బ్రెజిల్‌ను ముంచెత్తిన వర్షాలు..57 మంది మృతి:150ఏళ్ల రికార్డు బ్రేక్

by Dishanational2 |
బ్రెజిల్‌ను ముంచెత్తిన వర్షాలు..57 మంది మృతి:150ఏళ్ల రికార్డు బ్రేక్
X

దిశ, నేషనల్ బ్యూరో: సౌత్ బ్రెజిల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ఘటనల్లో ఇప్పటి వరకు 57 మందికి పైగా మృతి చెందినట్టు ఆ దేశ పౌర రక్షణ ఏజెన్సీ తెలిపింది. మరో 74 మంది గాయపడగా, 74000 మంది నిరాశ్రయులయ్యారని వెల్లడించింది. అంతేగాక 67 మంది గల్లంతైనట్టు పేర్కొంది. బ్రెజిల్‌లోని రియో ​​గ్రాండే డో సుల్ రాష్ట్రం వరదల కారణంగా ఎక్కువగా ప్రభావితమైంది. ఇక్కడ నీటి మట్టం ఎక్కువగా పెరగడంతో డ్యామ్, డ్రయినేజీలు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్డు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

రియో గ్రాండే డో సుల్ రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రే నగరం మీదుగా ప్రవహించే గుయాబా నది అత్యంత ప్రమాదకరంగా 5.04 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. 1941 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీని కారణంగా డ్యామ్ లు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా 3కి పైగా హైడ్రో ప్లాంట్లు మూతపడగా తీవ్ర తాగునీటి కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది.

బ్రెజిలియన్ జియోలాజికల్ సర్వీస్ ప్రకారం.. కొన్ని నగరాల్లో కురిసిన వర్ష పాతం దాదాపు 150 ఏళ్ల క్రితం రికార్డును బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే శనివారం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మానిటరింగ్ అండ్ అలర్ట్ ఆఫ్ నేచురల్ డిజాస్టర్స్‌లో ప్రధాన వాతావరణ శాస్త్రవేత్త మార్సెలో సెలూచీ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఎల్‌నినో కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed