ప్లీజ్ ఆగండి… క్యాండిడేట్స్​ కావలె..!

by  |
ప్లీజ్ ఆగండి… క్యాండిడేట్స్​ కావలె..!
X

అన్ని పార్టీల్లో గ్రేటర్​ వార్​ కాకపుట్టిస్తుండగా, కాంగ్రెస్​ది విచిత్ర పరిస్థితి.. అభ్యర్థులున్న చోట టికెట్లు ఇవ్వరు.. టికెట్లు ఇచ్చే చోట అభ్యర్థులుండరు.. ఆశావహుల ప్రయత్నాలు ఓ వైపు.. నిరాశావాదుల అలకలు మరోవైపు.. కోఆర్డినేటర్ల సమావేశానికి సీనియర్లే డుమ్మా కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మొత్తంగా కార్యకర్తలు, నాయకులు లేక గాంధీభవన్​ వెలవెలబోతోంది.. గడువు సమీపిస్తుండడంతో పెద్దలు బుజ్జగింపు పర్వం షురూ చేసి పరిస్థితిని కొలిక్కితెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదు. అభ్యర్థులు ఉన్నచోట టికెట్లు ఇవ్వడం లేదు. వర్గాలు, ఎన్నికల తర్వాత పార్టీలో ఉండరంటూ దూరం పెడుతున్నారు. దీంతో ఆశావాహులు, వారి కోసం నేతలు రాక గాంధీభవన్​ వెలవెలబోతోంది. గ్రేటర్​ ఎన్నికల వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థులు ఖరారు చేస్తూ వరుస సమావేశాలతో పార్టీ కార్యాలయాలు నిండుగా ఉండగా… గాంధీభవన్​ మొత్తం వెలవెలబోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు నేతలెవ్వరూ అటు వెళ్లలేదు. ఇక గ్రేటర్​లో టికెట్​ ఆశిస్తు వచ్చిన వారిని దూరం పెడుతున్నారని, తాను సూచించిన వారికి ఇవ్వడం లేదంటూ సిటీ కాంగ్రెస్​ అధ్యక్షుడు అంజన్​ కుమార్​ యాదవ్​ అలకబూని, పార్టీని వీడుతానంటూ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్​, ఆయన తనయుడు రవి యాదవ్​ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ మేయర్​ కార్తీకరెడ్డి కూడా పార్టీని వదిలారు.

మల్కాజిగిరికే పరిమితం..

కాంగ్రెస్​ పార్టీ గ్రేటర్​ ఎన్నికల కోసం కో ఆర్డినేషన్​ కమిటీలను, ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గానికి ఇన్​చార్జిలను నియమించింది. కోఆర్డినేటర్లంతా డివిజన్లలో అభ్యర్థులను ఖరారు చేయాలని, బుధవారం సాయంత్రం వరకే జాబితాను పూర్తి చేసి గురువారం బీఫారాలు అందించాలని సూచించారు. కానీ మల్కాజిగిరి పార్లమెంట్​ నియోజకవర్గం మినహాయిస్తే ఒక్క సెగ్మెంట్​కు సంబంధించిన సమావేశాలు కాలేదు. సికింద్రాబాద్​ సమావేశానికి రాత్రి వరకు కూడా నేతలు రాలేదు. ఇలా ప్రతి సెగ్మెంట్​కు నేతలు డుమ్మా కొట్టారు. మల్కాజిగిరి సెగ్మెంట్​లో మాత్రం రేవంత్​రెడ్డి 29 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ జాబితాను మాత్రమే టీపీసీసీ విడుదల చేసింది.

కోఆర్డినేటర్ల నియామకం..

ఈ నేపథ్యలో పలు ప్రాంతాల్లో ఇన్​చార్జిలను మార్చడంతో అసలు అభ్యర్థులు లేక కష్టాల్లో ఉన్న పార్టీకి కో ఆర్డినేటర్లను మార్చడంలో అంతర్యమేమిటో తెలియడం లేదంటూ నేతలు మండిపడుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గానికి బుధవారం మళ్లీ ఇన్​చార్జీలను ప్రకటించినట్లు ​ ప్రకటించారు. పొన్నం ప్రభాకర్​ కోఆర్డినేటర్​గా ఉండగా మహేశ్వరం నియోజకవర్గానికి మల్​రెడ్డి రంగారెడ్డి, శేరిలింగపల్లికి మధుయాష్కి గౌడ్​, రాజేంద్రనగర్​కు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, వేణుగౌడ్​, జ్ఞానేశ్వర్​ ముదిరాజ్ ను నియమించారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్​కు జీవన్​రెడ్డి, వేణుగోపాలరావు కో ఆర్డినేటర్లుగా, ఎల్​బీనగర్​ సెగ్మెంట్​కు పటేల్​ రమేష్​రెడ్డి, ఉప్పల్​కు ఎమ్మెల్యే సీతక్క, కూకట్​పల్లికి బలరాం నాయక్​, కుత్భుల్లాపూర్​కు విజయరమణారావు, సుభాష్​రెడ్డి, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్​కు మల్లు రవి, కౌషిక్​ యాదవ్​ను కో ఆర్డినేటర్లుగా నియమించారు.

చలో… చలో…

గ్రేటర్​లో కాంగ్రెస్​ పార్టీ నాల్గో స్థానంలోనైనా ఉంటుందా… లేదా ఒక్కరు కూడా గెలువకుండా ఉనికి కోల్పోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని మారేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు బీజేపీలో చేరారు. కారు నిండుగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా కమలం వైపు వెళ్తున్నారు.

ఆగండి ప్లీజ్​..

పార్టీ మారేందుకు సిద్ధమైన వారిని నేతలు వారిస్తున్నారు. టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​, ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి ఈ బాధ్యతలను తీసుకున్నారు. పార్టీ తరఫున బరిలో నిలిపేందుకు అభ్యర్థులే దొరకడం లేదని, దొరికిన ప్రాంతాల్లో వర్గాలు అంటూ టికెట్​ ఇవ్వడం లేదని, ఈ పార్టీలో ఉండలేమంటూ తెగేసి చెప్పుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడవద్దంటూ రేవంత్​, ఉత్తమ్​, కొండా విశ్వేశ్వర్​రెడ్డి బతిమిలాడుతున్నారు.

ఎందుకీ సమావేశాలు..

మరోవైపు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్ల నియామకం ఎందుకంటూ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలే కష్టకాలంలో ఉంటే ఇప్పుడు కో ఆర్డినేటర్లు రావడం, టికెట్లపై చర్చించడం, సిద్ధంగా ఉన్నవారిని వద్దనడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్థానికంగా ఏండ్ల నుంచి ఉన్న నేతలను కాకుండా కో ఆర్డినేటర్లను వేస్తే వారు ఏం చేస్తారని, స్థానిక నేతల గురించి ఏం తెలుసంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో కో ఆర్డినేటర్లు సమావేశాలకు రాకుండా ముఖం చాటేస్తున్నారు. గాంధీభవన్​లో మల్కాజిగిరి పార్లమెంట్​ సెగ్మెంట్​ సమావేశం మినహా ఏ సమావేశం నిర్వహించలేదు. చాలా మంది సీనియర్లు అటు రావడమే మర్చిపోయారు. ఎన్నికల వేళ హడావుడిగా ఉండాల్సిన గాంధీభవన్​ మొత్తం కళ తప్పింది.

Next Story

Most Viewed