రైతు చట్టాలపై పోరాడిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు : బండి

by  |
Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : రైతు చట్టాలపై పోరాడిన సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర శాఖ తరుఫున కృతజ్ఞతలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందట. ఆయన దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా.. పంజాబ్ రైతుల కోసమా అని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష చేసింది ధాన్యం కొనుగోలు గురించని.. రైతు చట్టాలపై కాదని, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అంటూ నిలదీశారు. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు

కేసీఆర్‌ను ఫార్మ్ హౌజ్ నుంచి ప్రగతి భవన్‌కు రప్పించామని, ధర్నా చౌక్ వద్ద పరిసర ప్రజలకు ఇబ్బంది అవుతోందని రద్దు చేసిన ధర్నా చౌక్‌లోనే మళ్లీ దీక్ష చేసేలా చేశామని అన్నారు. కేంద్ర చట్టాలకు జై అన్న కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయాడో తెలియదన్నారు. రైతుల పంట కొనండి అంటే కేసీఆర్ వినలేదని, వానకు తడిచి రైతులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.

తెలంగాణలో రైతులు పంట వేసేందుకు ఇబ్బందే.. అమ్మేందుకు కూడా ఇబ్బందేనని విచారం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఆలోచించేది బీజేపీ అని.. మిల్లర్ల కోసం ఆలోచించేది కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నాడని, కొనుగోలు కేంద్రాలను పర్యటించేందుకు వెళ్తే దాడి చేశారని, ఆ రక్తంతో ధాన్యం ఎరుపెక్కిందని బండి అన్నారు.

వానాకాలం పంటకు 40 లక్షల టన్నుల బియ్యం, 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం(వడ్లు) కొంటామని లేఖ ఇచ్చిందా నిజం కాదా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తేవద్దు అంటే ఎక్కడికి తీసుకెళ్లాలి.. నీ ఫార్మ్ హౌజ్ కా అని మండిపడ్డారు. తెలంగాణలో 2019లో 419, 2020లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

జాతీయ రాజకీయాల కోసం మళ్లీ నాటాకాలు స్టార్ట్ చేశాడని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు, నిరుద్యోగ భృతికి పైసలు లేవు.. కానీ అక్కడి రైతులకు మాత్రం ఎలా వచ్చాయి.. పీఎం అయితడేమో మరి.. అందుకే 3 లక్షలు ఇస్తున్నాడు అని ఎద్దేవా చేశారు.

నువ్వు, నీ కొడుకు వల్ల 20 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారని, తెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. వారికి ఎందుకు ఇవ్వవు రూ.20 లక్షలు అని ప్రశ్నించారు. 1400 మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది వారికి ఇచ్చావా? నోటిఫికేషన్లు వేయక నిరుద్యోగులు చనిపోతే వారికి ఎందుకు ఇవ్వలేదు రూ.20 లక్షలు అంటూ బండి సంజయ్ సీఎంను నిలదీశారు.



Next Story

Most Viewed