‌‌ ఖర్చులు, డ్రైవర్‌‌‌‌, మల్టీపర్పస్‌‌ వర్కర్స్‌‌ వేతనాలు, కరెంట్‌‌ బిల్లులు, పంచాయతీ మెయింటెనెన్స్‌‌ అన్ని ఖర్చులు కలిపితే ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువ అవుతున్నాయి.

మరోవైపు పంచాయతీల అవసరాలకు కొన్న ఈ ట్రాక్టర్లను కమర్షియల్‌‌ విభాగంలో రిజిస్ట్రేషన్‌‌ చేయించడంతో రోడ్‌‌ ట్యాక్స్‌‌ చెల్లించాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టర్‌‌‌‌కు, ట్యాంకర్‌‌‌‌, ట్రాలీ అన్నింటికి కలిపి మూడు నెలలకు రూ. 4 వేల వరకు కడుతున్నారు. ట్రాక్టర్లు ఇచ్చిన కొత్తలోనే రోడ్‌‌ ట్యాక్స్‌‌ తొలగించాలని కోరినా… ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనీసం ట్రాక్టర్ల మెయింటెనెన్స్​కు కొంతైనా నిధులు ఇవ్వాలని లేఖలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి రిప్లై రావడం లేదు.

ఫ్రీజింగ్​ కంటిన్యూ

పంచాయతీలకు ప్రతినెలా కోట్లు ఇస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మాటలకే పరిమితమవుతోంది. నిధుల విడుదలలో చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పంచాయతీలకు రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవోలు జారీ చేస్తున్నా… నిధులను మాత్రం ఫ్రీజింగ్​లో పెడుతోంది. ఖాతాల్లో నిధులు ఉన్నట్లు చూపిస్తున్నా చెక్కులు మాత్రం పాస్​ కావడం లేదు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించి మార్చి మొదటి వారం వరకు రూ. 1400 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెక్కులన్నీ సిద్ధమయి ట్రెజరీకి వెళ్లాయి. కానీ ట్రెజరీల నుంచి మాత్రం బయటకు రావడం లేదు.

ఈఎంఐ చెల్లించకుంటే ట్రాక్టర్లు గుంజుకుంటాం

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లకు నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్​ వరకు ఎంతో కొంత మేరకు వాయిదాలు చెల్లిస్తున్నా… జనవరి నుంచి మాత్రం ఆగిపోయాయి. ట్రాక్టర్ల నెలవారీ చెక్కులను కూడా నిలిపివేశారు. మార్చి నెల గడువు ముగియడంతో ఈఎంఐలుచెల్లించాలని, లేకుంటే ట్రాక్టర్లు జప్తు చేస్తామంటూ నోటీసులు జారీ చేశారు.

సర్పంచ్​లకు పదవీ గండం

కొన్ని గ్రామాల్లో సర్పంచ్​లు ఆర్థిక కష్టాలతో ట్రాక్టర్లను పంచాయతీ పనులకు కాకుండా ప్రైవేట్​ పనులకు వాడుతున్నారు. అయితే ఇది నిబంధనల ప్రకారం తప్పే అయినా విధిలేని పరిస్థితి అంటున్నారు. కానీ దీనిపై ఫిర్యాదులు వస్తుండటంతో సర్పంచ్​ల పదవికి ఎసరు తెస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 18మంది సర్పంచ్​లు ట్రాక్టర్లను ప్రైవేట్​పనులకు వాడుకున్నారంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వరంగల్​ అర్బన్​, భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఇదే విచారణ జరుగుతోంది. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పుతున్నారు.

Next Story